పాత్రలో పరకాయ ప్రవేశం చేసే అతికొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. అలా ఆయన ఇటీవల నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను పొందాయి. ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్నారు. చారిత్రక కథాచిత్రంగా రూపొంతున్న ఈ చిత్రం కోసం సూర్య తనను తాను చాలానే మార్చుకున్నారు. ఒక విప్లవ నాయకుడిగా సూర్య గెటప్, ఆ చిత్రం గ్లిమ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం రూపొందించడంతో పాటు 36 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే పేర్కొన్నారు.
కంగువ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపై రావడానికి ముస్తాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను కూడా సూర్య పూర్తి చేశారు. దీంతో ఆయన తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన ఆకాశం నీ హద్దురా అనే సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇదే చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నిర్మాతగా హిందీలో నిర్మించి సక్సెస్ అయ్యారు. కాగా ఈ కాంబినేషన్‌లో మూడోసారి చిత్రం తెరకెక్కనుంది. దీన్ని నటుడు సూర్యనే తన 2డీ ఎంటర్ టెయిన్మెంట్ పతాకంపై నిర్మించనున్నారు.
ఇది కూడా 1965 ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. అప్పట్లో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే ఈ చిత్రానికి నేపథ్యం అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 1965లో భాషాయుద్ధంలో మరణించిన రాజేంద్రన్ ఫోటో, సూర్య ఫోటోలు ఒకేసారి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇందులో సూర్య కాలేజీ విద్యార్థిగా నటించనున్నారు.
ఇందుకోసం ఆయన కాలేజీ బుల్లోడుగా మేకోవర్ అవ్వడానికి తన సతీమణి జ్యోతికతో కలిసి ముంబైలో మకాం పెట్టినట్లు సమాచారం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ ముఖ్య భూమిక పోషించడం ఉండగా, నటి నజ్రియా కథానాయకిగా నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా ఈ చిత్రం వచ్చే నెల సెట్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment