Death Whisperer Review: అమ్మాయిలను వెంటాడే దెయ్యం..చివరికేమైంది? | Sakshi
Sakshi News home page

Death Whisperer Review: అమ్మాయిలను వెంటాడే దెయ్యం..చివరికేమైంది?

Published Fri, Apr 26 2024 7:27 PM

Thai Film Death Whisperer Movie Review In Telugu

టైటిల్‌: డెత్‌ విస్పరర్‌
డైరెక్టర్‌: థావివాత్‌ వాంతా
నటీనటులు: నదెచ్‌ కుగిమియ, జూనియర్‌ కజ్భుందిట్‌, పీరకృత్‌ పచరబూన్యకైట్‌, దెడిస్‌ జెలిల్చ కపౌన్‌
నిడివి: 2 గంటలు
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌

హారర్‌ సినిమాలకు ప్రత్యేక అభిమానులుంటారు. కొందరు భయమనేదే లేకుండా.. కన్నార్పకుండా సినిమా చూస్తారు. మరికొందరు ఎంత భయమేసినా సరే.. నిండా దుప్పటి కప్పుకుని మరీ చూస్తుంటారు. హారర్‌ సినీప్రియులందరికోసం ప్రతియేడూ బోలెడన్ని సినిమాలు రిలీజవుతున్నాయి. అలా గతేడాది డెత్‌ విస్పరర్‌ అనే థాయ్‌ మూవీ రిలీజైంది. క్రిట్టనాన్‌ రచించిన టీ యోడ్‌ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కథేంటి? ఎలా ఉందో చూద్దాం..

కథేంటంటే..
అది 1970.. థాయ్‌లాండ్‌ కాంచనబూరిలోని గ్రామంలో ఓ ఫ్యామిలీ సంతోషంగా జీవనం సాగిస్తుంటుంది. ఇంటి పెద్ద పొలం పని చేస్తుంటాడు. చాలా స్ట్రిక్ట్‌. భార్య ఇంటి పనికే పరిమితమవుతుంది. వీరికి ముగ్గురమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు సంతానం. పిల్లలు బడికి వెళ్లేముందు, వచ్చాక తల్లికి ఇంటిపనిలో సాయపడుతుంటారు. ఇద్దరబ్బాయిలు తండ్రికి పొలంలో సాయం చేస్తారు. అందరికంటే పెద్దవాడైన యాక్‌ మిలిటరీలో పని చేస్తాడు. కానీ ఓ రోజు ఉన్నట్లుండి ఇంటికి వచ్చేస్తాడు. అప్పటికే ముగ్గురమ్మాయిలకు స్కూలుకు వెళ్లే దారిలో ఓ చెట్టు కింద దెయ్యం కనిపిస్తూ ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ దెయ్యం కనిపిస్తుంది.

పన్ను పీకి చేతబడి
ఆ దెయ్యం అందరికంటే ఆరోగ్యంగా ఉన్న యామ్‌ను ఆవహించేందుకు సెలక్ట్‌ చేసుకుంటుంది. దీంతో తను అనారోగ్యానికి లోనవుతుంది. వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఓ రోజు చూయ్‌ అనే మంత్రగత్తె కిటికీలోంచి ఆ అమ్మాయి గదిలోకి దూరం తన పన్ను పీకి దానిపై చేతబడి చేస్తుంది. ఈ విషయం తెలిసి మిలిటరీ నుంచి వచ్చిన అన్న తనను చావబాదడానికి వెళ్తే తనే ఆత్మహత్య చేసుకుంటుంది. అక్కడినుంచి ఈ కుటుంబానికి కష్టాలు మొదలవుతాయి.

క్లైమాక్స్‌లో ట్విస్ట్‌
రాత్రిపూట దెయ్యం ఏదో వింతవింత(గుసగుసలాడినట్లు) శబ్దాలు చేయడం, అది విన్నవారు స్పృహ తప్పిపోవడం.. అర్ధరాత్రి యామ్‌ ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం, ఆమెను వెతికి తీసుకురావడం.. ఇదే జరిగేది. దెయ్యం వారిని మానిప్యులేట్‌ చేయడానికి ట్రై చేసినా.. ప్రాణాలకు తెగించి మరీ యాక్‌ తన చెల్లిని బతికించేందుకు ప్రయత్నిస్తాడు. దెయ్యం ఎక్కడైతే కనిపించిందో ఆ చెట్టును కొట్టేసి అక్కడున్న మానవ మాంసాన్ని కాల్చేస్తారు. తర్వాత ఆస్పత్రికి వెళ్లే దారిలో దెయ్యాన్ని కూడా షూట్‌ చేస్తారు. ఇక దాని పీడ విరగడైందనుకున్న సమయంలో డైరెక్టర్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు.. అదేంటో తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే?
డెత్‌ విస్పరర్స్‌.. ఈ మూవీలో హారర్‌కే పెద్ద పీట వేశారు. కామెడీ జోలికి వెళ్లలేదు. అయితే సినిమా అంతా ఒక ఫ్లోలో వెళ్లిపోతుంది. పెద్దగా ఎగ్జయిట్‌ అయ్యే విషయాలంటూ ఏమీ ఉండవు. నటీనటులు బాగా యాక్ట్‌ చేశారు. సౌండ్‌ ఎఫెక్ట్స్‌ మీద కాస్త ఫోకస్‌ చేయాల్సింది. క్లైమాక్స్‌ చివర్లో సీక్వెల్‌ ఉంటుందని హింటిచ్చారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. అయితే తెలుగు ఆడియో, సబ్‌టైటిల్స్‌ లేవు. ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో సినిమా చూసేయొచ్చు.

Advertisement
Advertisement