
తమిళసినిమా: చిరుతై పులిగళ్ పార్టీ నేత వేలు పిళ్లై ప్రభాకరన్‌ను తమిళులు ఎప్పటికీ మరచిపోలేరు. శ్రీలంక ప్రజల హక్కులు, వారి రక్షణ కోసం నిరంతరం పోరాడి శ్రీలంక ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీరుడు ప్రభాకరన్. ఆ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయి న ఈయన గురించి ఇప్పటికే పలు చిత్రాలు రూపొందాయి. తాజాగా మరో చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈయన విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విడుదలై చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీని తరువాత నటుడు సూర్య హీరోగా వాడి వాసల్ చిత్రం చేయనున్నారు. ఆ తరువాత వేలుపిళ్లై ప్రభాకరన్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీనిని నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ నిర్మించనున్నట్లు ఇటీవల ఒక వేదికపై స్వయంగా వెల్లడించారు. అదేవిధంగా ఇటీవలే విడుదలైన సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శిస్తున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోని జయం రవి నటించిన అరుణ్‌మొళి ఇతివృత్తంతో చిత్రం చేస్తానని తెలిపారు.
కాగా వేలుపిళ్లై ప్రభాకరన్ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందని చర్చ జరిగినట్లు, ఆ పాత్రకు విజయ్‌కాంత్ మాత్రమే న్యాయం చేయగలరని, అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి అంత బాగుండకపోవడంతో నటించే అవకాశం లేదని సీమాన్ భావించినట్లు సమాచారం. దీంతో వేలుపిళ్లైప్రభాకరన్ పాత్రలో ప్రస్తుతం నటించగల సత్తా వున్న నటుడు విజయ్ సేతుపతికి మాత్రమే ఉందన్న నిర్ణయానికి వచ్చి ఆయన్ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment