
ఈడీ అధికారుల ఎదుట విచారణకు వస్తున్న నటుడు రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్ ఈవెంట్ మేనేజర్‌గానే తనకు తెలుసునని, మరో నిందితుడు జీషాన్‌తో ఎలాంటి సంబంధాల్లేవని సినీ నటుడు రవితేజ ఈడీ అధికారులకు తెలిపారు. గురువారం రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాసరావు అధికారుల ఎదుట హాజరయ్యారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు సినీ నటులు, మరోవ్యక్తిని విచారించినట్‌లైంది. నందు, రానా దగ్గుబాటిలు వచ్చిన సందర్భంలో ఈడీ అధికారులు డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌ను పిలిచారు. రవితేజ, శ్రీనివాసరావుల వంతు వచ్చేసరికి కీలక నిందితుడు జీషాన్‌ను రప్పించారు.
విడివిడిగా... ఉమ్మడిగా...
రవితేజ, శ్రీనివాసరావు ఉదయం 10 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యా హ్నం 12 గంటల ప్రాంతంలో జీషాన్ వచ్చాడు. జీషాన్‌తో ఏమైనా లావాదేవీలు ఉన్నాయా? అతడితో పాటు కెల్విన్‌కు శ్రీనివాసరావుతో డబ్బు పంపారా? అనే అంశాలపై రవితేజను అధికారులు ప్రశ్నించారు. శ్రీనివాసరావును విచారించిన మరో బృందం రవితేజ ఆదేశాల మేరకు జీషాన్, కెల్విన్‌లను కలిశారా? వారికి నగదు ఇవ్వడం, వారి నుంచి డ్రగ్స్ తీసుకురావడం జరిగిందా? అనేది ఆరా తీశారు.
ఈ సందర్భంగా రవితేజ తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టేట్‌మెంట్లను సమర్పించారు. ఈ ముగ్గురినీ తొలుత విడివిడిగా ప్రశ్నించిన అధికారులు తర్వాత కలిపి విచారించారు. తాను డ్రగ్స్ ఖరీదు చేసినట్‌లైతే గతంలో సిట్ విచారణలోనే ఆ విషయం బయటపడేదని, అప్పుడు కూడా వారు పలు కోణాల్లో ఆరా తీశారని రవి తేజ ఈడీకి తెలిపారు. సుదీర్ఘ కాలంగా రవితేజ వద్ద తాను డ్రైవర్‌గా పని చేస్తున్నానని చెప్పిన శ్రీనివాసరావు, ఆయన వ్యక్తిగత పనులు లేదా సినిమాకు సంబంధించిన పనులపై అనేకమందిని తీసుకురావడం, తీసుకువెళ్లడం చేశానని వివరించాడు.
అందులో భాగంగానే కెల్విన్‌తో నూ సంప్రదింపులు జరిపానని పేర్కొన్నాడు. ఏ సందర్భంలోనూ డ్రగ్స్ ఖరీదు చేసుకురావడం కానీ, ఎవరి నుంచైనా తీసుకురావడం కానీ జరగలేదని స్పష్టం చేశాడు. జీషాన్‌ను విచారించిన అధికారులు కొన్ని కీలకాంశాలు రాబట్టినట్లు సమాచారం. మధ్యాహ్నం 3.30 సమయంలో రవితేజ, శ్రీనివాసరావు ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపో యారు. జీషాన్ మాత్రం సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు వచ్చాడు. సోమవారం నటుడు నవదీప్, డ్రగ్స్ దందాకు కేంద్రంగా ఆరోపణలు ఎదుర్కొం టున్న ఎఫ్–క్లబ్ జీఎంలు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment