Shah Rukh Khan Fans Angry On Director Farhan Over Don 3 Movie SRK Replacement, Deets Inside - Sakshi
Sakshi News home page

Don 3 Shah Rukh Khan: 'డాన్' ఫ్రాంచైజీలో మరో సినిమా.. కాకపోతే!

Published Wed, Aug 9 2023 12:10 AM | Last Updated on Wed, Aug 9 2023 10:09 AM

Shahrukh fans angry with director Farhan - Sakshi

‘మా డాన్‌ షారుక్‌ ఖాన్‌... వేరే ఎవర్నీ ఊహించలేం’ అంటూ మంగళవారం పలువురు షారుక్‌ ఖాన్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న అబిప్రాయాలు వైరల్‌ అవుతున్నాయి. ‘డాన్, డాన్‌ 2’ తర్వాత రానున్న ‘డాన్‌ 3’లో షారుక్‌ నటించరన్న వార్త గుప్పుమనడంతో ‘‘షారుక్‌ ప్లేస్‌లో వేరే డాన్‌ని చూడలేం’’ అంటున్నారు ఫ్యాన్స్‌. మంగళవారం ఫర్హాన్‌ అక్తర్‌ చెప్పీ చెప్పనట్లు సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసిన పోస్ట్‌తో ‘డాన్‌ 3’ అంశం పై చర్చ ఊపందుకుంది. ఆ వివరాల్లోకి వెళదాం.. 

హిందీ తెరపై డాన్‌ అంటే అమితాబ్‌ బచ్చన్‌ గుర్తొస్తారు. ఆయన టైటిల్‌ రోల్‌లో రూపొందిన ‘డాన్‌’ (1978) సూపర్‌ డూపర్‌ హిట్టయింది. చంద్ర బారోత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అయిన బడ్జెట్‌ దాదాపు రూ 70  లక్షలు. కానీ వసూళ్లు రూ. 7 కోట్లు. అంటే.. పదింతల లాభం. డాన్‌గా అమితాబ్‌ యాక్షన్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదే సినిమా తెలుగు రీమేక్‌ ‘యుగంధర్‌’ (1979)లో ఎన్టీఆర్, తమిళ రీమేక్‌ ‘బిల్లా’లో రజనీకాంత్‌ నటించారు. దక్షిణాదిన కూడా ఈ డాన్‌ సూపర్‌ హిట్‌. 



ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌ 
అమితాబ్‌ బచ్చన్‌ డాన్‌ క్యారెక్టర్‌ అద్భుతంగా చేయడంతో ఇక డాన్‌ క్యారెక్టర్‌ అంటే ఆయనే అని ఫిక్స్‌ అయ్యారు బాలీవుడ్‌ ప్రేక్షకులు. అలాంటి తరుణంలో ‘నేను ఉన్నాను’ అంటూ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత షారుక్‌ ఖాన్‌ డాన్‌గా తెరపైకి వచ్చారు. షారుక్‌ డాన్‌ రోల్‌లో ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో ‘డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌’ (2006) రూపొందింది. అమితాబ్‌ ‘డాన్‌’కి రీ బూట్‌ వెర్షన్‌లా ఫర్హాన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

30 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేయించారు. ఇక అమితాబ్‌ తర్వాతి తరంలో డాన్‌ అంటే షారుక్‌ అనేలా కింగ్‌ ఖాన్‌ అద్భుతంగా నటించారు. షారుక్‌ సరసన ప్రియాంకా చోప్రా నటించారు. సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘డాన్‌’ దాదాపు రూ. 105 కోట్ల వసూళ్లు రాబట్టి, సంచలన విజయం సాధించింది.

ది కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ 
సిల్వర్‌ స్క్రీన్‌పై ఒక పాత్ర హిట్టయితే ఆ క్యారెక్టర్‌ని మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు ప్రేక్షకులు. అమితాబ్‌ ‘డాన్‌’ తర్వాత మళ్లీ డాన్‌ క్యారెక్టర్‌ని చూడాలనుకున్నారు. షారుక్‌ ‘డాన్‌’గా వచ్చి, అలరించారు. ఈ హిట్‌ డాన్‌ని అలా వదిలేస్తే ఎలా? మళ్లీ ఈ పాత్ర చేయాలని షారుక్‌ అనుకున్నారు. డాన్‌ కోసం కథలు తయారు చేయించాలని ఫర్హాన్‌ కూడా ఫిక్స్‌ అయ్యారు. అలా ‘డాన్‌: ది కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ సెకండ్‌ వెర్షన్‌ ఆరంభించారు.

‘డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌’ విడుదలైన ఐదేళ్లకు ‘డాన్‌ 2’ (2011)ని వెండితెరపైకి వదిలారు. ఇందులోనూ షారుక్‌ సరసన ప్రియాంకా చోప్రా నటించారు. ‘డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌’కి రెండింతల బడ్జెట్‌.. అంటే దాదాపు రూ. 80 కోట్లతో రూ΄పొందించారు. సుమారు రూ. 200 కోట్ల వసూళ్లతో రీబూట్‌ వెర్షన్‌లో వచ్చిన ఈ రెండో ‘డాన్‌’ కూడా ఘనవిజయం సాధించింది. ఫస్ట్‌ వెర్షన్‌కి ఫర్హాన్‌ దర్శకత్వం వహించి, ఓ నిర్మాతగా వ్యవహరించారు. రెండో వెర్షన్‌కి కూడా ఫర్హాన్‌ ఈ రెండు బాధ్యతలు చేపట్టగా, షారుక్‌ నటించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరించారు.  



‘డాన్‌ 3’లో రణ్‌వీర్‌ సింగ్‌? 
ప్రేక్షకులు, షారుక్‌ అభిమానులు డాన్‌ క్యారెక్టర్‌ని మరచిపోలేదు. షారుక్‌ కూడా డాన్‌ పాత్రతో అనుబంధం పెంచుకున్నారు. ఫర్హాన్‌కి కూడా ఆ పాత్ర అంటే మక్కువ. అందుకే 2011లో ‘డాన్‌ 2’ని రిలీజ్‌ చేసినప్పట్నుంచి ఇప్పటివరకూ ‘డాన్‌ 3’ గురించి ఏదో సందర్భంలో ఇద్దరూ మాట్లాడుతూ వచ్చారు. ‘డాన్‌ 3’ కచ్చితంగా ఉంటుందని ఫర్హాన్‌ చెప్పుకుంటూ వచ్చారు. త్వరలో మూడో వెర్షన్‌కి శ్రీకారం జరిగే అవకాశం ఉందని మంగళవారం ఫర్హాన్‌ సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసిన వీడియో స్పష్టం చేస్తోంది. ఆ వీడియోలో ‘3’ అంకె కనిపించడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో ‘డాన్‌’ థీమ్‌ మ్యూజిక్‌ వినబడుతోంది.

అలాగే కొత్త శకం ఆరంభం కాబోతోంది అని ఉంది. సో... ‘డాన్‌ 3’ రానుందని చాలామంది ఫిక్స్‌ అయ్యారు. అయితే ఫర్హాన్‌ నటీనటులను ప్రకటించలేదు. దాంతో ఒకవేళ షారుక్‌ ఖాన్‌ అని ఫిక్స్‌ అయ్యుంటే.. ప్రకటించి ఉండేవారు కదా అనే చర్చ మొదలైంది. అలాగే కొత్త డాన్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తారనే వార్త ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. సో.. థర్డ్‌ వెర్షన్‌లో నటించబోయేది రణ్‌వీరే అని షారుక్‌ ఫ్యాన్స్‌ ఫిక్స్‌ అయ్యారు. పైగా ‘కొత్త శకం ఆరంభం కాబోతోంది’ అన్నారు కాబట్టి హీరోని మార్చే ఆలోచనలో ఫర్హాన్‌ ఉన్నారని ఫ్యాన్స్‌ ఊహిస్తున్నారు.

కొందరు ఫ్యాన్స్‌ ఫర్హాన్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేస్తే షారుక్‌ చేయాలి.. లేదా ఈ సిరీస్‌కి ఫుల్‌స్టాప్‌ పడాలన్నట్లుగా స్పందిస్తున్నారు. మరోవైపు రణ్‌వీర్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి.. షారుక్‌ మళ్లీ డాన్‌గా కనిపిస్తారా లేక రణ్‌వీర్‌ తెర మీదకు వస్తారా? ఒకవేళ రణ్‌వీర్‌ వస్తే.. అప్పట్లో అమితాబ్‌కి దీటుగా నటించి, డాన్‌గా భేష్‌ అని షారుక్‌ అనిపించుకున్నట్లే రణ్‌వీర్‌ కూడా ప్రేక్షకుల మెప్పు ΄పొందగలుగుతారా? వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement