యాక్షన్ మాత్రమే కాదు.. కొందరు స్టార్స్‌లో డైరెక్షన్ చేసే టాలెంట్ కూడా ఉంటుంది. అయితే యాక్షన్ ఫ్రంట్ సీట్.. డైరెక్షన్ బ్యాక్ సీట్‌లో ఉంటుంది. అందుకే డైరెక్షన్‌కి గ్యాప్ ఇచ్చి, యాక్షన్‌కి మాత్రం నో గ్యాప్ అంటారు. అలా కొందరు హీరోలు డైరెక్షన్ సీట్‌కి చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టుకుని ‘స్టార్ట్ కెమెరా.. యాక్షన్’ అంటున్నారు. కొందరు స్టార్స్ ఇటు కెమెరా వెనకాల డైరెక్షన్ చేస్తూ అటు కెమెరా ముందు యాక్షన్ చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.
ఆరేళ్లకు...
కెరీర్‌లో 50వ సినిమా అంటే ఏ ఆర్టిస్టుకైనా ప్రత్యేకమే. కోలీవుడ్ హీరో ధనుష్ కూడా తన 50వ సినిమాని చాలా స్పెషల్ అనుకున్నారు. అందుకే తన హాఫ్ సెంచరీ సినిమాలో తానే నటిస్తూ, దర్శకత్వం కూడా వహిస్తున్నారు. హీరోగా దాదాపు 30 సినిమాల్లో నటించిన తర్వాత ‘పా. పాండి’ (2017) చిత్రం కోసం తొలిసారి దనుష్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చెప్పుకోదగ్గ ఆదరణ లభించింది.
దీంతో 2019లో దర్శకుడుగా ధనుష్ మరో మూవీని తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు. అయితే ఈ ఏడాది జూలైలో తన దర్శకత్వంలోని రెండో చిత్రం సెట్స్‌పైకి వెళ్లినట్లుగా ధనుష్ వెల్లడించారు. ఇలా దాదాపు ఆరేళ్ల తర్వాత దర్శకుడిగా మరోసారి మెగాఫోన్ పట్టారు. ఇక నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో సందీప్ కిషన్ ఓ కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో అనిఖా సురేంద్రన్, ఎస్‌జే సూర్య, విష్ణు విశాల్, వరలక్ష్మీ శర కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారని టాక్.
ఏడేళ్ల తర్వాత...
యాక్టర్‌గా తెలుగు ప్రేక్షకుల్లో కన్నడ స్టార్ ఉపేంద్రకు ఎంత పాపులారిటీ ఉందో, ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలకూ అంతే క్రేజ్ ఉంది. ‘ష్..! (1993)’, ‘ఓం (1995)’, ‘ఉపేంద్ర (1999)’ వంటి సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించారు ఉపేంద్ర. కన్నడంలో ఆయన దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలు తెలుగులో అనువాదపై, ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అయితే 2015లో వచ్చిన ‘ఉప్పి 2’ తర్వాత దర్శకుడిగా ఉపేంద్ర గ్యాప్ తీసుకున్నారు. ఏడేళ్ల తర్వాత 2022లో ‘యూఐ’ సినిమా వర్క్స్‌ను మొదలు పెట్టారు ఉపేంద్ర. ఆయన నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఉపేంద్ర అండ్ టీమ్ పేర్కొంది. కన్నడ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
పదేళ్లకు...
కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన సుదీప్ దర్శకుడిగా ఆరు సినిమాలను తెరకెక్కించారు. కానీ ఈ ఆరూ రీమేక్ చిత్రాలే కావడం విశేషం. తమిళ ‘ఆటోగ్రాఫ్’ని కన్నడంలో ‘మై ఆటోగ్రాఫ్’ (2006)గా రీమేక్ చేసి, నటించారు సుదీప్. అలాగే దర్శకుడిగా తెలుగు హిట్ ఫిల్మ్ ‘మిర్చి (2013)’ కన్నడ రీమేక్ ‘మాణిక్య (2014)’లో టైటిల్ రోల్ చేసి, ఈ సినిమాకు దర్శకత్వం వహించారు సుదీప్. ఈ సినిమా తర్వాత సుదీప్ మళ్లీ మెగాఫోన్ పట్టలేదు.
మళ్లీ దశాబ్దం తర్వాత అంటే... 2024లో సుదీప్ నటించి, దర్శకత్వం వహించనున్న ‘కేకే’ (వర్కింగ్ టైటిల్) సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘దేవుడు క్షమిస్తాడు.. నేను కాదు...!’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే కథతో సాగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడిగా ఇప్పటివరకూ రీమేక్ చిత్రాలే చేసిన సుదీప్.. ఈ ఏడవ సినిమాని స్ట్రయిట్ కథతో తీయనున్నారా లేక రీమేకా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ‘ఈగ’, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రాలతో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.
పుష్కర కాలం తర్వాత...
‘దిల్ చాహ్ తా హై’ (2001) చిత్రంతో రచయితగా, దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు ఫర్హాన్ అక్తర్. ‘డాన్: ది చేజ్ బిగిన్స్’, ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రాలతో దర్శకుడిగా తనదైన పేరు సంపాదించారు. అయితే 2011లో వచ్చిన ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రం తర్వాత నటుడిగా కాస్త బిజీ అయిన ఫర్హాన్ మరో సినిమాకు దర్శకత్వం వహించలేదు. పదేళ్ల తర్వాత 2021 ఆగస్టులో ‘జి లే జరా’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ఫర్హాన్ వెల్లడించారు.
ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో తన డైరెక్షన్‌లోనే ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు ఫర్హాన్. అయితే ఈ సినిమాలో ఆయన నటించడం లేదు. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇలా ఫర్హాన్ దర్శకత్వంలోని మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి పుష్కరకాలం అంటే పన్నెండేళ్లు పట్టిందని చెప్పొచ్చు. ‘డాన్ 3’ చిత్రం 2025లో విడుదల కానుంది.
ఇలా కొంత విరామం తర్వాత దర్శకులుగా మెగాఫోన్ పట్టిన స్టార్స్ ఇంకొందరు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment