‘‘నేను వాణిజ్య అంశాలున్న కథలు మాత్రమే ఎంచుకోవాలనుకోవడం లేదు. అర్థవంతమైన, కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ చిత్రాలు చేసినా ఆర్గానిక్ (స్వచ్ఛమైన)వి చేస్తాను. నా తాజా చిత్రం ‘మను చరిత్ర’ ఆర్గానిక్‌గా ఉంటుంది’’ అని శివ కందుకూరి అన్నారు. నేడు (శుక్రవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం శివ కందుకూరి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఇంజనీరింగ్ పూర్తి చేసి నటనపై ఆసక్తితో ‘చూసి చూడంగానే’ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాను. రెండో సినిమా ‘గమనం’ మరింత పేరు తెచ్చింది. నేను ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు పూర్తిగా కనెక్ట్ అవ్వాలి. స్క్రిప్ట్‌పై నాకు నమ్మకం ఉండాలి. అల్లు అర్జున్‌గారు ‘పుష్ప’లోని పాత్రను నమ్మారు కాబట్టే ఆ సినిమా అందర్నీ మెప్పించింది.
మా నాన్న (రాజ్ కందుకూరి) నిర్మాతే అయినా నేనేంటో నిరూపించుకోవాలనేదే నా కోరిక. ఫ్యామిలీ నేపథ్యం ఉందని ఏది పడితే అది చేయకూడదు. ఏ సినిమా చేయాలి? ఏది చేయకూడదు? అనే నిర్ణయం నాపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం యువ హీరోల మధ్య పోటీ ఉన్నా పాజిటివ్ కోణంలోనే ఉంది. చిన్న బడ్జెట్ చిత్రాలకు, కొత్తవారికి ఓటీటీ ఒక వరం. అయితే థియేటర్స్‌కి ఏదీ పోటీ కాదు. నేను నటిస్తున్న తాజా చిత్రం ‘మను చరిత్ర’ చిత్రీకరణ పూర్తయింది. నూతన దర్శకుడు పురుషోత్తమ్ రాజ్‌తో ఓ సినిమాతో పాటు నానీగారు నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’ వెబ్ ఫిలిం చేస్తున్నాను. మరో వెబ్ సిరీస్ చర్చల్లో ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment