ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితాసేన్ శ్రీగౌరి సావంత్ బయోపిక్ ‘తాలి’లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సేన్. ‘రకరకాల కారణాల రీత్యా ఈ ప్రాజెక్ట్ నాకు ప్రత్యేకం. పోరాట స్ఫూర్తి మూర్తీ భవించిన గౌరీ సావంత్‌ను ప్రపంచానికి పరిచయం చేసే పాత్రలో నటించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది’ అని తన మనసులోని భావాన్ని బయటపెట్టింది సుస్మితా సేన్. ఇంతకీ ఎవరీ గౌరీ సావంత్? ఆమె వెనకున్న కథేంటో తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం.. బాలీవుడ్ వెండితెర కలలను నిజం చేసుకోవడానికి ముంబైలోకి అడుగు పెట్టింది సితార. 21 ఏళ్ల సితార కలలు ఆవిరైపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. కొందరు చేసిన మోసం వల్ల ముంబైలోని ఖరీదైన స్టూడియోల్లో భారీ లైట్ల వెలుగులో ఉండాల్సిన సితార.. కామాటిపుర చీకటి లోయల్లో పడిపోయింది. సెక్స్‌వర్కర్‌గా జీవితాన్ని నరకప్రాయం చేసుకుంది. దీంతో కొంత కాలానికి ఆమె తల్లి కూడా అయింది.
రెండు లక్షలకు బిడ్డను అమ్ముకుని..: ‘నా బిడ్డను సమాజం ఎంత ఈసడించుకుంటుందో, ఎన్ని రకాలుగా అవమానపరుస్తుందో’ అనే భయంతో పిల్లలు లేని దంపతులకు పాపను రెండు లక్షలకు అమ్ముకుంది. ఆ తరువాత.. తట్టుకోలేని బాధ. ఆ డబ్బును తీసుకువెళ్లి ఒక ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చింది. ఇలాంటి సితారాలు చాలామంది ఉంటారు. గౌరీ సావంత్ లాంటి వాళ్లు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. సితార లాంటి వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కంకణం కట్టుకుంది ట్రాన్స్‌జెండర్ గౌరీ సావంత్. సెక్స్‌వర్కర్లలకు అండగా నిలవాలన్నదే తన ఆశయం. సెక్స్‌వర్కర్ల పిల్లల ఆలనా పాలనా గాలిలో దీపంలా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో వారి కోసం భద్రతనిచ్చే ఆశ్రమాన్ని కట్టాలనుకుంది గౌరీ.
కల బాగానే ఉందిగానీ, డబ్బులు ఎక్కడివి! ‘సంకల్పం మంచిదైనప్పుడు డబ్బులు వెదుక్కుంటూ వస్తాయట. చూద్దాం’ అనుకుంది. మిలాప్ ఫండ్ రైజింగ్ వెబ్‌సైట్, కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీషో మొదలైన వాటి ద్వారా తన కల సాకారమైంది. ‘అజిచ ఘర్’ పేరుతో నిర్మించిన ఇల్లు యాభై మందికి పైగా సెక్స్‌వర్కర్ల పిల్లలకు ఆశ్రయమిస్తోంది. భద్రంగా వారి ఆలనా పాలనా చూసుకుంటోంది. ట్రాన్స్‌జెండర్ల యోగక్షేమాల కోసం ‘సఖీ చార్ చౌగీ’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి ఎంతోమందికి అండగా నిలబడింది గౌరీ సావంత్.
గణేశ్ పేరుతో పెరిగి.. పద్నాలుగేళ్లకే: గతంలోకి వెళితే.. నాగ్‌పూర్‌లో పుట్టి గణేశ్ పేరుతో పెరిగింది. తన నడక, మాట తీరువల్ల లెక్కలేనన్ని అవమానాలు ఎదుర్కొంది. మరోవైపు తల్లి చనిపోయింది. తండ్రి పోలీస్ అధికారి. తన వల్ల తండ్రిని తక్కువ చేసి చూడకూడదని పద్నాలుగేళ్ల వయసులో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఎన్ని అవమానాలు ఎదుర్కొందో. ఎన్ని కష్టాలు పడిందో. అయితే వాటి వల్ల తాను మానసికంగా బలపడిందే తప్ప ఏరోజూ వెనకడుగు వేయలేదు.
సుప్రీంకోర్టులో పిటిషన్: 2014లో గౌరీ పేరు జాతీయ మీడియాను ఆకర్షించింది. అప్పుడు తాను ఒక చారిత్రక అడుగు వేసింది. ట్రాన్స్‌జెండర్ల పిల్లలను దత్తత తీసుకునే హక్కు కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఆమె గాయత్రి అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. గాయత్రి తల్లి ఎయిడ్స్‌తో చనిపోయింది. గతంలో వచ్చిన ఒక దక్షిణాది చిత్రంలో గౌరీ పాత్ర కనిపించింది. అయితే అందులో కల్పన ఎక్కువగా ఉంది. గౌరీ పాత్రపై ‘తాలి’ పేరుతో పూర్తిస్థాయిలో బయోపిక్ రావడం అనేది ఇదే మొదటిసారి.
చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్ బారిన పడుతున్న వారికి గౌరి బయోపిక్ కచ్చితంగా ధైర్యాన్నిస్తుంది. పోరాటస్ఫూర్తిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment