బాలీవుడ్ నటి ఉపాసన సింగ్ గురించి బీటౌన్‌లో తెలియని వారు ఉండరు. హిందీలో పలు చిత్రాల్లో నటించారామె. బాలీవుడ్ కామెడీ షో ది కపిల్ శర్మ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లో ఉపాసన కనిపించారు. అంతేకాకుండా ఉపాసన పంజాబీ సినిమాల్లో కూడా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె సౌత్ డైరెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో తనకెదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది.
ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ..'అనిల్ కపూర్ సరసన ఒక పెద్ద సౌత్ ఫిల్మ్ డైరెక్టర్ మూవీకి సైన్ చేశా. నేను డైరెక్టర్ ఆఫీసుకి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ, సోదరిని తీసుకెళ్లేదాన్ని. ఒక రోజు అతను నన్ను ఎప్పుడూ ఎందుకు మీ అమ్మను తీసుకొని వస్తావు అని అడిగాడు. ఒక రోజు రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసి సిట్టింగ్ వేద్దామని చెప్పి తన హోటల్‌కు రమ్మని అడిగాడు. నా వద్ద కారు లేదని.. రేపు ఉదయం ఆఫీస్‌కు వచ్చి కథ వింటానని చెప్పా. కానీ దానికి ఆయన.. నీకు సిట్టింగ్‌కు సరైన అర్థం తెలియదా?’ అంటూ నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దర్శకుడితో మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదని' అని తెలిపింది.
ఆ తర్వాత మాట్లాడుతూ.. "డైరెక్టర్ కార్యాలయం ముంబయిలోని బాంద్రాలో ఉంది. మరుసటి రోజు ఉదయం నేను డైరెక్టర్ ఆఫీస్‌కు వెళ్లా. అక్కడ మరో నలుగురు వ్యక్తులతో ఆయన సమావేశంలో ఉన్నారు. అతని సెక్రటరీ నన్ను బయట వేచి ఉండమని చెప్పాడు. కానీ నేను అలా చేయలేదు. మీటింగ్‌లో ఉండగానే లోపలికి ప్రవేశించా. దాదాపు ఐదు నిమిషాల పాటు పంజాబీలో అతనిని దుర్భాషలాడాను. వాళ్ల ముందే అతన్ని తిట్టి బయటకు వచ్చేశా. కానీ ఆ ప్రాజెక్ట్ నా చేయి జారిపోవడంతో ఎంతో ఏడ్చేశా. ఆ తర్వాత వారంరోజుల పాటు బయటకు రాలేదు. అప్పటికే అనిల్ కపూర్‌తో సినిమా చేస్తున్నానని చాలామందికి తెలియజేశా. ఇప్పుడు వాళ్లకు ఏం చెప్పాలని ఆలోచించా. కానీ ఆ పరిస్థితులే నన్ను మరింత స్ట్రాంగ్‌గా మార్చాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ఇండస్ట్రీ వదలకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా'అని ఉపాసన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ డైరెక్టర్ పేరును మాత్రం రివీల్ చేయలేదు.
కాగా.. ఉపాసన సింగ్ తన కెరీర్‌లో సినిమాలతో పాటు బుల్లితెరపై మెరిసింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి జుడ్వా (1997)లో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మెయిన్ ప్రేమ్ కీ దివానీ హూన్ (2003), క్రేజీ 4 (2008) చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించింది. కపిల్ శర్మ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో మరింత ఆదరణ దక్కించుకుంది. అంతేకాకుండా డర్, లోఫర్, భీష్మ, బాదల్, హంగామా, హల్‌చల్, డిస్కో సింగ్, బబ్లీ బౌన్సర్ వంటి చిత్రాల్లో ఉపాసన సింగ్ నటించారు.
Comments
Please login to add a commentAdd a comment