
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు రవితేజ విచారణ ఎదుర్కొన్నారు. ఆయనతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆరు గంటలపాటు రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మహమ్మద్ జిషాన్ అలీఖాన్ అలియాస్ జాక్‌ను కూడా విచారించారు.
ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న జిషాన్ 2017లో కొకైన్ సరఫరా చేస్తూ ఎక్సైజ్ శాఖకు దొరికాడు. జిషాన్‌తో పాటు బెర్నాడ్ అలియాస్ విలియమ్స్‌ను ఎక్సైజ్ శాఖ అరెస్ట్ చేసింది. ఎఫ్ ప్రొడక్షన్‌కు జిషాన్ గతంలో భాగస్వామిగా వ్యవహరించాడు. సోషల్ మీడియా, యాప్‌ల ద్వారా సినీ తారలకు జిషాన్, విలియమ్స్ డ్రగ్స్ సరఫరా చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. కెంట్ అనే వ్యక్తి ద్వారా నైజీరియా నుంచి కొరియర్స్ ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు నిందితులు ఎక్సైజ్ శాఖకు తెలిపారు.
ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్లు చార్మీ, రకుల్ ప్రీత్‌సింగ్, నటులు నందు, రానాలను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే నందు, రానాలను డ్రగ్ అప్రూవర్ కెల్విన్ సమక్షంలో ఈడీ విచారించింది.