Baipan Bhari Deva on OTT: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. చిన్న సినిమాలు సైతం ఓటీటీల్లో అదరగొట్టేస్తున్నాయి. థియేటర్స్‌లో పెద్దగా ఆదరణ లభించని చిత్రాలకు సైతం.. ఓటీటీకి వచ్చేసరికి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం.. థియేట్రికల్ రిలీజ్‌లోనే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ బైపన్ భారీ దేవ మూవీ దాదాపు రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరాఠీ భాషలో తెరకెక్కిన బైపన్ భారీ దేవ చిత్రం బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రెండో స్థానంలో నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఒకటి కాదు.. ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది జూన్ 30న విడుదలైన ఈ సినిమా.. తాజాగా ఓటీటీలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుండగా.. మరొకటి హులు యాప్‌లో అందుబాటులో ఉంది. హాట్ స్టార్‌లో మరాఠీతోపాటు హిందీ భాషలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులు మాత్రం సబ్ టైటిల్స్‌లో మాత్రమే చూసే వెసులుబాటు ఉంది. ఈ సినిమాను ప్రస్తుతం హిందీ, మరాఠీ భాషల్లోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ చిత్రం మరో ఓటీటీ హులు యాప్‌లో కేవలం అమెరికాలో మాత్రమే ఉంది. అక్కడ ఉన్న వారికి మాత్రమే బైపన్ భారీ దేవ చిత్రాన్ని వీక్షించే అవకాశం ఉంది.
కాగా.. బైపన్ భారీ దేవ అంటే స్త్రీతత్వం కఠినమైనది అనే అర్థం వస్తుంది. ఈ చిత్రంలో రోహిణి హట్టంగడి, వందనా గుప్తే, సుకన్య కులకర్ణి, శిల్పా నవల్కర్, సుచిత్ర బాండేకర్, దీపా పరాబ్ ప్రధాన పాత్రలు పోషించారు. బైపన్ భారీ దేవ చిత్రానికి కేదార్ షిండే దర్శకత్వం వహించారు. అలాగే జీ స్టూడియోస్, ఎమ్‌వీబీ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ ఆరుగురు అక్కాచెల్లెళ్లకు సంబంధించిన విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment