రజనీకాంత్‌ "వేట్టయన్‌" మూవీ రివ్యూ | 'Vettaiyan' Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ ‘వేట్టయన్‌’ మూవీ రివ్యూ

Oct 10 2024 2:10 PM | Updated on Oct 10 2024 4:41 PM

'Vettaiyan' Movie Review And Rating In Telugu

టైటిల్‌:  ‘వేట్టయన్- ది హంట‌ర్‌’
న‌టీన‌టులు:రజనీకాంత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, మంజు వారియ‌ర్‌, ఫాహ‌ద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజ‌య‌న్ త‌దిత‌రులు
నిర్మాణ సంస్థ:  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ 
ద‌ర్శ‌క‌త్వం: టి.జె.జ్ఞాన‌వేల్‌
సంగీతం:అనిరుధ్‌ ర‌విచంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ఎస్‌.ఆర్‌.క‌దిర్‌
ఎడిట‌ర్‌:  ఫిలోమిన్ రాజ్‌
విడుదల తేది: అక్టోబర్‌ 10, 2024

కథేంటంటే.. 
ఎస్పీ అదియన్‌ (రజనీకాంత్‌) ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్‌ (ఫహద్‌ ఫాజిల్‌) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్‌ టీచర్‌ శరణ్య(దుషారా విజయన్‌)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్‌ని అదియన్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్‌లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌ ఎస్సీ హరీశ్‌ కుమార్‌(కిశోర్‌)కి అప్పగిస్తారు. 

ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్‌ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్‌(రావు రమేశ్‌) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్‌ న్యాయమూర్తి సత్యదేవ్‌(అమితాబ్‌ బచ్చన్‌) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్‌ ఎలా కనిపెట్టాడు?  ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
'సత్వర న్యాయం'పేరుతో పోలీసులు చేసే ఎన్‌కౌంటర్లు ఎంతవరకు కరెక్ట్‌? అనే సీరియస్‌ పాయింట్‌తో వేట్టయన్‌ అనే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జ్ఞానవేల్‌. జైభీమ్‌ సినిమా మాదిరే ఇందులో కూడా పేదవాడికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు.  అలా అని  ఈ సినిమా కథనం  జైభీమ్‌ మాదిరి నెమ్మదిగా, ఎలాంటి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకుండా సాగదు. రజనీకాంత్‌ ఫ్యాన్స్‌కి కావాల్సిన మాస్‌ ఎలిమెంట్స్‌ అన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. అయితే ఎమోషనల్‌గా మాత్రం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.  

ఈ కథలో చాలా డెప్త్‌ ఉంది. కేవలం ఎన్‌కౌంటర్‌పై మాత్రమే కాకుండా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విద్య దోపిడిపై కూడా దర్శకుడు ఈ చిత్రంలో చర్చించాడు. స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ప్రైవేట్‌ సంస్థలు పేద విద్యార్థులను ఎలా దోచుకుంటున్నాయి? అనేది తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించాడు.  కానీ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యాడు. 

బలమైన భావోధ్వేగాలు పండించే సీన్లను కూడా సింపుల్‌గా తీసేశారు.  విలన్‌ పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. అలాగే ఉత్కంఠను పెంచే సన్నివేశాలేవి ఇందులో ఉండవు.  పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ కూడా అంతగా ఆకట్టుకోదు. కొన్ని చోట్ల రజనీకాంత్‌ తనదైన మ్యానరిజంతో ఆ తప్పులను కప్పిపుచ్చాడు. ఇంటర్వెల్‌కి 20 నిమిషాల ముందు వరకు కథనం సాదాసీదాగా సాగినా..  పహద్‌ పాత్ర చేసే చిలిపి పనులు, రజనీకాంత్‌ మాస్‌ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్‌ బోర్‌ కొట్టదు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్‌లోనే మెయిన్‌ స్టోరీ అంతా ఉంటుంది. అయితే బలమైన సీన్లు లేకపోవడంతో కొన్ని చోట్ల బోర్‌ కొడుతుంది.  క్లైమాక్స్‌ బాగున్నా.. ‘పేదవాడిని అయితే ఎన్‌కౌంటర్‌ చేస్తారు కానీ డబ్బున్న వాడిని చేయరు’ అని అమితాబ్‌ పాత్రతో డైరెక్టర్‌ చెప్పించిన డైలాగ్‌కి  ‘న్యాయం’ జరగలేదనిపిస్తుంది. 

ఎవరెలా చేశారంటే.. 
రజనీకాంత్‌ మ్యానరిజం, స్టైల్‌ని దర్శకుడు జ్ఞానవేల్‌ కరెక్ట్‌గా వాడుకున్నాడు. అభిమానులు అతన్ని తెరపై ఎలా చూడాలనుకుంటారో అలాగే ఎస్పీ అదియన్‌ పాత్రను తీర్చిదిద్దాడు. ఆ పాత్రకు రజనీ పూర్తి న్యాయం చేశాడు. వయసుతో సంబంధం లేకుండా తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే’అంటూ ఆయన చేసే యాక్షన్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి.  ఇక న్యాయమూర్తి సత్యదేవ్‌గా అమితాబ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై హుందాగా కనిపిస్తాడు. అదియన్‌ భార్యగా మంజువారియర్‌ పాత్ర పరిది తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. 

ఇక ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అదియన్‌ తర్వాత అందరికి గుర్తుండే పాత్ర ప్యాట్రిక్‌. ఒకప్పుడు దొంగగా ఉండి ఇప్పుడు పోలీసులకు సహాయం చేసే ప్యాట్రిక్‌ పాత్రలో ఫహద్‌ ఒదిగిపోయాడు.  రానా విలనిజం పర్వాలేదు. కానీ ఆ పాత్రను మరింత బలంగా రాసి ఉంటే బాగుండేది.  రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజ‌య‌న్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమాగా బాగుంది. అనిరుధ్‌ నేపథ్య సంగీతం బాగుంది. ‘మనసిలాయో’ పాట మినహా మరేవి అంతగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement