ఆ పదాలు ఇక జీవితంలో వినిపించొద్దు | Tollywood Heroines About 2022 | Sakshi
Sakshi News home page

కొత్త సంవత్సరంలో అలా ఉంటామంటోన్న హీరోయిన్లు

Published Sat, Jan 1 2022 8:17 AM | Last Updated on Sat, Jan 1 2022 8:35 AM

Tollywood Heroines About 2022 - Sakshi

2022 గురించి ఏం చెబుతారు? అని అందాల తారలను అడిగితే అందరూ కామన్‌గా చెప్పిన పాయింట్‌ ‘పాజిటివ్‌గా ఉందాం’ అని. ఇంకా ఎవరేమన్నారో చదివేద్దాం.

వ్యక్తిగా, నటిగా ఈ ఏడాది ఇంకా బెటర్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాను. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా 2021 సంతృప్తికరంగా అనిపించింది. అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. 2022లో ఆ సినిమాలను ప్రేక్షకులకు చూపించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ ఏడాది వీలైనంత ఉన్నతంగా జీవించాలని అనుకుంటున్నాను. మనకు దక్కినవాటికి కృతజ్ఞతాభావంతో ఉండాలనుకుందాం. అలాగే ప్రపంచం పట్ల మరింత పాజిటివ్‌గా, బాధ్యతగా ఉండటానికి ప్రయత్నిద్దాం.
– రాశీ ఖన్నా

కొత్త సంవత్సరానికి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోను. కానీ 2022లో కొన్ని టార్గెట్స్‌ పెట్టుకున్నాను. 2022పై నాకు పాజిటివ్‌ వైబ్స్‌ కనిపిస్తున్నాయి. ముందుగా ఈ నెల 14న ‘రాధేశ్యామ్‌’ విడుదల కానుంది. ఈ ఇయర్‌లో ప్రేక్షకులు కొత్త పూజను చూస్తారు. ‘పూజ 2.0’ అనుకోవచ్చు. నా నుంచి 2022లో సినిమాల పరంగానే కాక, కొన్ని కొత్త అనౌన్స్‌మెంట్స్‌ వస్తాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నెగిటివిటీ కనిపిస్తోంది. అందుకే మైండ్‌ను పాజిటివ్‌గా ఉంచుకోవాలి. 
– పూజా హెగ్డే

నేను హ్యాపీగా ఉంటూ, నా చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉండేలా చేయాలనుకుంటున్నాను. మనం సంతోషంగా ఉండటానికి సక్సెస్‌ కూడా కొంత కారణం. సో.. కష్టపడి మరింత సక్సెస్‌ కావాలనుకుంటున్నాను. తోటివారితో పోలికలు పెట్టుకోకూడదు. పోలికలు మన సంతోషాన్ని మనకు దూరం చేస్తాయి. 2021లో నేను డిఫరెంట్‌ సినిమాలు చేశాను. నటిగా 2022లోనూ మరింత కొత్తగా ఎంటర్‌టైన్‌ చేయడానికి కష్టపడతాను.
– లావణ్యా త్రిపాఠి 

2020తో పోల్చితే 2021 నాకు బాగానే గడిచింది. నేను హీరోయిన్‌గా చేసిన రెండు సినిమాలు 2021లో విడుదలయ్యాయి. 2022లో ఇంకా ఉత్సాహంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గతం, భవిష్యత్‌ల గురించి అతిగా ఆలోచించడం కన్నా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం ముఖ్యం. మనకున్న వాటితోనే మనం సంతోషంగా, పాజిటివ్‌గా ఉండాలన్నది నా అభిప్రాయం.
– నభా నటేశ్‌

జీవితంలో ఓ ఫ్లోతో పాజిటివ్‌గా  వెళ్లిపోవడమే నా న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌. 2021లో నేను నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇంకా విడుదల కావాల్సిన చిత్రాలు ఉన్నాయి. 2022లో విడుదలయ్యే ఆ చిత్రాల్లో నా పెర్ఫార్మెన్స్‌ను ప్రేక్షకులు అభినందిస్తారనే నమ్ముతున్నాను. 2022లో కరోనా, డెల్టా, ఒమిక్రాన్‌ వంటి పదాలు మన జీవితాల్లో ఇకపై వినిపించకూడదనే కోరుకుంటున్నాను. కరోనాతో ఇబ్బంది పడ్డ అందరి జీవితాలు మళ్లీ గాడిలో పడాలని ఆశిస్తున్నాను.
– నిధి అగర్వాల్‌

సమయాన్ని అస్సలు వృథా చేయకూడదని నిర్ణయించుకున్నాను. 2021 నాకు ఉగాది పచ్చడిలా సాగింది. 2021లో మా తాతగారు మాకు దూరమయ్యారు. అందుకే 2021 నాకు అంతగా ఇష్టం లేదు. కానీ నేను హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘అద్భుతం’, మలి చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’లు విడుదలయ్యాయి. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. జీవితం అనేది ఊహించలేనిది. మనం ఎన్ని అనుకున్నా జరగాల్సిందే జరుగుతుంది. అందుకే 2022పై నేనంతగా అంచనాలు పెట్టుకోవడం లేదు. పాజిటివ్‌గా ఆలోచిస్తూ నా పనిలో నేను వంద శాతం కష్టపడతాను. 
– శివానీ రాజశేఖర్‌ 

కోవిడ్‌ కారణంగా 2019 నుంచి మనం చాలా బాధలు, ఇబ్బందులు పడుతున్నాం. అందుకే మానసికంగా, ఆర్థికంగా ఇలా ప్రతి విషయంలోనూ 2022లో అందరూ ఓ స్థిరత్వాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. 2022లో మంచి సినిమాలు చేసి, ఇంకా బాగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాలన్నది నా ఆశయం. కులం, మతం, ధనిక, పేద అనే తేడాలు లేవని కోవిడ్‌ మనకు మరోసారి గుర్తు చేసింది. సో.. ఒకరికొకరం సహాయం చేసుకుంటూ అందరం హ్యాపీగా ఉందాం.
– శివాత్మిక రాజశేఖర్‌

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది నా నూతన సంవత్సరం నిర్ణయం. వృత్తి, వ్యక్తిగత జీవితం.. రెండూ ముఖ్యం కాబట్టి రెంటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను. కళ్ల ముందు కరోనా సవాల్‌ ఉన్నప్పటికీ 2021లో చిత్రపరిశ్రమ నిలదొక్కుకుంది. అందులో నేనూ భాగమైనందుకు హ్యాపీగా ఉంది. ఈ 2022లో మనందరం పాజిటివిటీతో ముందుకు సాగుదాం. 
– నేహా శెట్టి

వృత్తిని, ఆరోగ్యాన్ని బ్యాలెన్డ్స్‌గా చూసుకోవాలనుకోవడమే నా 2022 రిజల్యూషన్‌. ఏ విషయంలో అయినా అతి అనేది అనర్థమే. జీవితంలో ఏదైనా సమతూకంగా ఉండాలి. అందుకే జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవాలనుకుంటున్నాను. కోవిడ్‌ పరిస్థితులు, అనారోగ్యానికి గురి కావడం, వర్క్‌ పరంగా కొన్ని బ్యాక్‌లాక్స్‌ ఉండిపోవడం.. ఇలా 2021 నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. అయితే జీవితంలో ఏ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి, నిజమైన స్నేహితులు ఎవరు, మనతో నిజాయితీగా ఉండేవారు ఎవరు అని తెలిసొచ్చింది. 
– మీనాక్షీ చౌదరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement