SS Rajamouli hosts intimate Oscars after-party for 'RRR' team at his Los Angeles home - Sakshi
Sakshi News home page

విజయానందంలో ఆర్‌ఆర్‌ఆర్‌.. అమెరికాలోని ఇంట్లో పార్టీ ఇచ్చిన జక్కన్న

Published Wed, Mar 15 2023 9:08 AM | Last Updated on Wed, Mar 15 2023 10:23 AM

SS Rajamouli Hosts Party for RRR Team at His Los Angels Home - Sakshi

95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం (భారతీయ కాలమానం ప్రకారం సోమవారం) ముగిసిన విషయం తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆస్కార్‌ వేడుకను ఎక్కువమంది వీక్షించారు. 2021లో తక్కువగా దాదాపు 10 మిలియన్‌ (కోటి మంది) వ్యూయర్‌షిప్, 2022లో 16.6 మిలియన్ల వ్యూయర్‌షిప్‌ నమోదు కాగా ఈ ఏడాది వేడుకను 18.7 (కోటీ 87 లక్షలు) మిలియన్ల మంది వీక్షించారు. గత ఏడాదితో పోల్చితే 12 శాతం ఎక్కువ వ్యూయర్‌షిప్‌ నమోదైంది. అయితే ఆస్కార్‌ వ్యూయర్‌షిప్‌ విషయంలో ఇదేం పెద్ద విషయం కాదు.

ఎందుకంటే 1998లో జరిగిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవాన్ని 57 (5 కోట్ల 70 లక్షలు) మిలియన్ల మంది వీక్షించారు. ఈసారి సోషల్‌ మీడియాలో కూడా ఆస్కార్‌ వేడుక టాప్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వేడుకకు 27.4 (27 కోట్ల 4 లక్షలు) మిలియన్ల ఇంట్రాక్షన్స్‌ సోషల్‌ మీడియాలో నమోదయ్యాయని హాలీవుడ్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఇటు టెలివిజన్‌ వ్యూయర్‌షిప్‌ రేటింగ్స్‌ కూడా స్వల్పంగా పెరిగింది. కాగా ఆస్కార్‌ ఆవార్డు వేడుక అనంతరం కమిటీ గ్రాండ్‌గా ‘ఆఫ్టర్‌’ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఉపాసన, దీపికా తదితరులు పాల్గొన్నారు.

రాజమౌళి ఇంట్లో పార్టీ
‘‘మేం కచ్చితంగా ఆస్కార్‌ గెలుస్తామని ముందు నుంచి యూనిట్‌ అంతా నమ్మకంగా ఉన్నాం. ఆస్కార్‌ అందుకోవడమా? లేదా ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ను ప్రదర్శించడమా.. ఈ రెండింటిలో ఏ క్షణాలు అపూరమైనవి అని నన్ను అడిగితే... ఎంచుకోవడం నాకు చాలా కష్టం. ‘నాటు నాటు’ పాటను వేదికపై ప్రదర్శిస్తున్నంతసేపు వీక్షకులు క్లాప్‌ కొడుతూ, సాంగ్‌ పూర్తయ్యాక స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇవ్వడం అనేది నన్ను ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంపై నిలబెట్టినట్లయింది. అలాగే ఆస్కార్‌ అవార్డు ఆయన్ను (కీరవాణిని ఉద్దేశిస్తూ..) కూడా ఆ శిఖరాగ్రాన నిలబెట్టింది’’ అని పేర్కొన్న రాజమౌళి ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఆ ఆనందంలో లాస్‌ ఏంజిల్స్‌లోని తన ఇంట్లో ‘ఆర్‌ఆర్‌ ఆర్‌’ టీమ్‌కు గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీని రాజమౌళి భార్య రమ, ఆయన తనయుడు కార్తికేయ హోస్ట్‌ చేశారు. ఈ పార్టీలో కీరవాణి పియానో ప్లే చేయగా, అక్కడ ఉన్నవారు పాట పాడారు. ఈ సెలబ్రేషన్స్‌ను రామ్‌ చరణ్‌ వీడియో తీశారు. ఈ ఫోటోలను ఉపాసన షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ వీడియోల్లో తారక్‌ కనిపించకపోవడంతో అసలు తను పార్టీకి హాజరయ్యాడా? లేదా? అని ఆలోచిస్తున్నారు అభిమానులు.

భారతీయుల మనసు గెలిచిన లేడీ గగా
‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ వచ్చిందని ప్రకటించగానే.. రాజమౌళి ఆనందంతో చప్పట్లు కొట్టి, తన భార్య రమను  హత్తుకున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ సినిమాకి సంబంధించినవారిగా ఆ విధంగా ఆనందపడటం సహజం. అయితే అమెరికన్‌ సింగర్, సాంగ్‌ రైటర్, యాక్ట్రస్‌ లేడీ గగా చప్పట్లు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో పోటీలో ఉన్న ‘నాటు..’తో పాటు ‘టాప్‌గన్‌: మ్యావరిక్‌’ చిత్రం కోసం పాడిన ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ పాటకు లేడీ గగా నామినేషన్‌ దక్కించుకున్నారు. తన పాటకు కాకుండా ‘నాటు..’కు వచ్చినప్పటికీ చప్పట్లతో అభినందించడం ఆమె సంస్కారానికి నిదర్శనం అని నెటిజన్లు అభినందిస్తున్నారు.

సోషల్‌ మీడియా అండ్‌ న్యూస్‌ మీడియా ట్రెండ్స్‌ను విశ్లేషించే అమెరికాకి చెందిన నెట్‌బేస్‌ క్విడ్‌ కొన్ని గణాంకాలను వెల్లడించింది. ఆ లెక్కల ప్రకారం (వేడుక జరిగిన సమయంలో..) టాప్‌ మెన్షన్డ్‌ యాక్టర్స్‌ జాబితా తొలి స్థానంలో ఎన్టీఆర్‌ నిలిచారు. ఆ తర్వాతి స్థానాలు వరుసగా  రామ్‌చరణ్, కి హుయ్‌ క్వాన్‌ (ఉత్తమ సహాయనటుడు), బ్రెండెన్‌ ఫ్రాసెర్‌ (ఉత్తమ నటుడు), పెడ్రోపాస్కల్‌ నిలిచారు. ఇక నటీమణుల విషయానికొస్తే.. మిషెల్‌ యో (ఉత్తమ నటి) అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో వరుసగా మిచెల్‌ యో, లేడీ గగా, ఏంజెలా బాసెట్, ఎలిజిబెత్‌ ఒల్సెన్, జామిలీ కర్టీస్‌ (ఉత్తమ సహాయ నటి) నిలిచారు. సినిమాల పరంగా తొలి రెండు స్థానాల్లో భారతీయ చిత్రాలు ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌ –ఫీచర్‌ ఫిల్మ్‌), ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ (బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌) నిలిచాయి. ఆ తర్వాతి మూడు స్థానాల్లో వరుసగా ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’, ‘అర్జెంటీనా 1985’ చిత్రాలు నిలిచాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement