టైటిల్: రామన్న యూత్
నటీనటుటు: అభయ్ నవీన్, అనిల్ గీలా, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, అమూల్య రెడ్డి, జగన్ యోగిబాబు, బన్నీ అభిరామ్, తదితరులు
నిర్మాణ సంస్థ: ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ
రచన-దర్శకత్వం: అభయ్ నవీన్
సంగీతం:కమ్రాన్
సినిమాటోగ్రఫీ: పహాద్ అబ్దుల్ మజీద్
విడుదల తేది: సెప్టెంబర్ 15, 2023
కథేంటంటే..
సిద్దిపేట జిల్లా ఆంక్షాపూర్ గ్రామానికి చెందిన నలుగురు యువకుల కథే రామన్న యూత్. గ్రామానికి చెందిన రాజు(అభయ్ నవీన్)కి ఎమ్మెల్యే రామన్న (శ్రీకాంత్ అయ్యంగార్) అంటే పిచ్చి. ఆయన వెంట తిరిగి ఎలాగైనా లీడర్‌గా ఎదగాలని ఆశపడతాడు. అతని స్నేహితులు చందు(జగన్ యోగిబాబు), రమేశ్(బన్నీ అభిరామ్), బాలు(అనిల్ గీలా)లతో కలిసి ఊర్లో యువనాయకుడు అనిల్(తాగోబోతు రమేశ్)తో తిరుగుతుంటారు. రామన్న యూత్ అసోసియేషన్ పెట్టి తనకు తాను లీడర్‌గా ప్రకటించుకుంటాడు.
దసరా పండగ రోజు ఎమ్మెల్యే రామన్న, అనిల్‌లతో కలిసి ఉన్న ఓ ఫ్లెక్సీ కట్టిస్తాడు. అందులో అనిల్ తమ్ముడు మహిపాల్(విష్ణు) ఫోటో ఉండదు. దీంతో పగ పెంచుకున్న మహిపాల్ రాజు గ్యాంగ్‌ని అనిల్‌తో కలవకుండా అబద్దాలు చెప్పి చిచ్చు పెడతాడు. ఓ దశలో లేబర్ గాళ్లు మా అన్న పేరు చెడగొడుతున్నారని రెచ్చగొడతారు. దీంతో మహిపాల్‌కు, రాజు గ్యాంగ్‌కి గొడవ అవుతుంది. అప్పుడు దమ్ముంటే తన అన్న సాయం లేకుండా ఎమ్మెల్యేను కలవాలని రాజు గ్యాంగ్‌కి ఛాలేంజ్ విసురుతాడు.
ఆ ఛాలేంజ్‌ని సీరియస్ తీసుకున్న రాజు గ్యాంగ్ ఎమ్మెల్యేను కలవాలని సిద్ధిపేటకు వెళ్తారు. మరి అనుకున్నట్లే రాజు గ్యాంగ్ ఎమ్మెల్యేను కలిశారా? వీళ్లంతా హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లారు? అక్కడ వీళ్లు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? జైలు పాలు ఎందుకయ్యారు? తన ప్రియురాలు (అమూల్యారెడ్డి)తో రాజు ప్రేమ ఫలించిందా? చివరకు రాజు లీడర్ అయ్యాడా లేదా? రాజు గ్యాంగ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి అనేది తెలియాలంటే రామన్న యూత్ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
రాజకీయాల్లో కిందిస్థాయిలో తిరిగే ఓ యువకుడి కథ ఇది. సరైన నాయకుడిని ఎంచుకోకుండా.. ఆ పార్టీ జెండాలు మోస్తూ తిరిగితే చివరకు ఏం అవుతుందనేది కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించారు. ఒక రాజకీయ నాయకుడు తన అవసరాల కోసం యువతను ఎలా వాడుకుంటుంది? నాయకుడిని నమ్ముకొని సొంతవాళ్లను పట్టించుకోకుండా, ఏం పని చేయకుండా అవారాగా తిగిరితే చివరకు మధ్యతరగతి యువకుడి గతేమవుతుందనే మంచి సందేశాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు.
దర్శక హీరో నవీన్ ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. అయితే దాన్ని తెరపై చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. కథంతా పల్లెటూరి నేపథ్యంలో ఒక పాయింట్ చుట్టే తిరుగుతుంది. తెలంగాణ నేటివిటితో వినోదాత్మకంగా ఈ సినిమా సాగుతుంది కానీ ఎమోషనల్‌గా మాత్రం పెద్దగా కనెక్ట్ కాదు. సీన్ల పరంగా, క్యారెక్టర్ డిజైన్ల పరంగా బాగానే ఉంది కానీ బలమైన కథ లేకపోవడం మైనస్.
అయితే దర్శకుడిగా నవీన్‌కి ఇది తొలి సినిమానే అయినప్పటికీ.. కొన్ని విషయాల్లో ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా అనిపించింది. నటీనటులంతా కొత్తవాళ్లు అయినప్పటికీ వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. సాంకేతిక అంశాలపై తనకు ఉన్న పట్టును చూపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. సినిమాను చాలా నేచురల్‌గా తెరకెక్కించాడు. హీరో గ్యాంగ్ చేసే దావత్, ముచ్చట్లు, వారి ఆలోచనలు..ఇవన్నీ వాస్తవికంగా ఉంటాయి. గ్రామాల్లో ఉండే యువత బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాల్లో బలమైన కథ లేదు కానీ.. ఎక్కడ బోర్ కొట్టదు. అసభ్యతకు పాల్పడకుండా కుటుంబసమేతంగా సినిమా చూసేలా తెరకెక్కించాడు. తెలంగాణ యువతకు బాగా కనెక్ట్ అవుతుంది.
ఎవరెలా చేశారంటే..
అభయ్ నవీన్, అనిల్ గీలా, జగన్ యోగిబాబు, బన్నీ అభిరామ్, విష్ణు పాత్రల చుట్టే ఈ కథ తిరుగుతుంది. లీడర్ అవ్వాలని కలలు కనే మధ్యతరగతి యువకుడు రాజుగా అభయ్ చక్కగా నటించాడు. అనిల్ గీలా, జగన్ యోగిబాబు కామెడీ బాగా పండించాడు. తండ్రికి భయపడినట్లు నటిస్తూనే.. బయట దోస్తానాతో తిరుగుతూ గప్పాలు కొట్టే క్యారెక్టర్ అనిల్‌ది. ఇక ఆన్‌లైన్ పేకాట ఆడుతూ వయసు కంటే చిన్న వాళ్లతో స్నేహం చేస్తూ ఆవారాగా తిరిగే పాత్ర జగన్ యోగిబాబుది. ఇక విష్ణు పాత్ర ఈ సినిమాకు చాలా కీలకమైంది.
జెలసీతో రగిలిపోయే మహిపాల్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు.ఎప్పుడూ తాగుబోతుగా కనిపించే రమేష్..ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్నాడు. ఎమ్మెల్యే రామన్నగా శ్రీకాంత్ అయ్యంగార్ తన పాత్రమేర చక్కగా నటించాడు. యాదమ్మ రాజు, జబర్దస్త్ రోహిణి, ఆనంద చక్రపాణి, వేణ/ పొలసానితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కమ్రాన్ నేపథ్య సంగీతం బాగుంది. పహాద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ, రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్‌ల ఎడిటింగ్ పర్వాతేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నంతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment