ఇక సమయం లేదు ప్రియతమా! | Top Film And Sports Celebrities Get Married Amid Lockdown | Sakshi
Sakshi News home page

ఇక సమయం లేదు ప్రియతమా!

Published Tue, Sep 15 2020 3:04 PM | Last Updated on Tue, Sep 15 2020 8:56 PM

Top Film And Sports Celebrities Get Married Amid Lockdown - Sakshi

(వెబ్‌ స్పెషల్‌) కల్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు అంటారు. అది ఈ సెలబ్రిటీల పెళ్లిళ్ల విషయంలో నిజమని మరోసారి నిరూపితమైంది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచమంతా అల్లకల్లోలమవుతుంటే వీరు మాత్రం పెళ్లికే మొగ్గు చూపారు. లాక్‌డౌన్‌తో రాకరాక వచ్చిన అవకాశం, మళ్లీ ఇంతటి ఖాళీ టైం దొరకదంటూ కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ వివాహం చేసుకున్నారు. మరికొందరు నిశ్చితార్థం వరకూ కానిచ్చేశారు. ఇక వివాహాలు, ఎంగేజ్‌మెంట్లతో బిజీ అయినవారు కొందరుంటే.. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైనా వాణిజ్య ప్రకటనలు చేసి కమర్షియల్‌గా బెనిఫిట్‌ పొందిన సెలబ్రిటీలు మరికొందరు. 


దిల్‌ రాజు వెడ్స్‌ తేజస్విని
ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు (వెంకట రమణారెడ్డి) మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించారు. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న ఆయన కుమార్తె హన్షితా రెడ్డి కోరికమేరకు తేజస్విని (వైఘా రెడ్డి)ని వివాహం చేసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మే 10న నిరాడంబరంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. కరోనా నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు తగు జాగ్రత్తలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. 


యువ హీరో పెళ్లి బాజా 
నితిన్‌–షాలినీల వివాహం హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జులై 26న జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించి, పరిమిత అతిథుల మధ్య పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. నితిన్‌ పెళ్లి సందర్భంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హాజరై నూతన వధూవరులకు ఆశీర్వచనాలు అందించారు.


డాక్టర్‌తో నిఖిల్ సిద్ధార్థ
హీరో నిఖిల్‌ సిద్ధార్థ తన ప్రేయసి డాక్టర్‌ పల్లవి వర్మను వివాహమాడాడు. కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల పాటిస్తూ హైదరాబాద్‌ శివారులోని ఓ రిసార్ట్‌లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మే 14న ఈ పెళ్లి వేడుక జరిగింది. 
(చదవండి: విడాకులు తీసుకున్న వారిని పెళ్లాడిన హీరోయిన్లు)


జబర్దస్త్‌ కమెడియన్‌ పెళ్లి
జబర్దస్త్‌ షో ద్వారా పాపులర్‌ అయిన నటుడు మహేష్ బంధువుల అమ్మాయి పావనిని పెళ్లి చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన మహేష్ లాక్ డౌన్ వల్ల అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి వేడుక నిర్వహించారు. నిఖిల్‌ సిద్ధార్థ పెళ్లి అయిన రోజునే మహేశ్‌ పెళ్లి కూడా కావడం విశేషం.


బాహుబలి రానా
రానా దగ్గుబాటి తన ప్రియురాలు మిహికా బజాజ్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఆగస్టు 8న మూడుముళ్లు వేసి, ఆమెతో కలిసి ఏడడుగులు నడిచాడు. కరోనా నేపథ్యంలో కొద్దిమంది కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరుకుటుంబాలకు బాగా దగ్గరైన ప్రముఖులు హాజరయ్యారు. 


ఇష్ట సఖితో సాహో దర్శకుడి వివాహం
సాహోచిత్ర దర్శకుడు సుజీత్ తన ప్రేయ‌సి, డెంటిస్ట్‌ ప్రవళికని పెళ్లి చేసుకున్నాడు. గతకొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. కరోనా కారణంగా బంధువుల హడావుడి లేకుండా సింపుల్‌గా ఈ వేడుక నిర్వహించారు.


నిఖిల్ గౌడ 
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, శాండల్‌వుడ్‌ హీరో నిఖిల్‌ గౌడ ఓ ఇంటివాడయ్యాడు. రామనగరకు సమీపంలోని కేతగానహళ్లిలోని ఫాంహౌస్‌లో ఏప్రిల్‌ 17న నిఖిల్‌ కల్యాణం జరిగింది. అంగరంగ వైభవంగా నిర్వహించాలని అనుకున్నా కరోనా లాక్‌డౌన్‌ అడ్డు వచ్చింది. పెళ్లికి తక్కువ సంఖ్యలో ఇరు కుటుంబాల పెద్దలు హాజరయ్యారు. అయితే, ఈ పెళ్లి వేడుకపై విమర్శలు వచ్చాయి. నిబంధనలు పాటించకుండా వివాహ కార్యక్రమం నిర్వహించారని పలువురు కోర్టులో పిటిషన్‌ వేశారు.


నిహారిక నిశ్చితార్థం
కొణిదెల నాగ‌బాబు కూతురు, హీరోయిన్ నిహారికకు చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు చైత‌న్య . హైదరాబాద్‌లో ఆగస్టు 13న ఈ వేడుక జరిగింది.

హాస్య నటి విద్యుల్లేఖ
తెలుగు, త‌మిళ సినీ ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులు పంచిన హాస్య న‌టి విద్యుల్లేఖ రామ‌న్ పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు. ఫిట్‌నెస్, న్యూట్రీష‌న్ నిపుణుడు సంజ‌య్‌ను వివాహం చేసుకోనున్నారు. ఆగ‌స్టు 26న రోకా ఫంక్ష‌న్ కూడా జ‌రిగిన‌ట్లు ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. 
(చదవండి: వయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు)


యుజీ దిల్‌ చోరీ హోగయా!
టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ తన ప్రేయసి, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మతో ఆగస్టు 8న రోకా (నిశ్చితార్థం) చేసుకున్నాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల అంగీకారం పొందింది.‘నా హార్ట్‌ పిజ్జాను దొంగిలించావ్‌’అని చహల్‌ ఇన్‌స్టాలో పేర్కొనగా.. అవును అని ధనశ్రీ వర్మ రిప్లై ఇచ్చింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న అతను ప్రస్తుతం యూఏఈలో ఉన్నాడు.


గుత్తా జ్వాల
భారత బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్ గుత్తా జ్వాలతో తమిళ హీరో విష్ణు విశాల్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. గత రెండేళ్లుగా ఈ జంట రిలేషన్‌షిప్‌లో ఉంది. గుత్తా జ్వాల పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా  వీరు ఉంగరాలు మార్చుకున్నారు. ఇక విష్ణు విశాల్‌కి 2010లోనే వివాహం కాగా, రజనీ నటరాజన్‌ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఆర్యన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. కానీ.. మనస్పర్థలు కారణంగా 2018లో వారిద్దరు విడిపోయారు. మరోవైపు గుత్తా జ్వాలకి కూడా భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌తో 2005లో వివాహమైంది. కానీ.. వీరిద్దరూ 2011లో విడిపోయారు. 

లాక్‌డౌన్‌ సమయంలో మరిన్ని పెళ్లిళ్లు
త‌మిళ బిగ్‌బాస్ సీజ‌న్-1 విన్న‌ర్ ఆరవ్ న‌ఫీజ్ కూడా బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ పెళ్లి పీట‌లెక్కాడు. సెప్టెంబర్‌ 6న న‌టి రేహి మెడ‌లో మూడు ముళ్లు వేశారు. ఇటీవ‌ల ఓటీటీలో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా హీరోయిన్‌ షాలిని వడ్నికట్టి పెళ్లి చేసుకుంది. కరోనా కారణంగా పెద్దగా బంధువులు హడావుడి లేకుండా త‌మిళ ద‌ర్శ‌కుడు మనోజ్ బీదను  ఆమె వివాహం చేసుకుంది. మ‌ల‌యాళ న‌టి మియా జార్జ్ శ్రీమ‌తిగా మారారు. ఆమె వ్యాపార‌వేత్త అశ్విన్ ఫిలిప్‌ను వివాహం చేసుకున్నారు.


తన చిరకాల స్నేహితుడు, సాకర్‌ ఆటగాడు మార్కస్‌ రాయ్కెన్‌తో ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్‌

టీవీ నటి, ‘దియా ఔర్‌ బాతీ హమ్‌’ ఫేం ప్రాచీ తెహ్లాన్‌ ఓ ఇంటివారయ్యారు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రోహిత్‌ సరోహను వివాహమాడారు. ‘దేవోంకీ దేవ్‌ మహదేవ్‌’(హరహర మహాదేవ శంభో శంకర) సీరియల్‌​ ఫేం పూజా బెనర్జీ తన చిరకాల మిత్రుడు, నటుడు కునాల్‌ వర్మను వివాహమాడారు. కమెడియన్‌, రియాలిటీ షో ఖత్రోంకీ ఖిలాడీ 10 ఫేం బాల్‌రాజ్‌ సియల్‌ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. బాలీవుడ్‌ సింగర్‌ దీప్తి తులిని అతడు వివాహమాడాడు. ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్‌ ఓ ఇంటివారయ్యారు. తన చిరకాల స్నేహితుడు, సాకర్‌ ఆటగాడు మార్కస్‌ రాయ్కెన్‌ను వివాహమాడారు. 

ఇదిలాఉండగా.. పెళ్లంటే నూరేళ్ల పంట. మళ్లీ మళ్లీ జరిగే వేడుక కాదు ఇది అని కొందరు సెలబ్రిటీలు చెప్తున్నారు. ఆడంబరాలు, బంధువులు, అతిథులంతా లేనిదే వివాహం చేసుకోవడం నచ్చడం లేదని చెప్తూ.. తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. ఇక నాగచైతన్య-సమంత, మహేశ్‌బాబు-నమ్రత ఏరియల్‌ వాషింగ్‌ లిక్విడ్‌ను ఉపయోగిస్తూ సోషల్‌ మీడియాలో వాటిని ప్రమోట్‌ చేస్తున్నారు. తద్వారా కమర్షియల్‌గా లబ్ది పొందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement