టైటిల్: సిస్టర్ డెత్
నటీనటులు: అరియా బెడ్మర్, మరు వల్దీవిల్సో, లూయిసా మెరెలస్, చెలో వివరెస్, సారా రోచ్, అల్ముడెనా ఆమొర్ తదితరులు
దర్శకుడు: పాసో ప్లాజా
జానర్: హారర్
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
నిడివి: 1 గంట 30 నిమిషాలు
హారర్ సినిమాలు చూస్తే ఆ కిక్కే వేరు! కొన్ని పేరుకే హారర్ మూవీస్ అంటారు కానీ అందులో భయపడేంత సీన్ ఏం ఉండదు. ఇక్కడ చెప్పుకునే సిస్టర్ డెత్ మూవీలో మాత్రం మొదట్లో దెయ్యాన్ని చూపించకుండా భయపెట్టేందుకు ప్రయత్నించారు. మరి అందులో సక్సెస్ అయ్యారా? అసలు ఈ సినిమా కథేంటి? ఎలా ఉందనేది రివ్యూలో మాట్లాడుకుందాం..
కథ
సిస్టర్ నార్సిసా.. కాన్వెంట్ స్కూల్‌లో పిల్లలకు చదువు చెప్పడానికి వెళ్తుంది. అక్కడ ఉన్న నన్స్‌కు ఈమె పెద్దగా నచ్చదు. అది పట్టించుకోని నార్సిసా తన పని తాను చేసుకుపోతోంది. తన గదిలో ఏదో ఆత్మ ఉందని అర్థమవుతుంది. మరోవైపు స్కూల్‌లో బోర్డ్ మీద తనను తాను పరిచయం చేసుకుంటూ పేరు రాస్తుంది. అది చూసి అక్కడున్నవాళ్లు షాక్ అవుతారు. కారణం.. దెయ్యం ఆ బోర్డుపై ఎవరి పేరు రాస్తే వారి జీవితం అంతమైపోతుంది. అలా ఓసారి ఒక విద్యార్థి పేరు బోర్డు మీద ప్రత్యక్షమవుతుంది.
నీకేం కానివ్వను అని హామీ ఇచ్చిన నార్సిసా ఆ బాలిక ప్రాణాలు కాపాడలేకపోతుంది. బాలిక చావుకు నువ్వే కారణమంటూ అక్కడి నన్స్ నార్సిసాను వెళ్లిపోమంటారు. పెట్టేబేడా సర్దుకుని బయటకు వెళ్లిపోయే క్రమంలో నన్స్ దాచిన రహస్యాన్ని ఆమె తెలుసుకుంటుంది. అక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. దెయ్యానికి హీరోయిన్ సాయం చేస్తుంది. అందుకు కారణమేంటి? తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!
విశ్లేషణ
నన్‌ను దెయ్యంగా చూపిస్తూ బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటిదే! కానీ ఇందులో ఆ నన్ దెయ్యంగా ఎలా మారిందని చూపించారు. కొన్ని సంఘటనలు కలలా? నిజంగా జరుగుతున్నాయా? అనేవి అర్థం కావు. రియల్ సన్నివేశాల కంటే ఆ కలలే కాస్త భయంకరంగా ఉంటాయి. దెయ్యం తన గతానికి ముడిపడి ఉన్నవారిని చంపడం ఓకే కానీ ఏ సంబంధమూ లేని చిన్నారిని బలి తీసుకోవడం మింగుడుపడదు. చాలా సింపుల్‌గా కథను ముందుకు తీసుకెళ్లారు.
దర్శకుడు వికృత ఆకారాలతో దెయ్యాన్ని చూపించి భయపెట్టాలనుకోలేదు. పెద్దగా ట్విస్టులు కూడా ఉండవు. రాసుకున్న కథ మాత్రం బాగుంది. చివర్లో జరిగేది ప్రేక్షకుడు ముందే పసిగట్టేలా ఉండటం మైనస్. నార్సిసా పాత్రలో స్పానిష్ హీరోయిన్ అరియా బెడ్మర్ చాలా బాగా నటించింది. మిగతా వారు కూడా తమ పాత్రల పరిధి మేర నటించారు. యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. పీరియాడిక్ ఫిలిం కావడంతో సినిమా ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్‌లోనే సాగుతుంది.
సినిమాను ఒకటిన్నర గంటలో పూర్తి చేయడం మెచ్చుకోదగ్గ విషయం. సినిమా ఎండింగ్‌లో ఇది వెరోనికా(2017) చిత్రానికి ప్రీక్వెల్ అని అర్థమవుతుంది. మీరు హారర్ సినిమా అభిమానులైతే వెంటనే చూసేయండి.. కాకపోతే ఈ స్పానిష్ సినిమాకు తెలుగు డబ్ వర్షన్ లేదు. హిందీ, ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment