సాక్షి, చెన్నై: బీస్ట్ చిత్ర విడుదల నేపథ్యంలో అభిమానుల దూకుడుకు కళ్లెం వేయడానికి సినీ నటుడు దళపతి విజయ్ సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీలను, అధికారుల్ని విమర్శించే విధంగా, అవహేళన చేసే రీతిలో వ్యవహరించ వద్దంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్నేళ్లుగా విజయ్ నటించిన చిత్రాలన్నీ వివాదాల నడుమ తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందుగా చోటు చేసుకునే పరిణామాలే దీనికి ప్రధాన కారణం అవుతూ వచ్చాయి.
ఈ పరిస్థితుల్లో తమిళ కొత్త సంవత్సరానికి ఒక రోజు ముందుగా ఈనెల 13వ తేదీ విజయ్ నటించిన బీస్ట్ చిత్రం తెర మీదకు రానుంది. ఈ చిత్రం విడుదల వివాదాలకు తావ్వివకుండా దళపతి ముందు జాగ్రత్తల్లో పడ్డారు. ఏడాది తర్వాత తన చిత్రం విడుదల అవుతుండటంతో అభిమానుల దూకుడు, వివాదాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గురువారం విజయ్ మక్కల్ ఇయక్కం ప్రధాన కార్యదర్శి బుషి ఆనంద్ అభిమాన సంఘాల్ని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు.
చట్ట పరంగా చర్యలు..
రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న వారిని, అధికారుల్ని ... ఇలా ఎవ్వరినీ విమర్శించ వద్దని హెచ్చరించారు. మీడియాలో కానీ, సామాజిక మాధ్యమాల్లో గానీ.. ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. మీమ్స్ వంటి అవహేళన చేసే ధోరణుల్ని అనుసరించ వద్దు అని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై గతంలో కఠినంగా వ్యవహరించి, అభిమాన సంఘం నుంచి తొలగించినట్టు గుర్తు చేశారు. ఈసారి ఆజ్ఞలను అతిక్రమించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు సైతం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment