కరోనా వల్ల సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. 2020లో ముందుగానే విడుదల తేదీ ప్రకటించిన ఏ సినిమా కూడా చెప్పిన తేదీకి దాదాపు రాలేదు. దానికి కారణం లాక్‌డౌన్. కరోనా కాస్త సద్దుమణిగి, సినిమాల విడుదల జోరు పెరిగినా కానీ రెండేళ్ల కరోనా ప్రభావం సినిమా విడుదలపై ఇంకా ఉంది. ఇప్పటికీ సినిమాల విడుదల తేదీలు తారుమారవుతున్నాయి. దానికి ఒక కారణం కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే సంఖ్య తగ్గడమే అని కొందరు పరిశ్రమ ప్రముఖులు అంటున్నారు. ఏది ఏమైనా సినిమాకి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం కూడా వెలిబుచ్చారు. ఇక విడుదల తేదీలు తారుమారైన చిత్రాల గురించి తెలుసుకుందాం.
కాగా సీక్రెట్ ఏజెంట్‌గా అఖిల్ చేపట్టిన ఆపరేషన్ ఏంటి? అనేది తెలియాలంటే ‘ఏజెంట్’ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏజెంట్’. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కావాల్సి ఉంది. ఇటీవల ‘ఏజెంట్’ ట్రైలర్‌ని కూడా అభిమానుల మధ్య గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే.. ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. కొత్త రిలీజ్ తేదీని చిత్రబృందం ప్రకటించలేదు.
ఇంకోవైపు సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘యశోద’ ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది. హరి–హరీశ్ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఓ పాట చిత్రీకరించాల్సి ఉండగా మరోవైపు గ్రాఫిక్స్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసినట్లు చిత్రయూనిట్ ఆ మధ్య పేర్కొంది. కొత్త విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు.
ఇక సముద్రంలోని ద్వారకా నగరంపై నిఖిల్ చేసిన అన్వేషణ కూడా తెరపైకి కాస్త లేట్‌గా రానుంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘కార్తికేయ 2’. ఇందులోనే నిఖిల్ ద్వారకా నగర అన్వేషణ చేశారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 22న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ఫైనల్‌గా ఒక రోజు ఆలస్యంగా ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.
కాగా నిఖిల్ హీరోగా నటించిన మరో చిత్రం ‘18 పేజెస్’ విడుదల తేదీలోనూ మార్పు జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఈ చిత్రం విడుదల కావాల్సింది. అయితే సెప్టెంబరు 10న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు.
అదే విధంగా వైష్ణవ్ తేజ్ వైభవాన్ని చూడాలంటే సెప్టెంబర్ 2 వరకూ వేచి చూడాలి. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘రంగరంగ వైభవంగా’. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదల రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా మూడోసారి ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని తొలుత మే 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినా కాలేదు. ఆ తర్వాత జూలై 1న విడుదల అంటూ అనౌన్స్ చేసినా వాయిదా పడింది. ఫైనల్‌గా సెప్టెంబరు 2న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పోలీస్ ఆఫీసర్ కృష్ణదేవ్ (అడివి శేష్ పాత్ర పేరు) ఓ కేసు విచారణపై శ్రద్ధ పెట్టారు. ఈ విచారణ విశేషాలు తెలియాలంటే ‘హిట్ 2’ రిలీజ్ వరకు వేచి చూడాలి. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్: ది సెకండ్ కేస్’. ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. ‘హిట్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘హిట్ 2’ జూలై 29న రిలీజ్ కావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ కూడా వాయిదా జాబితాలో ఉంది. నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా జంటగా నాగశేఖర్, భావనా రవి నిర్మించిన ఈ చిత్రం జూలై 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ విడుదల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేది ఇంకా చిత్రయూనిట్ ప్రకటించలేదు. మరోవైపు బెల్లంకొండ సురేశ్ చిన్న కుమారుడు గణేశ్ హీరోగా పరిచయ మవుతున్న చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
ఇంకా విడుదల తేదీ వాయిదాపడిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. ఒక తేదీకి అనుకున్న సినిమా మరో తేదీకి వాయిదా పడటం అనేది సాధారణ విషయమే. అయితే ఒకేసారి ఇన్ని చిత్రాలు వాయిదా పడటం అంటే విషయమే.
Comments
Please login to add a commentAdd a comment