Producer Usha Mulpuri Interesting Comments On Krishna Vrinda Vihari Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Krishna Vrinda Vihari: ఒక లక్ష్యంతో ఇండస్ట్రీకి రాలేదు.. ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నా

Published Wed, Aug 24 2022 6:31 PM | Last Updated on Wed, Aug 24 2022 6:45 PM

Usha Mulpuri Talk About Krishna Vrinda Vihari Movie - Sakshi

‘నేను ఇండస్ట్రీకి ఒక లక్ష్యంతో రాలేదు. అనుకోకుండా రావాల్సివచ్చింది. ఎప్పటికప్పుడు సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామా అనే ఆలోచనలోనే  ఉన్నాను కాబట్టే వేరే హీరోలను అప్రోచ్ అవ్వలేదు. కానీ ‘కృష్ణ వ్రింద విహారి' తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు మరిన్ని చిత్రాలు నిర్మిస్తాను’అన్నారు హీరో నాగశౌర్య తల్లి, నిర్మాత ఉషా మూల్పూరి. నాగశౌర్య హీరోగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర నిర్మాత ఉషా మూల్పూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

‘కృష్ణ వ్రింద విహారి' కమర్షియల్ ఎంటర్ టైమెంట్ ఫ్యామిలీ మూవీ. ఈ కథకి ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. అలాగే పిల్లల ప్రేమ, మా పెద్దబ్బాయి సాఫ్ట్ వేర్, ఇలా అన్ని ఎలిమెంట్స్ కి కనెక్ట్  అయ్యాం. 

ఈ చిత్రంలో నాగశౌర్య ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిన్ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఇలా భిన్నమైన కోణాల్లో కనిపిస్తాడు. ఆయన కెరీర్‌లో ‘కృష్ణ వ్రింద విహారి' ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. 

ఈ చిత్రంలో 200 మంది డ్యాన్సర్‌తో కలిసి చేసిన పాటకు మంచి స్పందన లభించింది. సినిమాలో ఓ మంచి సందర్భంలో ఈ పాట వస్తుంది. విజయ్ మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. డీవోపీ సాయిశ్రీరామ్ కూడా చాలా అందంగా ఆ పాటని చిత్రీకరీంచారు. రిలీజ్ అయిన తర్వాత ఈ పాటకు మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. 95 శాతం సినిమా పూర్తయింది. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ పై ఒక నిర్మాతగా చాలా ఆనందంగా  ఉన్నాను. 

టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత  ఉంది. షిర్లీ సెటియా ఆ కొరతని తీరుస్తుందనే నమ్మకం  ఉంది. చాలా మంచి నటి. అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసింది. ఇందులో హీరోయిన్ పేరు వ్రిందా. హీరో పేరు కృష్ణ. అందుకే చిత్రానికి కృష్ణ వ్రిందా విహారి అనే టైటిల్ పెట్టాం. 

ఈ సినిమా చేస్తున్నపుడు నిర్మాతగా నేను ఎలాంటి ఒత్తిడి లేదు. అద్భుతమైన కథ. ఆ కథకు తగ్గట్టు నటీనటులు, సాంకేతిక నిపుణలని ఎంపిక చేసుకున్నాం. ఈ సినిమాపై మాకు చాలా నమ్మకం  ఉంది. సినిమా చాలా ఫ్రెష్ గా  ఉంటుంది. శౌర్య అద్భుతంగా చేశాడు. రాధిక, వెన్నెల కిషోర్, బ్రహ్మజీ, రాహుల్ రామకృష్ణ, సత్య అందరి పాత్రలు బావుంటాయి.  దర్శకుడు అనీష్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని అద్భుతంగా డీల్ చేశారు. సినిమా అందరికీ నచ్చుతుంది. ఎవరినీ నిరాశ పరచదు. మా బ్యానర్ ఇది చాలా మంచి చిత్రమౌతుంది.  

► ఇప్పటికే కొన్ని కథలు విన్నాం.  అయితే ఇప్పుడు కొత్త సినిమా ఆలోచన లేదు. నిండు గర్భిణి బిడ్డని కన్న తర్వాతే మరో బిడ్డ గురించి ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఆ పరిస్థితిలో వున్నాను. ప్రస్తుతం నా దృష్టి  అంతా ఈ చిత్రం విడుదలపైనే  ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement