సమంత... ఇక్కడ స్టార్ హీరోయిన్..
ఆలియా భట్... ఇక్కడ స్టార్..
శోభితా ధూళిపాళ్ల... ఇక్కడ ఫామ్‌లోకి వస్తున్నారు..
అయితే ఈ ముగ్గురూ అక్కడ ‘తొలి పరిచయం’. ‘అక్కడ’ అంటే.. హాలీవుడ్‌లో!
ఈ ముగ్గురూ హాలీవుడ్‌కి తొలిసారిగా పరిచయం కానున్నారు. ఆ వివరాల్లోకి వెళదాం..
హీరోయిన్‌గా సౌత్‌లో సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు యాభై సినిమాలు చేసిన సమంత కెరీర్‌లో సక్సెస్ రేట్ బాగానే ఉంది. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. సౌత్ సంగతి ఇలా ఉంటే.. అటు నార్త్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2’ వెబ్ సిరీస్‌లోని రాజీ పాత్రలో అద్భుతంగా నటించి బీ టౌన్ ప్రేక్షకుల మనసులను కూడా గెల్చుకున్నారామె. ఇప్పుడు సమంతకు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఇక హాలీవుడ్‌లోనూ నటిగా తన సత్తా చాటాలనుకుంటున్నారీ బ్యూటీ. ఇంగ్లిష్ ఫిల్మ్ ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’లో సమంత లీడ్ రోల్ చేయనున్నారు. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే బుక్ ఆధారంగా ఈ సినిమాను హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ జాన్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ఆరంభం కానుంది.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆలియా భట్‌ది సెపరేట్ క్రేజ్ అనే చెప్పాలి. ఇటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే అటు ‘రాజీ’, ‘గంగూబాయి కతియావాడి’ వంటి చిత్రాలతో నటిగా తన ప్రతిభను మరింత నిరూపించుకున్నారు ఆలియా. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్’తో దక్షిణాది ప్రేక్షకులనూ పలకరించారామె. ఇప్పుడు హిందీలో తన సీనియర్స్ ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్‌ల మాదిరి హాలీవుడ్‌కి వెళుతున్నారు ఆలియా. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ వెబ్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంగ్లిష్ యాక్టర్స్ గాల్ గాడోట్, జామీ డోర్నన్‌లతో కలిసి ఆలియా నటిస్తున్నారు. స్పై డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు టామ్ హార్పర్ దర్శకుడు. వచ్చే ఏడాది ఈ వెబ్ ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
మరోవైపు ఫామ్‌లోకి వస్తున్న తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల హాలీవుడ్‌కి హాయ్ చెప్పారు. స్వీయ దర్శకత్వంలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ నటుడు దేవ్ పటేల్ నటించిన ‘మంకీ మేన్’ చిత్రంలో శోభిత ఓ లీడ్ రోల్ చేశారు. శోభితాకు ఇది తొలి హాలీవుడ్ ఫిల్మ్ అయితే దర్శకుడిగా దేవ్ పటేల్‌కు తొలి చిత్రం. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ అవుతుంది. తెలుగులో ‘గూఢచారి’, మలయాళంలో ‘కురూప్’, హిందీ ‘ఘోస్ట్ స్టోరీస్’తో శోభిత నటిగా నిరూపించుకున్నారు. ఆమె నటించిన ‘మేజర్’ జూన్ 3న రిలీజ్ కానుంది.
ఆ భాష.. ఈ భాష అని కాదు.. ఉన్నది ఒక్కటే భాష... అదే ‘సినిమా భాష’ అని పరిశ్రమవారు అంటుంటారు. అనడమే కాదు.. హద్దులు చెరిపేస్తున్నారు. భారతీయ చిత్రాలకే పరిమితం కాకుండా విదేశీ చిత్రాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో హాలీవుడ్‌లో నటించనున్న భారత నటీనటుల జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment