సూర్యకిరణ్
సుమంత్ హీరోగా నటించిన ‘సత్యం’ చిత్రంతో దర్శకునిగా పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నారు సూర్యకిరణ్. ఆ తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్ 4’లో పాల్గొన్నారు. అయితే తొలి వారమే ఎలిమినేట్ అయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో సూర్యకిరణ్ చెప్పిన విశేషాలు.
► నేను ‘బిగ్‌బాస్’లో పాల్గొనడానికి ఓ కారణం ఉంది. ‘సత్యం’ సినిమా హిట్టయిన తర్వాత నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. తర్వాత కొన్ని సినిమాలు చేశాను. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో చెన్నై వెళ్లిపోయాను. ఆ టైమ్‌లో నేను చనిపోయానని న్యూస్ వచ్చింది. ‘ఇలాంటి న్యూస్ వచ్చిందేంటి’ అనుకుని మళ్లీ ఓ సినిమా డైరెక్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఉగాదికి షూటింగ్ మొదలుపెడదామని అన్నీ రెడీ చేసుకున్నాక కరోనా వల్ల లాక్‌డౌన్ వచ్చింది. ఈ టైమ్‌లో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్‌బాస్ లాంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌తో రీ ఎంటర్ అయితే అందరికీ తెలుస్తుంది కదా అని పాల్గొన్నాను.
► బిగ్‌బాస్ హౌస్‌లో ఓ మూడు నాలుగు వారాలు ఉందామనుకుని వెళ్లాను. ఆ తర్వాత బయటకు వచ్చి డిసెంబర్‌కల్లా షూటింగ్ పూర్తి చేయాలనేది నా ఆలోచన. కానీ, అనుకోకుండా మొదటివారమే బయటకి వచ్చేశాను. ఒక వారం రోజులపాటు ఓ కొత్త అనుభూతిని అనుభవించాను. బాగానే ఉంది. కాకపోతే ఆర్టిఫిషియల్‌గా అనిపించింది.
► నర్సరీ, ఫస్ట్‌క్లాస్ స్కూల్లో టీచర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో బిగ్‌బాస్ నాకు అలా అనిపించింది. నేను ఒక కాలేజీ ప్రొఫెసర్‌లా ఉండి.. టీచర్ లేని స్కూల్లో స్టూడెంట్‌లా ఉండటం అంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అందరూ హరీబరీగా మాట్లాడుతుంటారు.
► బ్యాడ్‌టైమ్ ఉంటే తాడు కూడా పామై కరుస్తుంది అంటారు. అలా అయ్యింది నా టైమ్. బాలనటునిగా రెండు స్టేట్ అవార్డులు, మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. టీవీ సీరియల్ చేస్తే ఢిల్లీలో అవార్డు ఇచ్చి, సన్మానించారు. డైరెక్టర్‌గా సినిమా చేస్తే అది పెద్ద హిట్. ఇలా విజయవంతంగా సాగిన నా లైఫ్ ఒక్కసారిగా రివర్స్ అయ్యింది. ఒక ఏడేళ్లపాటు పెద్ద గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌ను కట్ చేయటానికి బిగ్‌బాస్‌కి వచ్చాను. అంతేకానీ వాళ్లిచ్చే 50 లక్షల ప్రైజ్‌మనీ కోసం రాలేదు.
► బిగ్‌బాస్ హౌస్‌లో మంచి విషయాలు చెబితే వినిపించుకునేవాళ్లు లేరు. చేదు మందుని పంచదారతో ఇస్తారు కదా. నేను షుగర్ లేకుండా చేదుగా ఇచ్చేవాణ్ణి. ఆరోగ్యం బాగుండటానికి చేదు మందు ఇస్తున్నానని వాళ్లు గ్రహించలేదు. బిగ్‌బాస్ హౌస్‌లో షుగర్ ఉన్నవాళ్లకే షుగర్ ఇస్తున్నారు. అది వాళ్లకే సమస్య అని రెండు మూడు వారాల్లో తెలుసుకుంటారు. రకరకాల మైండ్ సెట్ ఉన్న ఇంతమందితో కలిసి ఉంటానని నేనెప్పుడూ అనుకోలేదు. నాకు ప్రతి రోజూ చాలా భారంగా గడిచింది. అక్కడ ఉన్నవాళ్లలో కొంతమంది ‘సార్.. అప్పుడే రెండు రోజులైంది’ అనేవారు. నేనేమో.. ‘రెండు రోజులే అయ్యిందా’ అనుకునేవాణ్ణి.
► ఒక్క రాజశేఖర్ (అమ్మ రాజశేఖర్) తప్ప హౌస్‌లో పెద్దగా సినిమావాళ్లెవరూ లేరు. మిగతావాళ్లకు బిగ్‌బాస్ ఒక మంచి ప్లాట్‌ఫామ్ అవుతుంది. హౌస్‌లో చాలావరకూ ఆర్టిఫిషియల్‌గా నవ్వేవారు. ఎప్పుడూ బిర్యానీని చూడనట్లు బిహేవ్ చేసేవారు. వర్షం పడుతుంటే అబ్బబ్బా.. వర్షం అంటుంటారు. హౌస్‌లో ఉన్నవాళ్లంతా మనకన్నా చాలా తెలివిగలవాళ్లు, నాకంత తెలివి లేదు. ఓవర్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటేనే ఫుటేజ్ టెలికాస్ట్ చేస్తారని తెలిసింది వాళ్లకు, అందుకే వాళ్లంతా అలా చేస్తారేమో. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రెండు కథలు రెడీగా ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలు చెబుతాను.
Comments
Please login to add a commentAdd a comment