ఓన్లీ చంద్రమోహన్‌ | Tollywood Actor Chandramohan No More | Sakshi
Sakshi News home page

ఏ వూరి ‘సీతామాలక్ష్మి’ ఐనా ఇష్టపడే బంగారు కొండయ్య ‘చంద్రమోహన్‌’

Published Sun, Nov 12 2023 5:39 AM | Last Updated on Sun, Nov 12 2023 9:34 AM

Tollywood Actor Chandramohan No More - Sakshi

జననం: 23–5–1942 : మరణం: 11–11–2023

పాలూ మీగడ... పెరుగూ ఆవడా..‘నేను.. మా ఆవిడా’ అన్న తెలుగు సినిమా మధ్యతరగతి భర్త. ‘సీతాపతి సంసారం’ చేసి ఆనాటి గృహిణులను నవ్వుల్లో ముంచెత్తాడు.ఏ వూరి ‘సీతామాలక్ష్మి’ ఐనా ఇష్టపడే బంగారు కొండయ్య ఇతడే.‘కలికాలం’ ధాటికి తల్లడిల్లిన మధ్యతరగతి తండ్రి. ఉత్త ‘సగటు మనిషి’. తెలుగు సినిమా ప్రేక్షకుడు ప్రతి ‘శుభోదయాన’ తలుచుకోదగ్గ నట త్రివిక్రముడు.ఓన్లీ చంద్రమోహన్‌.

చంద్రమోహన్‌ తిని అరాయించుకోని క్యారేజీ లేదు. చేసి నిభాయించని క్యారెక్టరూ లేదు.
అగ్రికల్చర్‌ బిఎస్సీ అంటే వ్యవసాయ విద్య.పంటలు పండించడం తెలియాలి.చంద్రమోహన్‌ ఆ విద్య చదివాడు.అందుకేనేమో తెర మీద ప్రతి పాత్రా పండించాడు.నటులు అయ్యాము, అయిపోయాము, అవ్వాలనుకుంటున్నాము అనుకున్నవారు ఇది ట్రై చేయండి. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా చూడండి. అందులో చలపతిరావు, చంద్రమోహన్‌ చాలా స్నేహితులు. పక్కపక్క ఇళ్లల్లో ఉంటారు.

కుటుంబాలతో కలిసి అన్నవరం వెళితే ఏనాడో విడిపోయిన చలపతిరావు చెల్లెలు మంజుభార్గవి కనిపిస్తుంది. అయినాసరే చలపతిరావు పలకరించడు. అందుకు లక్ష్మి అభ్యంతరపెడితే చలపతిరావు చెయ్యెత్తుతాడు. చంద్రమోహన్‌ అడ్డుపడితే– ‘ఇది మా ఇంటి వ్యవహారం’ అంటాడు చలపతిరావు. అందరూ ఊరికి తిరిగొచ్చాక ,ఇంటి తలుపులు తీసి లోపలికి వచ్చాక, చంద్రమోహన్‌ తన భార్యతో ‘పద మనింటికి’ అంటాడు. అందరూ ‘ఏంటిది కొత్తగా’ అన్నట్టు చూస్తే ఆ క్షణం చంద్రమోహన్‌ ‘అక్కడ నన్ను అంతమాట అంటారా’ అన్నట్టు ఒక ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తాడు. ప్రేక్షకుడికి చివుక్కు మంటుంది. ఆ ఎక్స్‌ప్రెషన్‌ ఎవరైతే ఇవ్వగలరో వారంతా నటులైపోయినట్టే లెక్క.

ఏలూరులో ‘అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌’గా ఉద్యోగం వచ్చాక పెళ్లిసంబంధాల గోల మొదలైంది చంద్రమోహన్‌కి. కాని తన తర్వాత 8 మంది చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. అప్పటికే తండ్రి చనిపోవడంతో భారమంతా తనదే. కాని నాటకాలంటే ఇష్టం. శరీరాన్ని కండలు తిప్పడం ఇష్టం. సినిమాల్లో చేయాలని కోరిక. ఆదుర్తి తీస్తున్న ‘లేత మనసులు’ కోసం ప్రయత్నించాడు. కాని కృష్ణ, రామ్మోహన్‌లకు చాన్స్‌ పోయింది.

ఇంకో సినిమా సెలక్షన్‌కు బెజవాడకు పరిగెడితే అక్కడ ఒక పో డవైన మనిషి తనలాగే వచ్చి ఉన్నాడు. తలెత్తి చూసిన చంద్రమోహన్‌ ‘మీ పేరేమిటండి’ అనడిగితే ‘కృష్ణంరాజు’ అన్నాడు. ఇలాంటి ఆజానుబాహులు ఉండగా నాకెందుకు వేషం ఇస్తారు అని అదే పోత.కాని అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.ఇచ్చినవాడు సాక్షాత్‌ బి.ఎన్‌.రెడ్డి.సినిమా పేరు ‘రంగుల రాట్నం’.అది 1966వ సంవత్సరం.తెలుగు వెండితెర మీద ఈ రెండార్ల సంవత్సరంలో ఆరారు కాలాలు నిలబడే నటుడు పుట్టాడు.

‘కోరిక ఒకటి జనించు.. తీరక ఎడద దహించు కోరనిదేదో వచ్చు... శాంతి సుఖాలను ఇచ్చు ఇంతేరా ఈ జీవితం... తిరిగే రంగుల రాట్నము’...‘రంగులరాట్నం‘లో పాట ఇది. కాని చంద్రమోహన్‌కు కోరిందే జరిగింది... శాంతి సుఖాలను ఇచ్చింది. మహా దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి ఈ ‘పమిడిముక్కల పో ట్టివాడు’ మహా గట్టివాడు అని గ్రహించాడు. ఉద్యోగం మాన్పించి, రిస్క్‌ చేసి, తొలి అవకాశం ఇచ్చాడు. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ‘ఎవరీ చంద్రమోహన్‌... ఇది మొదటి సినిమానా?... మొదటి సినిమాలో ఎవరైనా ఇంత బాగా చేయగలరా?’ అని అంతా ఆశ్చర్యపోవడమే. మొదటి సినిమాకే చంద్రమోహన్‌కు ‘బంగారు నంది’ వచ్చింది.

అంతా బాగానే ఉంది... అయినా సరే నిలదొక్కుకోలేకపోతే? అని భయం. నంది అవార్డుల ఉత్సవంలో నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి చేతుల మీద నంది అందుకుంటూ ‘సార్‌... నా కెరీర్‌ అటూ ఇటూ అయితే మళ్లీ మీరు నాకు వ్యవసాయ శాఖలోనే ఏదో ఒక ఉద్యోగం వేయించాలి’ అని వేడుకున్నాడు చంద్రమోహన్‌. ఆయన నవ్వి ‘మా బి.ఎన్‌ లాంచ్‌ చేస్తే ఫెయిల్‌ అవడం ఉండదు లేవయ్యా. భయపడకు’ అని భరోసా ఇచ్చారు.పెద్దల మాట చెక్కుల మూట అన్నారు.వేషాలూ చెక్కులూ ఆ తర్వాత అలాగే వచ్చి పడ్డాయి.

ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కాంతారావుల తర్వాత ఎవరు అనుకుంటున్న కాలం అది. హరనాథ్, బాలయ్య ఒకవైపు కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు మరోవైపు అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటే చంద్రమోహన్‌ ఎంట్రీ ఇచ్చాడు. ‘ఒక జానెడు ఎత్తుంటే మా అందరినీ తినేస్తావయ్యా’ అని ఎస్‌.వి.ఆర్, ఏ.ఎన్‌.ఆర్‌ ఆ తర్వాతి రోజుల్లో పదేపదే అన్నా చంద్రమోహన్‌కు ఒక జాన తక్కువ ఉండటమే లాభించింది. అతను మిడిల్‌క్లాస్‌ కథలకు సరిపోయాడు. చిన్న సినిమాల బడ్జెట్‌కు సరితూగాడు. 1970ల నాటికి మధ్యతరగతి తన ఉనికి చాటుకుంటూ భార్యాభర్తలు సంసారాలు ఈదడానికి అవస్థలు పడుతూ ఉన్నప్పుడు వారి సంసారాలకు, వాటిలోని సనిదపనిలకు చంద్రమోహన్‌ తెర రూపం అయ్యాడు. ‘ఇంటింటి రామాయణం’, ‘తాయారమ్మ–బంగారయ్య’, ‘ఒక చల్లని రాత్రి’, ‘కోరికలే గుర్రాలైతే’, ‘శుభోదయం’, ‘నేను– మా ఆవిడ’, ‘ కలహాల కాపురం’... ఎన్నని.

ఆ రోజుల్లో రేడియో వినడం మధ్యతరగతి వారికి దినచర్య.‘సీతాపతి సంసారం’లో భార్యను ఉద్యోగానికి పంపి, ఇంట్లో హౌస్‌ హజ్బెండ్‌గా చంద్రమోహన్‌ రేడియోలో వనితావని కార్యక్రమం కింద వెంకాయమ్మ గారు చెప్పే వంకాయకూర వండ బోతాడు. కాని స్టేషన్లు జామ్‌ అయ్యి యోగా కార్యక్రమం కూడా మధ్యలో వినిపిస్తూ ఉంటుంది. 
‘వంకాయలను తరిగాక’... ఒక స్టేషన్‌... ‘మెడను ముందూ వెనక్కూ మూడుసార్లు ఊపి’... ఇంకో స్టేషన్‌... ఒకటే నవ్వులు. ఈ సంసారం చూద్దామని ఆ రోజుల్లో మహిళా ప్రేక్షకులు మొగుళ్లను వెంటబెట్టుకుని ఎన్ని హౌస్‌ఫుల్స్‌ చేశారో!

దర్శకుడు బాపు ‘బంగారు పిచుక’ (1968) తీశారు చంద్రమోహన్‌తో. ‘సుఖఃదుఖాలు’ (1968) లాంటి పెద్ద హిట్‌ పడ్డాక ‘బంగారు పిచుక’ హిట్‌ అయి ఉంటే చంద్రమోహన్‌ కెరీర్‌ ఇంకెంత స్పీడ్‌గా ఉండేదో. కాని అవలేదు. కాలం కంటే ముందు తీసిన కథ అది. ఆ దెబ్బతో చంద్రమోహన్‌ పో ట్టగడవడానికి తోచిన పాత్ర చేయాల్సి వచ్చింది. అదే బాపు తీసిన ‘సంపూర్ణ రామాయణం’లో చిన్నపాటి భరతుడి పాత్ర కూడా వేయాల్సి వచ్చింది. కాని వరుసకు అన్నయ్య అయ్యే కె.విశ్వనాథ్‌ తన తమ్ముణ్ణి గట్టిగా నిలబెట్టాలనుకున్నాడు. నిర్మాతను కన్విన్స్‌ చేసి, తన ఇమేజ్‌ అడ్డు వేసి ‘సిరిసిరిమువ్వ’ (1976)లో హీరోని చేశాడు. జయప్రదకు కూడా అది హీరోయిన్‌గా మొదటి సినిమా. విడదలయ్యాక సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ‘గజ్జె ఘల్లుమంటుంటే... గుండె ఝల్లుమంటోంది’.

1978. చంద్రమోహన్‌ స్థానాన్ని తెలుగు సినిమాల్లో ఖరారు చేసిన సంవత్సరం. ఆ సంవత్సరమే మురారి తీసిన కె.విశ్వనాథ్‌ సినిమా ‘సీతామాలక్ష్మి’ వచ్చింది. అదే సంవత్సరం కె.రాఘవేంద్రరావు తీసిన ‘పదహారేళ్ల వయసు’ వచ్చింది. ‘సీతామాలక్ష్మి’ అంటే తెలిసిందే. కె.విశ్వనాథ్‌ ఎలాగూ హిట్‌ చేస్తాడు. కాని ‘పదహారేళ్ల వయసు’ సినిమాయే కత్తి మీద సాము. అది తమిళంలో భారతీరాజా తీసిన ‘పదారు వయతినిలే’కి రీమేక్‌. అందులో పల్లెటూరి వెంగళాయి పాత్రను కమల్‌హాసన్‌ చేశాడు. డీ గ్లామరైజ్డ్‌ రోల్‌. చంద్రమోహన్‌ అలా గోచి కట్టుకుని ఆ పాత్ర చేస్తే మిగిలేది గోచే అని అంతా భయపెట్టారు.

తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే అన్నారు. అప్పుడే చంద్రమోహన్‌ తన కొత్తింట్లోకి మారాడు. ‘ఈ సినిమా పోతే సెంటిమెంట్‌ ప్రకారం పాత ఇంట్లోకి వెళ్లిపోదాం’ అని భార్య జలంధరతో చె΄్పాడు. మొత్తానికి ‘పదహారేళ్ల వయసు’ రిలీజైంది. ఒకే సంవత్సరం ‘సీతామాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’ సిల్వర్‌జూబ్లీలు ఇచ్చిన హీరో చంద్రమోహన్‌. ఎన్టీఆర్, అక్కినేని వంటి టాప్‌స్టార్ల మధ్యలో ఈ వామనస్టార్‌ కూడా ఉన్నాడు.‘పదహారేళ్ల వయసు’ తెలుగులో సూపర్‌హిట్‌ అయ్యిందని తెలిసి ప్రత్యేకంగా చూసిన కమలహాసన్‌ ‘మీరు చేసిన దాంట్లో పది శాతం కూడా నేను చేయలేకపోయాను’ అన్నాడు. వజ్రం విలువ వజ్రానికే కదా తెలుస్తుంది.

సవాలు విసిరే వేషాలు ఎప్పుడూ చంద్రమోహన్‌నే వరించాయి. తమిళంలో కె.భాగ్యరాజా వచ్చి తనే హీరోగా, దర్శకుడుగా గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. అతనితో మేచ్‌ అయ్యే నటుడు తెలుగులో ఎవరు? చంద్రమోహనే. ‘రాధా కల్యాణం’ (అంద 7 నాటకల్‌), ‘పెళ్లిచూపులు’ (తూరల్‌ నిన్ను పోచ్చు), ‘మూడుముళ్లు’ (ముందానై ముడిచ్చు) ఈ భాగ్యరాజ్‌ సినిమాలన్నీ చంద్రమోహన్‌ సూపర్‌హిట్‌ చేశాడు. మెహమూద్‌ హిందీలో ‘పడోసన్‌’ తీసి హిట్‌ కొడితే దాని రీమేక్‌ ‘పక్కింటి అమ్మాయి’ చంద్రమోహన్‌ హిట్‌ కొట్టాడు. హిందీ ‘హీరో’ను నాగార్జునతో తెలుగులో ‘విక్రమ్‌’ పేరుతో తీస్తున్నప్పుడు ఒరిజినల్‌లో ఎంతో ముఖ్యమైన పాత్ర సంజీవ్‌ కుమార్‌ చేస్తే అందుకు సరిజోడును దర్శకుడు వి. మధుసూదనరావు, నిర్మాత అక్కినేని వెతికి వెతికి చివరకు చంద్రమోహన్‌ దగ్గరికే వచ్చారు. ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’ రీమేక్‌ తెలుగులో ‘రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌’గా తీయాలనుకున్నప్పుడు తెలుగువారి రిషి కపూర్‌ ఎవరు? ఇంకెవరు చంద్రమోహన్‌.

అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రసిద్ధి.అన్నవరం ప్రసాదానికి ప్రసిద్ధి.అన్నవరం చంద్రమోహన్‌కి కూడా ప్రసిద్ధి.ఏనాడైతే ఆ మెట్ల మీద చంద్రమోహన్, రాజ్యలక్ష్మిలతో ‘శంకరాభరణం’లో అందమైన ప్రేమ చూపులను దర్శకుడు కె.విశ్వనాథ్‌ తీశాడో ఆ రోజు అన్నవరం ఎవరు వెళ్లినా భక్తితో పాటు శంకరాభరణం కూడా గుర్తు చేసుకుంటారు. ఒక్క సీన్‌తో చంద్రమోహన్‌ చేసిన మేజిక్‌ అది. అతని చేతిలో నుంచి నీళ్ల గ్లాసు ఊరికూరికే జారిపోతే ప్రేక్షకులకు ఊరికూరికే నవ్వు వచ్చింది.

ఎన్టీఆర్‌ ఏఎన్‌ఆర్‌ల హయాంలో, కృష్ణ శోభన్‌బాబుల హయాంలో, చిరంజీవి బాలకృష్ణల హయాంలో, రాజేంద్రప్రసాద్‌ రాజశేఖర్‌ల హయాంలో కూడా హీరోగా హిట్స్‌ ఇచ్చినవాడు చంద్రమోహన్‌. ‘చిన్నోడు–పెద్దోడు’ (1988) వరకూ హిట్స్‌ ఇస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ‘అల్లుడు గారు’ (1990)తో కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తన సత్తాను నిరూపించుకుంటూ వెళ్లాడు. అతను హీరో అయినా జనం చూశారు. కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌ అయినా చూశారు. ఉదయ్‌కిరణ్, తరుణ్‌లకు తండ్రిగా వేసినా చూశారు. కృష్ణవంశీ ‘గులాబీ’ తక్కిన కారణాల రీత్యా ఎంత హిట్టో సరదా తండ్రిగా వేసిన చంద్రమోహన్‌ వల్ల అంత హిట్టు.

‘మీ అభిమాన నటుడు ఎవరు’ అని జయసుధను అడిగితే ‘ఇంకెవరు చంద్రమోహన్‌’ అంటుందామె తడుముకోకుండా. జయసుధతో దాదాపు 25 సినిమాల్లో హీరోగా చేశాడు అతను. చంద్రమోహన్‌ పక్కన యాక్ట్‌ చేస్తే సూపర్‌స్టార్లు అవుతారనే సెంటిమెంట్‌ హీరోయిన్లకు ఉండేది. వాణిశ్రీ, లక్ష్మి, జయసుధ, జయప్రద, కవిత, సులక్షణ, సుహాసిని, రాధిక, విజయశాంతి... వీరంతా చంద్రమోహన్‌తో చేశాక స్టార్లు అయ్యారు. ‘పదహారేళ్ల వయసు’ తర్వాత శ్రీదేవి మళ్లీ ఆయనతో చేయలేనంత పెద్ద హీరోయిన్‌.

మిమిక్రీ ఆర్టిస్టులు అందరినీ అనుకరిస్తారు గాని చంద్రమోహన్‌ని కాదు. అతనిలాగా చేయగల వాడు అతనొక్కడే. ఆ డైలాగ్‌ మాడ్యులేషన్, ముఖంలో పలికించగల ఎమోషన్, కామిక్‌ టైమింగ్‌... ఇతరులకు ఎప్పటికీ రావు. కాని చంద్రమోహన్‌లో ఒక్కటే చిన్న లోపం ఉంది. బి.ఎన్‌.రెడ్డి గారు హెచ్చరించినా.. మార్చాలని చూసినా మారనిది– చేతులు ఊపనిదే డైలాగ్‌ చెప్పలేకపోవడం. చంద్రమోహన్‌ది ఎడమచేతి వాటం. ఎడమ చేతిని వేగంగా కదిలిస్తూ ఇరు చేతులూ కదిలిస్తూ డైలాగ్‌ చెబుతాడు. 

ఎన్‌.టి.ఆర్‌తో చిన్నపాటి విభేదం
చంద్రమోహన్‌కు ఎన్‌.టి.ఆర్‌కు ఆది నుంచి స్నేహం ఎందుకనో కుదరలేదు. చంద్రమోహన్‌ అక్కినేనితో దాదాపు 40 సినిమాలు చేస్తే ఎన్టీఆర్‌తో వేళ్ల మీద లెక్కించేన్ని సినిమాలే చేశారు. నిజానికి మేకప్‌మేన్‌ పీతాంబరం ఎన్టీఆర్‌తో ‘యాదోంకి బారాత్‌’ రీమేక్‌ ‘అన్నదమ్ముల అనుబంధం’ తీయాలనుకున్నప్పుడు చిన్న తమ్ముడి పాత్రకు చంద్రమోహన్‌ను, పెద్ద తమ్ముడి పాత్రకు మురళీమోహన్‌ను తీసుకున్నారు.

అయితే ఎన్టీఆర్‌ చివరి నిమిషంలో ఆ పాత్రను బాలకృష్ణకు ఇచ్చారు. పీతాంబరం ఇరకాటంలో పడ్డారు. షూటింగ్‌ రోజున మేకప్‌ వేసుకోవడానికి చంద్రమోహన్‌ వస్తే అప్పటికే ఆ పాత్ర బాలకృష్ణకు వెళ్లిందని తెలిసింది. ఆ రోజు నుంచి చాలా రోజుల పాటు ఎన్టీఆర్‌ పట్ల చంద్రమోహన్‌ కినుకతోనే ఉన్నారు. మరోవైపు నష్టనివారణ కోసం పీతాంబరం అదే యాదోంకి బారాత్‌ను తమిళంలో ఎం.జి.ఆర్‌తో తీస్తే అందులో తమ్ముడి పాత్రను చంద్రమోహన్‌కు ఇప్పించారు– జరిగిన విషయం ఎం.జి.ఆర్‌కు చెప్పి. తమిళ యాదోంకి బారాత్‌లో పెద్దన్న, పెద్ద తమ్ముడిగా ఎం.జి.ఆర్‌ డబుల్‌ యాక్షన్‌ చేశారు. చంద్రమోహన్‌ ఎం.జి.ఆర్‌ తమ్ముడిగా చేసి హిట్‌ కొట్టారు.

కనీ వినీ ఎరగని భోజన ప్రియుడు
చంద్రమోహన్‌ కనీవినీ ఎరగని భోజన ప్రియుడు. సాధారణంగా సినిమా వారు మితంగా తింటారు. కాని అదృష్టవశాత్తు చంద్రమోహన్‌ శరీర తత్వానికి ఆయన ఎంత తిన్నా ఏమీ ఒళ్లు పెరిగేది కాదు. షూటింగుల్లో ఆయనకు ఐదు డబ్బాల భారీ క్యారేజీ వచ్చేది. అల్లూరి సీతారామరాజు ఔట్‌డోర్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లో చంద్రమోహన్‌ నలభై యాభై ఇడ్లీలు తినడం చూసి గుమ్మడి, పి.జె.శర్మలాంటి వారు నోరెళ్లబెట్టారు. ‘ఆకాశంలో ఎగిరేవన్నీ తిన్నాను.. నేల మీద పాకేవన్నీ తిన్నాను... నీళ్లలో ఈదేవన్నీ తిన్నాను’ అని సరదాగా తన భోజనప్రియత్వాన్ని అతిశయోక్తితో ఒక ఇంటర్వ్యూలో చె΄్పారు చంద్రమోహన్‌. అందుకే ఆయన తిని అరాయించుకోని క్యారేజీ లేదు.. వేసి నిభాయించని క్యారెక్టరూ లేదు

చంద్రమోహన్‌కు అవార్డులు గివార్డులు పట్టవు. సన్మానాలు గిన్మానాలు నచ్చవు. సినిమా చేశామా... ఇంటికి వెళ్లామా ఇదే ధ్యాస. అందరికీ బిరుదులిచ్చే టి.సుబ్బరామిరెడ్డి ఒకసారి ఆయనకు భారీ బిరుదు ఇచ్చి సత్కారం చేస్తానంటే ‘మీరు ఇచ్చిన వెంటనే దానికి తిలోదకాలు ఇస్తాను’ అని హెచ్చరించినవాడు చంద్రమోహన్‌. పేరుకు ముందు నట అది.. నట ఇది అని బిరుదులు వేయడం కూడా ఆయనకు ఇష్టం లేదు.‘చంద్రమోహన్‌లా వచ్చాను... చంద్రమోహన్‌లా వెళ్లిపోతాను’ అనేవాడాయన.ఎస్‌. అలాగే వెళ్లాడు.
హి ఈజ్‌ ఓన్లీ చంద్రమోహన్‌. – ఖదీర్‌

చంద్రమోహన గీతాలు – హిట్‌ సాంగ్స్‌ – 10
1. మేడంటే మేడా కాదు – సుఖ దు:ఖాలు
2.ఝుమ్మంది నాదం సయ్యంది పాదం – సిరిసిరిమువ్వ
3. మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి
4. నాగమల్లివో తీగమల్లివో – నాగమల్లి
5. కంచికి పోతావా కృష్ణమ్మ – శుభోదయం
6. కలనైనా క్షణమైనా – రాధా కల్యాణం
7. దాసోహం దాసోహం దాసోహం – పెళ్లిచూపులు
8. లేత చలిగాలులు – మూడుముళ్లు
9. పంటచేలో పాలకంకి నవ్వింది – పదహారేళ్ల వయసు
10. నీ తీయని పెదవులు అందకపోతే – కాంచన గంగ
.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement