
తమిళ సినిమా: గూగుల్ కుట్టప్ప చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ నటులను ఆహ్వానించినా షూటింగ్ ఉందంటూ వారెవరు రాలేమని చెప్పారని దర్శకుడు, నటుడు కేఎస్ రవికుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఇది వారి సీజన్ అని తమకూ ఒక సీజన్ వస్తుందని అన్నారు. తన ఆర్.కె. సెల్యూలాయిడ్ పతాకంపై నిర్మించి, ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గూగుల్ కుట్టప్ప. బిగ్‌బాస్ ఫేమ్ దర్శన్ , లాస్లియా హీరో హీరోయిన్ గా నటించిన ఇందులో యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
కేశవ కుమార్ శిష్యులు శబరి, గుణ శరవణ్ కలిసి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ట్రైలర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం చెన్నైలో నిర్వహించారు. ఫెఫ్సీ, దర్శకుల సంఘాల అధ్యక్షుడు ఆర్.కె సెల్వమణి, విక్రమన్, ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, తంగర్ బచ్చన్ పాల్గొన్నారు.