‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లపైనే అవుతోంది. దాదాపు వెయ్యి పాటలకు పైగా పాడాను. ఇంతకాలం ఒకేలా పాడాను. అయితే కొందరు నాన్నగారి (దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) వాయిస్‌లా నా వాయిస్ ఉందన్నారు. నాకు వచ్చే పాటలను నా శక్తి మేరకు బాగా పాడాలని ప్రయత్నం చేస్తాను’’ అన్నారు గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత ఎస్పీ చరణ్. దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ జంటగా సుమంత్, రష్మికా మందన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఓ సీత..’, ‘ఇంతందం..’ పాటలను ఎస్పీ చరణ్ పాడారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ చెప్పిన విశేషాలు....
► హీరో దుల్కర్ సల్మాన్‌కు నేను పాడటం ఇదే తొలిసారి. ‘సీతా రామం’ చిత్రంలో ‘ఓ సీత’, ‘ఇంతందం..’ పాటలను పాడటం చాలా సంతోషంగా ఉంది. చిరకాలం నిలిచిపోయే పాటలివి. ‘ఓ సీత..’ పాటకు అనంత శ్రీరామ్, ‘ఇంతందం..’ పాటకు కేకే (కృష్ణకాంత్) మంచి సాహిత్యం అందించారు. మెలోడిపై మంచి పట్టు ఉన్న సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్.
►ఒకప్పుడు తెలుగులో ఎక్కువగా పాటలు పాడిన నేను ఆ తర్వాత ఇదే స్పీడ్‌ను ఎందుకు కొనసాగించలేకపోయానన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న నాకు. సంగీత దర్శకులు మణిశర్మ, కీరవాణి, ఆర్పీ పట్నాయక్, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా అందరి సినిమాల్లో నేను పాడిన పాటలు విజయాలు సాధించాయి... జనాదరణ పొందాయి. అయితే ఆ తర్వాత ఓ సింగర్‌గా నాకు ఎందుకు అవకాశాలు కుదర్లేదో అయి తే తెలియదు. నిర్మాణ రంగంలో బిజీగా ఉండటం వల్ల నేను పాట పాడలేననే మాట ఎప్పుడూ చెప్పలేదు. రికార్డింగ్‌కు ఫోన్ కాల్ వచ్చిన ప్రతిసారీ నేను అందుబాటులోనే ఉన్నాను.
► సంగీతంలో వచ్చిన మార్పులను గురించి మాట్లాడేంత పెద్ద వ్యక్తిని కాను నేను. పాట పట్ల నా అప్రోచ్ అయితే మారలేదు. కొత్త సంగీత దర్శకులు కూడా మంచి పరిజ్ఞానంతో ఉన్నారు. దర్శక–నిర్మాతలు కూడా కొత్త సంగీత దర్శకులు, సింగర్స్‌ను గుర్తించి వారికి అవకాశాలు ఇస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక నాన్నగారు చేసిన టీవీ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్న సింగర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. భవిష్యత్‌లో ప్రతిభ గల సింగర్స్ మరింతమంది వస్తారని ఆశిస్తున్నాను.
► తమిళంలో ఓ సినిమాకి ప్రొడక్షన్ చేస్తున్నాను. సంగీత దర్శకత్వంపై దృష్టి పెట్టే ఆలోచన నాకు ఇప్పట్లో లేదు.
Comments
Please login to add a commentAdd a comment