ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లాలనుకుంటే తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవలే చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్లే సమయంలోనూ అల్లు అర్జున్ మేనేజర్‌కు రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై మరోసారి నోటీసులు అందజేశారు.
అసలేం జరిగిందంటే..
కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప 2 విడుదలకు ముందు రోజు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede) జరిగింది. అక్కడకు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
(ఇది చదవండి: అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు)
అల్లు అర్జున్ అరెస్ట్..
ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయాన్నే జూబ్లీహిల్స్‌లోని ఐకాన్ స్టార్ ఇంటికి వెళ్లిన పోలీసులు చిక్కడపల్లి పీఎస్‌కు తీసుకొచ్చారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత బన్నీని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రిమాండ్ విధించింది.
మధ్యంతర బెయిల్‌పై విడుదల..
అయితే అరెస్ట్ అయిన రోజే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్ న్యాయవాదులు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అల్లు అర్జున్‌కు నాలుగువారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ అరెస్ట్ అయిన రోజు బెయిల్‌కు సంబంధించిన ప్రక్రియ ఆలస్యం కావడంతో బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆ రోజు రాత్రి అల్లు అర్జున్ జైలులోనే గడిపారు.
(ఇది చదవండి: తొక్కిసలాట ఘటన: నాంపల్లి కోర్టుకు సంధ్య థియేటర్ యాజమాన్యం)
ఉదయం రిలీజ్..
బెయిల్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరుసటి రోజు ఉదయం బన్నీ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ప్రముఖులంతా బన్నీని కలిసి పరామర్శించారు. ఆ తర్వాత అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ కేసు నమోదైన తర్వాత తొలిసారి చిరుతో భేటీ అయ్యారు.
రేవతి కుటుంబానికి ఆర్థియసాయం..
ఈ ఘటన తర్వాత రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ ఆర్థిక సాయం అందించింది. అల్లు అర్జున్ తరఫున అల్లు అరవింద్ కోటీ రూపాయల చెక్ అందజేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సైతం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పరామర్శించిన దిల్‌రాజు..
సినీ ఇండస్ట్రీ తరఫున తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఆస్పత్రి వెళ్లి ఆరా తీశారు. శ్రీతేజ్ ఫ్యామిలీకి అన్ని విధాలా సాయం చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని దిల్ రాజు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment