Tollywood Drugs Case 2021: Director Puri Jagannath Submits Bank Transactions From 2015 - Sakshi
Sakshi News home page

Tollywood Drugs Case: ఆమూడు ఖాతాలపై ఈడీ ఆరా

Published Wed, Sep 1 2021 8:27 AM | Last Updated on Wed, Sep 1 2021 10:15 AM

Tollywood Drugs Case: Director Puri Jagannath Submits Bank Transactions From 2015 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖులతో ముడిపడి ఉన్న డ్రగ్స్‌ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మంగళవారం దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను విచారించారు. ఉదయం 10.12 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన రాత్రి 7.45 గంటలకు బయటకు వచ్చారు. మొత్తం తొమ్మిదిన్నర గంటల సమయంలో కేవలం మూడు గంటలు మాత్రమే అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. జాయింట్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ గోయల్‌ నేతృత్వంలోని ఈడీ అధికారులు పూరీని వివిధ దఫాల్లో, వేర్వేరుగా ప్రశ్నించారు. డ్రగ్స్‌ వ్యవహారంలో సినీ ప్రముఖులకు ఇప్పటికే క్లీన్‌చిట్‌ రావడంతో ఈడీ అధికారులు ప్రధానంగా ఆర్థిక లావాదేవీల పైనే దృష్టి పెట్టి ప్రశ్నించారు.  

రెండు నెలల క్రితం నిందితుల విచారణ 
మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఎక్సైజ్‌ అధికారులు 2017 జూలైలో కెల్విన్, అబ్దుల్‌ వహీద్, ఖుద్దూస్‌ తదితరులను అరెస్టు చేశారు. వీరి విచారణలో అనేకమంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో వారినీ తమ కార్యాలయానికి పిలిపించి విచారించి, వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కేసులపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం న్యాయస్థానంలో అభియోగపత్రాలు కూడా దాఖలు చేసింది. అయితే ఫోరెన్సిక్‌ రిపోర్టుల ఆధారంగా సినీ ప్రముఖులకు క్లీన్‌ చిట్‌ లభించింది. కానీ ఆ చార్జిట్ల ఆధారంగా రంగంలోకి ఈడీ అధికారులు రెండు నెలల క్రితమే ఈ డ్రగ్స్‌ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని విచారించారు. విదేశాల నుంచి సింథటిక్‌ డ్రగ్స్‌ను రప్పించినట్లు సిట్‌ దర్యాప్తులోనే వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంలో సినీ ప్రముఖులకు చెందిన నగదు విదేశాలకు వెళ్లడం ద్వారా మనీల్యాండరింగ్‌ జరిగిందా? ఫెమా చట్ట ఉల్లంఘన చోటుచేసుకుందా? అనే అంశాన్ని ఈడీ పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశాన్ని నిగ్గు తేల్చడం కోసం ఇటీవల 10 మంది సినీ ప్రముఖులు సహా 12 మందికి సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే తొలుత పూరీ జగన్నాథ్‌ను విచారించింది.  

ముందే వివరాలు సేకరించిన ఈడీ 
సమన్లు జారీ చేయడానికి ముందే ఈడీ అధికారులు వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలుసేకరించారు. వీటి ఆధారంగా ఆయా బ్యాంకుల నుంచి స్టేట్‌మెంట్స్‌ సైతం తీసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన రిటర్నులు, బ్యాలెన్స్‌ షీట్లను పరిశీలించారు. ప్రధానంగా 2015–18 మధ్య జరిగిన లావాదేవీలపై దృష్టి పెట్టారు. వీటిలో తలెత్తిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వారిని విచారించాలని నిర్ణయించారు. 

బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లతో హాజరైన పూరీ 
పూరీ తన వెంట మూడు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టేట్‌మెంట్లు› తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈడీ అధికారుల ప్రశ్నలకు ఆయన వెంట ఉన్న సీఏతో పాటు సాయంత్రం వచ్చిన ఆయన సిబ్బంది సమాధానాలు ఇచ్చారు. పూరీతో పాటు ఆయన సంస్థకు చెందిన ఆర్థిక లావాదేవీలన్నీ సినీ రంగానికి సంబంధించినవేనని స్పష్టం చేశారు. ఇవన్నీ వాంగ్మూలం రూపంలో నమోదు చేసుకున్న ఈడీ అధికారులు.. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని పూరీకి చెప్పి పంపారు. గురువారం నటి చార్మీ కౌర్‌ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.అందరి వాంగ్మూలాలను నమోదు చేసి, అవన్నీ పోల్చి చూడాలని ఈడీ భావిస్తోంది. 


పూరీ వెంట కుమారుడు, సోదరుడు 
కొన్ని రోజులుగా ముంబైలో షూటింగ్‌లో ఉన్న పూరీ జగన్నాథ్‌ మంగళవారమే సిటీకి వచ్చారు. ఈడీ కార్యాలయానికి ఆయనతో పాటు కుమారుడు ఆకాష్‌ పూరీ, సోదరుడు సాయిరాం శంకర్, న్యాయవాది, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) సతీష్‌ వచ్చారు. ఈడీ విచారణ ఎంతసేపు జరుగుతుందో తెలియక వీరంతా తమ వెంట ఆహారపానీయాలు తెచ్చుకున్నారు. వీరి వెంట కొందరు సహాయ దర్శకులు, అభిమానులు సైతం అక్కడకు చేరుకున్నారు. పూరీతో పాటు ఆయన కుటుంబీకులు, న్యాయవాది, సీఏలనే ఈడీ అధికారులు కార్యాలయంలోకి అనుమతించారు. పూరీని ప్రత్యేక గదిలోకి తీసుకువెళ్లి ప్రశ్నించారు. తిరిగి వెళ్తున్న సమయంలో పూరీ జగన్నాథ్‌ మీడియాతో మాట్లాడటానికి విముఖత చూపారు.  

నాడు నమూనాలు ఇచ్చింది ఇద్దరే
టాలీవుడ్‌ తారలకు సంబంధమున్న డ్రగ్స్‌ కేసులో కొత్త కోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైన 2017, జూలైలో ఎక్సైజ్‌ శాఖ చేపట్టిన విచారణ సందర్భంగా మొత్తం 12 మంది సినీ ప్రముఖుల్లో ఇద్దరు మాత్రమే తమ రక్త నమూనాలను ఇచ్చినట్లు తెలిసింది. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్‌ మినహా మిగిలిన వారంతా తమ రక్త నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. అయితే, రక్త నమూనాలను తీసుకునే విషయంలో సంబంధిత వ్యక్తి అంగీకారం గానీ లేదంటే కోర్టులు అనుమతి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో మిగిలిన వారి నుంచి శాంపిల్స్‌ తీసుకోకుండా ఎక్సైజ్‌ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వదిలేసింది. ఇద్దరి రక్త నమూనాలను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపగా, వారి రక్తంలో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవని తేలినట్లు సమాచారం. మిగిలిన వారు డ్రగ్స్‌ తీసుకున్నట్లుగానీ లేదా డ్రగ్స్‌ వ్యాపారంతో సంబంధం ఉందనే ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసుతో సినీతారలకు సంబంధం లేదని ఎక్సైజ్‌ శాఖ అప్పట్లోనే తేల్చేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జిïÙటును మూడేళ్ల తర్వాత 2020, డిసెంబర్‌లో కోర్టుకు సమర్పించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement