
సాక్షి, హైదరాబాద్ : ‘వదల బొమ్మాళీ’ అంటూ రీల్ విలన్‌గా అభిమానులను ఆకట్టుకున్న విలక్షణ నటుడు సోనూ సూద్ కరోనా సంక్షోభం సమయంలో తన పెద్ద మనసుతో రియల్ హీరోగా అవతరించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా కూడా వదల బొమ్మాళీ తరహాలో వెంటాడుతున్నారు. కానీ వీరంతా వెంటాడుతున్నది మాత్రం తాము అభిమానించే రియల్ హీరోమీద ఉన్న అంతులేని అభిమానంతో. తాజాగా షిర్డీలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన పరిణామం గురించి తెలుసుకోవాలి. (వంద స్మార్ట్‌ఫోన్లు గిప్ట్ ఇచ్చిన రియల్ హీరో)
సోనూసూద్ షిరిడీ సాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. సోనూ సూద్ రాకతో ఆలయ అధికారులు, అర్చకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో అక్కడ అభిమానుల కోలాహం నెలకొంది. సోనూ వచ్చారనే వార్త తెలియగానే భక్తులతో పాటు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. సోనూని చూడగానే ‘రియల్ హీరో, రియల్ హీరో’.. ‘లవ్యూ సార్’.. అంటూ నినాదాలు చేశారు. ఫోటోలు క్లిక్‌మనిపిస్తూ.. వారంతా సందడి చేశారు. దీంతో సోనూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ సమయంలోఎందరో వలస కార్మికులను ఆపద్బాంధవుడిలా ఆదుకున్నవారిలో సోనూ సూద్ టాప్‌లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ఇప్పటికీ అవసరమైన వారికి సాయమందిస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దీనికి బాధితుల కృతజ్ఞతలతోపాటు, పలువురి ప్రశంసలను కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆచార్య యూనిట్ సభ్యులకు 100 స్మార్ట్‌పోన్లను ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. కాగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో సోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సోనూ సూద్ ప్రత్యేక పాత్రలో నటించిన ‘అల్లుడు అదుర్స్’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment