కంప్యూటర్ వదలి నాగలి పట్టి, వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. చావు కబురు చల్లగా చెబుతాడు మరో యువకుడు. గ్రామంలో జరిగే ఊహించని పరిణామాలకు భయపడతారు గ్రామప్రజలు. ఒక గ్యాంగ్‌స్టర్ అండర్‌వరల్డ్‌ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఈ నాలుగు కథలూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈలోపు నాలుగు సినిమాలకు సంబంధించిన చిన్న శాంపిల్‌ని ట్రైలర్, టీజర్ రూపంలో చూపించాయి ఆయా నిర్మాణసంస్థలు. శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’, కార్తికేయ చేసిన ‘చావు కబురు చల్లగా..’, సముద్రఖని ‘ఆకాశవాణి’, రామ్‌గోపాల్‌వర్మ ‘డి కంపెనీ’ సినిమాలకు సంబంధించి కొత్త విశేషాలు బయటకొచ్చాయి.
జోడీ కుదిరింది
‘‘రామ్‌తో కలిసి సినిమా చేయబోతున్నందుకు సూపర్ డూపర్ ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి పేరుని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెనే ఎంపిక చేసినట్లు శుక్రవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.
మట్టికి.. మనిషికి మధ్య ప్రేమకథ
ఉద్యోగం చేస్తున్న కంపెనీ యూఎస్ బ్రాంచ్‌కి మేనేజర్ కావాల్సిన యువకుడు వ్యవసాయం కోసం పొలంలో కాలు పెట్టాడు. నాగలి పట్టాడు. మట్టికి మనిషికి మధ్య ఉన్న ప్రేమకథను మరోసారి గుర్తు చేయడానికి శ్రీకారం చూట్టాడు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన¯Œ హీరో హీరోయిన్లుగా కిశోర్ దర్శకత్వం వహించిన ‘శ్రీకారం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. కిశోర్ దర్శకత్వంలో గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది.
బస్తీ ప్రేమకథ
అబ్బాయి శవాలబండి డ్రైవర్. అమ్మాయి నర్స్. అబ్బాయికి అమ్మాయిపై లవ్వు. కానీ అమ్మాయికి అబ్బాయంటే కోపం. మరి.. ప్రేమకథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నకు ‘చావు కబురు చల్లగా..’లో సమాధానం దొరుకుతుంది. కార్తికేయ, లావాణ్యా త్రిపాఠీ జంటగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన చిత్రం ‘చావు కబురు చల్లగా..’. కౌశిక్ దర్శకుడు. ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో బస్తీ బాలరాజుగా కార్తికేయ, మల్లిక పాత్రలో లావణ్యా త్రిపాఠీ నటించారు.
గ్రామంలో అలజడి
అడవికి దగ్గరగా ప్రశాంతంగా ఉన్న ఓ గ్రామంలో ఊహించని అలజడి రేగుతుంది. భయంతో గ్రామస్తులు రాత్రివేళ దేనికోసమో అన్వేషిస్తుంటారు. ఆ గ్రామంలో ఏం జరిగింది? అనే మిస్టరీ వీడాలంటే ‘ఆకాశవాణి’ చూడాల్సిందే. సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో అశ్వి¯Œ గంగరాజు దర్శకత్వంలో పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆకాశవాణి’. దీని టీజర్‌ను దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేశారు.
ఆ స్థాయికి ఎలా ఎదిగాడు?
రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘డి– కంపెనీ’. అక్షత్ కాంత్, ఇర్రా మోర్, నైనా గంగూలీ, రుద్ర కాంత్ ప్రధాన పాత్రల్లో స్పార్క్ సాగర్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘‘గ్యాంగ్‌స్టర్ స్థాయి నుంచి అండర్ వరల్డ్‌ని శాసించే స్థాయికి దావూద్ ఇబ్రహీం ఎలా ఎదిగాడు? 1993లో ముంబయ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల సూత్రధారి ఎవరు? అనే అంశాలను ప్రస్తావించాం. ఈ 26న తెలుగు, హిందీలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment