ఫస్ట్ సీన్ అదిరిపోవాలి. హీరో ఇంట్రడక్షన్ కేక పుట్టించాలి. ఇంటర్వెల్ బ్యాంక్ మెస్మరైజ్ చేసేలా ఉండాలి. సినిమా అంతా బాగా రావాలనే తీస్తారు కానీ… ఇలా కొన్ని సీన్స్ మీద డైరెక్టర్స్ ప్రత్యే క శ్రద్ధ పెడతారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడిని సర్‌ప్రైజ్ చేస్తూ కథలో లీనం అయ్యేలా చేయాల న్నదే మూవీ మేకర్స్ లక్ష్యం. మరి క్లైమాక్స్ సంగతేంటి ? అత్యంత కీలకం ఇదే. సినిమా అంతా బావుండి చివర్లో చెడిందనుకోండి…ఆడియన్స్ పెదవి విరిచేస్తారు. మూవీ యావరేజ్‌గా ఉన్నా…ఎండింగ్ అదిరిదంటే రిజల్ట్ హిట్టే. మరి అలాంటి క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సినిమాలపై లుక్కేద్దాం.
ఉప్పెన
సాధారణంగా ప్రేమ కథా చిత్రాల్లో తమ ప్రేమకి అడ్డుపడుతున్న వాళ్లని ఎదిరించి ప్రేమికులు ఒకటవుతారు లేకపోతే పెద్దల పంతాలకు బలైపోతారు. అదీ కాకుంటే హీరో, హీరోయిన్‌లలో ఒకరు చనిపోతారు. మరొకరు జీవచ్ఛావంలా మిగిలిపోతారు. ఎన్ని ప్రేమకథాచిత్రాలొచ్చినా క్లైమాక్స్‌లు మాత్రం ఇవే. కానీ…ఉప్పెన మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ముగింపు తీసు కుంది. మగాడు అన్న పదానికి సరికొత్త అర్థం ఇస్తూ…ఎవరూ ఊహించని క్లైమాక్స్‌ని ఫిక్స్ చేసేశాడు దర్శకుడు బుచ్చిబాబు. తొలి రోజు క్లైమాక్స్ కేంద్రంగా నెగిటివ్ టాక్ నడిచినా…ఆ తరహా ముగింపుకి ప్రేక్షకులు మద్దుతు ప్రకటించారు. ఉప్పెనని వంద కోట్ల క్లబ్‌లో కూర్చోపెట్టేశారు.
రంగస్థలం
రామ్ చరణ్ ‘రంగస్థలం’ క్లైమాక్స్ కూడా ఊహించని ట్విస్ట్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. మొదటి నుంచి జగపతిబాబునే విలన్‌గా చూపిస్తూ వస్తారు. నిజానికి ప్రెసిడెంట్‌గారు విలనే. కానీ…మూవీలో అసలు విలన్ మాత్రం కాదు. ఆ విషయం చివరి వరకు ప్రేక్షకులు గమనించకుండా స్క్రీన్‌ప్లే ని చక్కగా రెడీ చేసుకున్నాడు సుకుమార్. చివర్లో ప్రకాష్‌రాజ్ విలన్ అని తెలిసే సరికి సగటు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్‌తో పాటుగా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో థియేటర్ నుంచి బయటకుకొచ్చారు.
ఆర్‌ఎక్స్ 100
క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వాలని దర్శకుడు డిసైడ్ అయినప్పుడు… ఊహించని మలుపులు. ముసుగులేసుకున్న పాత్రలు లాంటి వాటితోనే కథని అల్లుకుంటాడు. అలాంటి ఒక కథతో యూత్ అటెన్షన్‌ని గెయిన్ చేసిన చిత్రం ఆర్‌ఎక్స్ 100. పిల్లారా పాటలో సినిమా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేసింది ఆర్‌ఎక్స్ 100. ఫస్ట్ మూవీతోనే కార్తికేయ హీరోగా మంచి మార్కులు కొట్టేశారు. పాయల్ రాజ్‌పుట్ కి గ్లామర్ ఇమేజ్ క్రియేట్ చేసింది. అన్నింటికీ మించి క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్ ఊహాలకు అందలేదు.
యాన్ ఇన్‌క్రెడిబుల్ లవ్ స్టోరీ అన్న ట్యాగ్‌లైన్‌తో మొదటి నుంచి ఆసక్తి రేపిన ఆర్‌ఎక్స్ 100…క్లైమాక్స్ కోణంలో మాత్రం అలజడి రేపింది. హీరోయిన్ తండ్రి విలన్ అన్నట్టుగా సినిమా ని ముందుకు తీసుకువెళ్లి…మరొకరిని విలన్‌గా చూపించడం చాలా సినిమాల్లో చూసిందే. కానీ దర్శకుడు అజయ్ భూపతి ఏకంగా హీరోయిన్‌నే విలన్‌గా చూపించేసి ఆడియన్స్‌ని షాక్‌కి గురిచేశాడు. అలానే…చివరకు హీరోని చంపేసి ప్రేక్షకుల్లో భావోద్వేగాలను పూర్తి స్థాయి లో పెంచేసి థియేటర్ నుంచి బయటకు పంపాడు.
కేరాఫ్ ‘కంచరపాలెం’
చిన్న సినిమాగా వచ్చి ఘన విజయం సాధించిన కేరాఫ్ ‘కంచరపాలెం’ క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. ఒక్కో కథకి ఏమాత్రం సంబంధం ఉండదు. అసలు వీళ్లందరినీ దర్శకుడు ఎలా కలుపుతాడు ? కలపడా ? ఎవరి కథ వారిదేనా ? ఇలా రకరకాల సందేహాలు సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులని వేధిస్తూనే ఉంటాయి. చివర్లో ఇవి నాలుగు కథలు కాదు. ఒక కథే. ఆ నలుగురు…ఈ రాజే అంటూ దర్శకుడు ఇచ్చే ట్విస్ట్‌కి థియేటర్లు ఈలలతో మార్మో గాయి. ఎలాంటి సినిమా అయినా సరే…మూవీ స్టార్టింగ్‌లో ఈలలు వినిపిస్తాయి. లేకపోతే పవర్‌ఫుల్ డైలాగో, అదిరిపోయే పాటో వచ్చినప్పుడు విజిల్స్ కామన్. కానీ క్లైమాక్స్‌తో ప్రేక్షకు లు చప్పట్లు, విజిల్స్‌తో సంతోషాన్ని వ్యక్తం చేయడం చాలా అరుదు. ఆ అరుదైన అనుభ వాన్ని కేరాఫ్ కంచరపాలెం సినిమా సొంతం చేసుకుంది.
ఎవరు
డిఫరెంట్ క్లైమాక్స్‌తో ఆడియన్స్‌ని షాక్ ఇచ్చిన చిత్రాల్లో ఎవరు ఒకటి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఒక మిస్సింగ్ కేసు గురించి చెబుతూ ఉండటంతో సినిమా మొదలవుతుంది. హఠాత్తుగా ఆ కేసు నుంచి ఆడియన్స్‌కి ఫోకస్‌ని తప్పించి, ఇంటర్వెల్ పాయింట్‌కి అసలు కథతో లింక్ చేయడం. అసలు ఈ స్క్రీన్‌ప్లే నే భలే ట్విస్ట్‌గా అనిపిస్తే…ఇక బాధితురాలే నేరస్తురాలు. హీరోయినే విలన్ అన్న ట్విస్ట్ మరింతగా ప్రేక్షకులకి మజాని ఇస్తుంది.
మత్తువదలరా
సింపుల్ క్రైమ్ కథని కాంటెంపరరీ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా వెండితెర పై ప్రజెంట్ చేసిన చిత్రం మత్తువదలరా. సీరియస్ సీన్స్‌లోనూ కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడటంతో తొలి రోజు నుంచే సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలో జరిగే చోటా స్కామ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో కథ మొదలవుతుంది. ఒక 5 వందల రూపాయల కోసం చేసిన చిన్న తప్పు కథానాయకుడి జీవితాన్ని పెద్ద సమస్యలో పడేస్తుంది. విలన్ ఎవరన్నది రివీల్ అయిపోయా క ఇక క్లైమాక్స్ రెగ్యులర్ ఫార్మెట్‌లోనే ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు. కానీ… క్లైమాక్స్‌లో ఊహించని విధంగా నోట్ల రద్దు అంటూ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది.
హిట్
హీరో నాని నిర్మాత అనగానే…హిట్ మూవీ చుట్టూ ఒక అటెన్షన్ ఏర్పడింది. అనుకున్నట్టుగా నే డిఫరెంట్ క్లైమాక్స్‌తో…ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లో కనిపించకుండా పోయిన ఒక టీనేజ్ అమ్మాయి, ఆ కేస్‌కి లింక్ అవుతూ మిస్ అయిన మరో యువతి. ఆడి యన్స్‌ని ఇన్‌స్టంట్‌గా ఎంగేజ్ చేయడానికి దర్శకుడు శైలేష్ కొలను చేసిన ఈ సెటప్ బానే వర్కౌట్ అయింది. హీరోతో పాటుగా ఉంటూ కేసుని పరిశోధన చేస్తున్న అతని మిత్రుడే విలన్ అంటూ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్…థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
మిస్టరీ చేధించే డిటెక్టివ్ సినిమాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. కానీ ఎక్కువుగా రావు. ఎందుకంటే…మిస్టరీ జానర్‌లో సస్పెన్స్‌ని హోల్డ్ చేసి ఉంచడం చాలా కీలకం. అలాంటి కీలక మైన అంశాన్ని వెండితెర మీద చక్కగా పెర్ఫామ్ చేయడంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సక్సెస్ అయ్యాడు. బాధితురాలు అన్నకున్న క్యారెక్టరే…అస్సలు ఈ భూమ్మీదే లేదనుకున్న క్యారెక్టరే…విలన్ అన్న ట్విస్ట్…మిస్టరీ జానర్ ని మజా చేస్తాయి.
ఆ!
సినిమాకి క్లైమాక్స్ బలం కావాలి. సినిమాకి క్లైమాక్స్ మరింత మైలేజ్ ఇచ్చేలా ఉండాలి. కానీ …క్లైమాక్స్ ట్విస్ట్ మీదే ఆధారపడి కథని రాసేసుకుని, సినిమా తీసేస్తే…అది ఆ! మూవీ నే అవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. క్లైమాక్స్‌కి వచ్చిన తర్వాత కానీ దర్శకుడి ప్రతిభ అర్థం కాదు. అయితే…అప్పటి దాకా నడిచిన సినిమా మొత్తం ఆడియ న్స్‌కి అయోమయంగానే అనిపిస్తుంది. దీంతో…ఆ ! చిత్రం హిట్ మూవీస్ జాబితా లోకి అయితే ఎక్కలేదు.
- దినేష్ రెడ్డి వెన్నపూస, డిప్యూటీ న్యూస్ ఎడిటర్
Comments
Please login to add a commentAdd a comment