![Sebi Disposes Of Disclosure Lapses Case Against Shilpa Shetty - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/4/shilpa.jpg.webp?itok=OCMA00_5)
న్యూఢిల్లీ: షేర్‌హోల్డింగ్ వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి సెబీ విచారణ ఎదుర్కొంటున్న నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు ఊరట లభించింది. నిర్దేశిత పరిమితులకు లోబడే షేర్‌హోల్డింగ్ ఉన్నందున ఈ విషయంలో వారిపై చర్యలు అవసరం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అభిప్రాయపడింది. వివరాల్లోకి వెడితే 2015 మార్చిలో 25.75 శాతం వాటా కొనుగోలుతో వియాన్ ఇండస్ట్రీస్ (గతంలో హిందుస్తాన్ సేఫ్టీ గ్లాస్ ఇండస్ట్రీస్)కి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ప్రమోటర్లుగా మారారు. ఆ తర్వాత కంపెనీ కొన్ని షేర్లను ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ కింద కేటాయించింది.
ఈ షేర్ల కేటాయింపు విషయాన్ని నిర్దిష్ట సమయంలో నిబంధనలకు అనుగుణంగా వారు వెల్లడించలేదంటూ ఆరోపణలు వచ్చాయి. 2013 సెప్టెంబర్ నుంచి 2015 డిసెంబర్ మధ్య కాలంలో వియాన్ ఇండస్ట్రీస్ షేర్ల లావాదేవీలపై సెబీ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రిఫరెన్షియల్ కేటాయింపు తర్వాత కూడా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాల షేర్‌హోల్డింగ్ నిర్దిష్ట పరిమితికి లోబడే ఉందని, దీన్ని ప్రత్యేకంగా వెల్లడించాల్సిన అవసరం లేదని సెబీ అభిప్రాయపడింది. తదనుగుణంగా వారిపై ప్రారంభించిన చట్టపరమైన చర్యలను పక్కన పెడుతున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment