సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్.. తమిళం, తెలుగు తదితర భాషా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బహుళ ప్రాచుర్యం పొందారు. ఈయన దర్శకుడు పా.రంజిత్ చిత్రాలకు సంగీతాన్ని అందించి వెలుగులోకి వచ్చారు. అలా వీరి కాంబినేషన్‌లో అట్టకత్తి, కాలా, కబాలి వంటి పలు చిత్రాలు రూపొందాయి. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం వైరల్ అయ్యింది.
ఫేమస్ సాంగ్..
ఇటీవలే చైన్నెలో సంగీత కచేరిని భారీ ఎత్తున నిర్వహించిన సంతోష్ నారాయణన్ పలు ప్రైవేట్ ఆల్బమ్‌లను రూపొందించారు. అలా ఆయన సంగీతాన్ని అందించిన ప్రైవేట్ పాట ఎంజాయ్ ఎన్‌సామి.. 2021లో విడుదలవగా బాగా పాపులర్ అయ్యింది. ఎంతగా అంటే యూట్యూబ్ ఛానల్‌లో ఇప్పటి వరకూ 487 మిలియన్లకు పైగా వ్యూస్‌ను, 5 మిలియన్ లైక్స్‌ను పొందింది. అది సరే ఇప్పుడెందుకు దీని గురించి చెబుతున్నారు? అనిపిస్తోందా? దీనికి కారణం సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్‌నే.
ఇప్పటివరకు ఎక్కడా చెప్పలే..
ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఎంతో పాపులర్ అయిన ఎంజాయ్ ఎన్. సామి (కుక్కూ కుక్కూ..) పాట నిమిత్తం తనకు ఇప్పటి వరకూ ఒక్క పైసా ఆదాయం రాలేదని, అంతా ఆ పాటను తెరకెక్కించిన మ్యూజిక్ సంస్థకే చేరిందని పేర్కొన్నారు. ఈ విషయం గురించి తాను ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదని, ఇప్పుడు చెప్పాలనిపించిందన్నారు. కాగా ప్రస్తుతం సంగీత కళాకారులకంటూ ప్రైవేట్ పాటల కోసం ఒక ప్లాట్‌ఫామ్ అవసరం ఉందని, అందుకే తాను ఒక మ్యూజిక్ స్టూడియోను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇకపై సంగీత కళాకారులు బాధ పడాల్సిన అవసరం ఉండదని, మీకు చేరాల్సింది కచ్చితంగా చేరుతుందని సంతోష్ నారాయణన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment