నగరంలో వరుస హత్యలు.. రావాలి ఓ గూఢచారి | Upcoming Spy Thriller Movies In Tollywood Industry | Sakshi
Sakshi News home page

నగరంలో వరుస హత్యలు.. రావాలి ఓ గూఢచారి

Published Tue, Sep 14 2021 11:42 PM | Last Updated on Wed, Sep 15 2021 7:29 AM

Upcoming Spy Thriller Movies In Tollywood Industry - Sakshi

‘ఘోస్ట్‌’లో నాగార్జున, ‘ఏజెంట్‌’లో అఖిల్, ‘డెవిల్‌’లో కల్యాణ్‌రామ్‌

నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి... హంతకుడిని పట్టుకోవాలంటే రావాలి ఒక గూఢచారి. పిల్లలు మాయమవుతుంటారు... కిడ్నాప్‌ చేసిందెవరో కనిపెట్టాలంటే రావాలి ఒక గూఢచారి. ప్రపంచ వినాశనానికి ఓ గ్యాంగ్‌ ప్లాన్‌ చేస్తుంది. గ్యాంగ్‌ని పట్టుకోవడానికి రావాలి ఓ గూఢచారి. ఈ నిందితులను పట్టుకోవడానికి గూఢచారి వేసే ప్లాన్లు భలే ఆసక్తిగా ఉంటాయి. అందుకే వెండితెరపై గూఢచారి కథలకు భలే క్రేజ్‌ ఉంటుంది. ప్రస్తుతం ‘గూఢచారి’ పాత్ర చేస్తున్న కొందరు తారల గురించి తెలుసుకుందాం...

పోలీసాఫీసర్‌ పాత్రలు నాగార్జునకు కొత్తేం కాదు.. ఒకప్పటి హిట్‌ ‘శివమణి’, రీసెంట్‌గా వచ్చిన ‘ఆఫీసర్‌’ వరకు వీలైనప్పుడల్లా నాగార్జున లాఠీ పట్టారు. కానీ కాస్త రూటు మార్చి ‘వైల్డ్‌డాగ్‌’లో సీక్రెట్‌ ఏజెంట్‌గా డ్యూటీ చేశారు నాగార్జున. మళ్లీ ‘ది ఘోస్ట్‌’ మిషన్‌ కోసం సీక్రెట్‌ ఏజెంట్‌గా చార్జ్‌ తీసుకుని ముష్కరుల వేట ప్రారంభించారు. ఈ మిషన్‌ను ప్రవీణ్‌ సత్తారు డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ ఘోస్ట్‌ మిషన్‌లోనే మరో సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపిస్తారు కాజల్‌ అగర్వాల్‌. ఈ సినిమా కోసం నాగార్జున, కాజల్‌ యాక్షన్‌ సీక్వెన్సెస్‌కు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. తండ్రి నాగార్జున గూఢచారి పాత్ర చేస్తుంటే మరోవైపు తనయుడు అఖిల్‌ కూడా ఆ పాత్ర చేస్తుండటం విశేషం. ‘ఏజెంట్‌’ సినిమాలో అఖిల్‌ గూఢచారి పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా కోసం అఖిల్‌ సిక్స్‌ప్యాక్‌లోకి మారారు. అంతేకాదు.. యాక్షన్‌ సీక్వెన్స్, గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ  కూడా తీసుకున్నారు.

మరోవైపు నిఖిల్‌ కూడా గన్‌ పట్టుకుని గూఢచారి అవతారం ఎత్తనున్నారు. ఈ మిషన్‌కు గ్యారీ బి హెచ్‌ డైరెక్టర్‌. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇక కల్యాణ్‌ రామ్‌ తాజాగా మిస్టరీ మూవీ ‘డెవిల్‌: ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’ సైన్‌ చేశారు. ఇందులో బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపించనున్నారు కల్యాణ్‌ రామ్‌. బ్రిటిష్‌ ఇండియా మద్రాస్‌ ప్రెసిడెన్సీ 1945 కాలంనాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి నవీన్‌ మేడారం దర్శకుడు. ఇప్పటికే ‘గూఢచారి’ చిత్రంలో సక్సెస్‌ఫుల్‌  సీక్రెట్‌ ఏజెంట్‌గా మెప్పించిన అడివి శేష్‌ మరోసారి ఆ పాత్రలో కనిపించనున్నారు. ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. అలాగే ‘హిట్‌’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘హిట్‌2’లో శేష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపిస్తారట. ‘హిట్‌’ తొలి భాగాన్ని డైరెక్ట్‌ చేసిన శైలేష్‌ కొలనుయే ‘హిట్‌ 2’ను కూడా డైరెక్ట్‌ చేయనున్నారు. వీరే కాకుండా మరికొంతమంది హీరో హీరోయిన్లు కూడా సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపించేందుకు సీక్రెట్‌గా కొత్త కథలు వింటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement