హాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలన్నింటికీ షూటింగ్ ప్రారంభించక ముందే దాదాపు విడుదల తేదీ ప్రకటిస్తుంటారు. సీజన్లు, మార్కెట్లు అన్నీ లెక్క చూసుకుని తేదీ ఫిక్స్ చేస్తారు.. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు తమ సినిమాల విడుదల తేదీలను క్యాలెండర్‌లో బ్లాక్ చేసుకుంటాయి... ఇక ఏ మార్పు ఉండదన్నట్టుగా.
కానీ కరోనా వల్ల హాలీవుడ్ చిత్రాల విడుదల తేదీలన్నీ తారుమారయ్యాయి. ఈ అనిశ్చితి ఎందాకో తెలియక ఒక్కొక్కటిగా సినిమాలు వెనక్కి వెళ్తున్నాయి. విడుదల తేదీలకు వీలైనంత దూరం పాటిస్తున్నాయి. కొత్త సినిమాలు తెరల్ని తాకడానికి సంకోచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా మరికొన్ని సినిమాల విడుదల తేదీల్ని మార్చారు. ఆ కబుర్లు.
కరోనా ఉన్నప్పటికీ థియేటర్స్‌ను తెరిచి ప్రేక్షకులను రప్పించాలనుకున్నాయి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు. ఈ నేపథ్యంలో క్రిస్టోఫర్ నోలన్ తీసిన భారీ చిత్రం ‘టెనెట్’ను విడుదల చేశారు. కానీ ఈ సినిమా కలెక్షన్లు ఆశించినంత లేకపోవడం, పూర్తి స్థాయిగా థియేటర్స్ తెరుచుకోకపోవడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. విడుదల తేదీలను మార్చేసుకుంటున్నాయి నిర్మాణ సంస్థలు.
బ్లాక్ విడో
మార్వెల్ సూపర్ హీరో సినిమాలను చూసేవాళ్లకు బ్లాక్ విడో పరిచయం అక్కర్లేదు. ‘అవెంజర్స్’ బృందంలో ఒక కీలక పాత్రధారి. తాజాగా ఈ బ్లాక్‌విడోకు సంబంధించిన కథతో సోలో సూపర్‌హీరో మూవీతో వస్తున్నారు హాలీవుడ్ బ్యూటీ స్కార్లెట్ జాన్సన్. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 6న విడుదల కావాలి. కానీ బ్లాక్‌విడో ఆ రోజు రావడంలేదు. వచ్చే ఏడాది మే7న విడుదల కానుంది.
వెస్ట్ సైడ్ స్టోరీ
హాలీవుడ్ దర్శకధీరుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ మ్యూజికల్ బ్యాక్‌డ్రాప్ తప్ప దాదాపుగా అన్ని జానర్లలో సినిమాలు తెరకెక్కించారు. మొదటిసారిగా ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ టైటిల్‌తో ఓ మ్యూజికల్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 18న విడుదల కావాలి. అయితే ఏకంగా ఏడాదికి వాయిదా వేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ 10న థియేటర్స్‌లోకి రానుంది.
డెత్ ఆన్ ది నైల్
‘ది డెత్ ఆన్ ది నైల్’ నవల ఆధారంగా అదే పేరుతో ఓ హాలీవుడ్ చిత్రం తెరకెక్కింది. మార్గట్ రాబీ, గాల్ గాడోట్ ముఖ్య పాత్రల్లో నటించారు. హిందీ నటుడు అలీ ఫాజల్ ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ 23న విడుదల కావాలి. ఇప్పుడు డిసెంబర్ 18కి వాయిదా పడింది.
ఎటర్నల్స్ – షాంగ్ చీ
మార్వెల్ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ‘ఎటర్నల్స్, షాంగ్ చీ’ చిత్రాలు కూడా కొన్ని నెలల పాటు వాయిదా పడ్డాయి. ఏంజెలినా జోలీ, రిచర్డ్ మాడన్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘ఎటర్నల్స్’ వచ్చే ఏడాది ఫి్ర» వరి12న విడుదల కావాలి. ఇప్పుడు నవంబర్ 5కి వాయిదా వేశారు. అలాగే ‘షాంగ్ చీ’ చిత్రం 2021 మే 7 నుంచి 2021 జూలై 2కి వాయిదా పడింది. మరి కొత్తగా ప్రకటించిన తేదీల్లో అయినా సినిమాలు థియేటర్లకు వస్తాయా? పరిస్థితి ఇంతే ఉంటే మళ్లీ తేదీలు అటూ ఇటూ అవుతాయా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment