లండన్/ముంబై: బాలీవుడ్ బంధాలపై హీరోయిన్ సోనం కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదృష్టవశాత్తూ తాను ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని పేర్కొన్నారు. కాగా హృతిక్ రోషన్- సుజానే ఖాన్, ఆర్బాజ్‌ఖాన్- మలైకా అరోరా, సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ వంటి పలు బీ-టౌన్ జంటలు ఇప్పటికే వైవాహిక బంధానికి స్వస్తి పలకగా, తాము కూడా విడిపోతున్నట్లు ఆమిర్ ఖాన్- కిరణ్ రావు శనివారం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వోగ్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనం మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘దేవుడి దయ వల్ల నేను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోలేదు. అందుకు నిజంగా కృతజ్ఞురాలిని. ఎందుకంటే, అక్కడ(బాలీవుడ్) పనిచేసే వాళ్ల ప్రపంచం సంకుచితంగా ఉంటుంది. బాలీవుడ్‌లో జరుగుతున్నది ఇదే. నాలాగా ఆలోచించే, ఫెమినిస్ట్‌ను పెళ్లాడటం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి’’ అని సోనం పేర్కొన్నారు. ఇక వివాహం తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ... ‘‘పెళ్లైన నాటి నుంచి ఈ ఏడాదే మేం ప్రతి రాత్రి కలిసి గడపగలుగుతున్నాం. ఎందుకంటే ముంబై- ఢిల్లీ- లండన్‌ల మధ్య ప్రయాణాలకే సమయం సరిపోయేది.
మాకు ఒకరి పట్ల ఒకరికి అవిజ్యామైన ప్రేమ ఉంది. ఇద్దరం కలిస్తే సంతోషాలకు కొదవే ఉండదు. లండన్‌లో ఒంటరిగా ప్రయాణించడం వల్ల చాలా విషయాలు నేర్చుకోగలిగాను. ఇక్కడ భారతీయులు, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన ఎంతో మంది ప్రజలను చూశాను. వాళ్లకి బాలీవుడ్ అంటే ఒక రకమైన పిచ్చి ఉంటుందని నాకు అర్థమైంది’’ అని చెప్పుకొచ్చారు. కాగా 2018లో సోనం కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment