టైటిల్ : తెలంగాణ దేవుడు
నటీనటులు : శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్, సుమన్, సునీల్, బ్రహ్మాజీ, సంగీత, మధుమిత, సత్యకృష్ణ, అజయ్, వెంకట్, కాశీ విశ్వనాధ్, వడత్యా హరీష్ తదితరులు
నిర్మాత : మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్
దర్శకత్వం : వడత్యా హరీష్
సంగీతం : నందన్ బొబ్బిలి
ఎడిటింగ్: గౌతంరాజు
విడుదల తేది : నవంబర్ 12, 2021
ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖుల జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరెకెక్కాయి. తెలుగులో ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్సార్‌జీవిత కథ ఆధారం సినిమాలు వచ్చాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ జీవిత కథపై ‘తెలంగాణ దేవుడు’అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తెలంగాణ దేవుడు’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.
తెలంగాణ దేవుడు కథేటంటే..?
దర్శకుడు ముందుగా చెప్పినట్టే సీఎం కేసీఆర్ బయోపిక్ మూవీని ఎమోషనల్ డ్రామాగా రూపొందించారు. విజయ్ దేవ్ (జిషాన్ ఉస్మాన్, శ్రీకాంత్) తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి దారి తీసిన కారణాలేంటి? చదువుకునే టైమ్‌లో విజయ్ దేవ్ ఎలా ఉండేవాడు? ఎలా విజయ్ దేవ్ ఉద్యమంలో అడుగుపెట్టి.. ఉద్యమ నాయకుడు అయ్యాడు? ఉద్యమ నాయకుడు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం అతను చేసిన ప్రయత్నాలేంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా ఆయన చేసిన అభివృద్ది ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ‘తెలంగాణ దేవుడు’కథ.
ఎవరెలా చేశారంటే..?
యువ విజయ్ దేవ్‌గా జిషాన్ ఉస్మాన్ అద్భుత నటనను కనబరిచాడు. జీషాన్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ.. తెరపై ఎక్కడా జంకకుండా నటించాడు. యవ్వనంలో కేసీఆర్ ఇలానే ఉండేవాడు అన్నట్లుగా జిషాన్ నటన ఉంటుంది. స్టూడెంట్‌గా, కబడ్డీ ప్లేయర్‌గా, పెళ్లి, భూస్వాములను ఎదిరించి ఉద్యమం వైపు అడుగులు వేయడం వంటి ఘట్టాలలో జిషాన్ సమర్థవంతంగా నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుత విజయ్ దేవ్‌గా శ్రీకాంత్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. కేసీఆర్‌ని ఇమిటేట్ చేస్తూ నడక, ఆహార్యం ప్రదర్శించడమే కాకుండా కథనంతా తన భూజానా వేసుకొని నడిపించాడు. ఇక విజయ్ దేవ్‌కి విద్యాబుద్దులు నేర్పే గురువు పాత్రలో బ్రహ్మానందం ఒదిగిపోయాడు. భూస్వామిగా తనికెళ్ల భరణి, ప్రొఫెసర్ జైశంకర్‌గా సుమన్, విజయ్ దేవ్ కొడుకుగా చేసిన వెంకట్, రమేశ్ రావుగా అజయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
తెలంగాణ దేవుడు ఎలా ఉందంటే..?
ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్‌గా రూపుదిద్దుకున్న చిత్రమే ‘తెలంగాణ దేవుడు’. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏంటనేది అందరికి తెలిసిందే. అయితే చిన్నపుడు కేసీఆర్ ఎలా ఉండేవాడు? ఆయన ఉద్యమంలోకి ఎలా వచ్చాడు? అనే అంశాలను తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు వడత్యా హరీష్. తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమంలో కేసీఆర్ పాత్రపై చాలా సినిమాలే వచ్చాయి. కానీ పూర్తిగా ఉద్యమ నాయకుడి నేపథ్యంలో వచ్చిన మూవీ ఇదేనని చెప్పాలి. 1969 నుంచి కథను తీసుకున్నాడు. ముఖ్యంగా కేసీఆర్‌గారి చిన్నతనం నుండి మొదలుకొని తన కాలేజ్ లైఫ్, ఉద్యమం, సీఎం వరకు కథ సాగుతుంది. కేసీఆర్ జీవితం గురించి చెబుతూ.. కమర్షియల్ బయోపిక్‌లా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడనే చెప్పాలి.
తండ్రి నడిపే తెలంగాణ ఉద్యమ పార్టీలోకి చేరిన విజయ్ దేవ్.. నేషనల్ పార్టీలోకి వెళ్లడం, ఆ తర్వాత ఓ ప్రాంతీయ పార్టీలోకి వెళ్లడం.. ఇవేవీ తెలంగాణ ఆశయానికి సహకరించడం లేదని అన్నింటికీ రాజీనామా చేసి మళ్లీ సొంతంగా పార్టీ పెట్టడం వంటి వన్నీ కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే ఈ విషయాలన్ని దాదాపు అందరికి తెలియడం, కథ కూడా నెమ్మదిగా సాగడం సినిమాకు కాస్త మైనస్. సీరియస్‌గా సాగుతున్న సినిమాలోకి మధ్య మధ్య వచ్చే కొన్ని పంచ్ డైలాగ్స్ , సీన్స్ కథలో సీరియస్ నెస్ ని తగ్గించేవిగా ఉన్నాయి. పూతరేకులు సీన్, రోశయ్య పాత్రలో చేసిన దుర్గయ్య సీన్స్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. ఇక సాంకేతిక విషయానికొస్తే.. నందన్ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతం అందించాడు. ఎడిటర్‌కి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసే అవకాశం అయితే ఉందనిపించింది. ఇక నిర్మాత జాకీర్ ఉస్మాన్ ఈ సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ఆయన పెట్టిన ప్రతి పైసా.. సినిమాలో కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment