పల్లెటూరి కథలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఎక్కువగా సిటీ చుట్టూ తిరిగే కథలే చూస్తుంటారు కాబట్టి పల్లె కథలు వచ్చినప్పుడు ప్రేక్షకులు చూడాలని అనుకుంటారు. పైగా ఆ కథల్లో స్టార్ హీరోలు నటిస్తే క్రేజ్ రెండింతలు ఉంటుంది. అలా ‘పల్లె పిలిచింది’ అంటూ కొందరు హీరోలు రూరల్ స్టోరీలతో చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.
పల్లెటూరి ఆట
రామ్‌చరణ్ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమా అంటే ప్రేక్షకులకు ‘రంగస్థలం’ (2018) సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత మరో రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు రామ్‌చరణ్. కాగా తనకు ‘రంగస్థలం’ వంటి హిట్ ఫిల్మ్‌ను అందించిన సుకుమార్‌తో మరో సినిమాకు రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ‘రంగస్థలం’కు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది.
అలాగే ఇది వార్ డ్రామా మూవీ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌పై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబుతో రామ్‌చరణ్ హీరోగా చేయనున్న సినిమా మాత్రం పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాయే. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో అన్నదమ్ముల పాత్రలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఈ పల్లె కథలో జాన్వీ కపూర్ హీరోయిన్.
రాజు కథ
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 24 మంది మత్స్యకారులు 2018లో జీవనోపాధికి గుజరాత్ సముద్ర తీరానికి వెళ్లి, పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు బందీలుగా చిక్కుతారు. ఈ ఘటనలో ఉన్న ఓ మత్స్యకారుడి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘తండేల్’. ప్రధానంగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. రాజు పాత్ర కోసం నాగచైతన్య పూర్తిగా మేకోవర్ అయ్యారు. అలాగే శ్రీకాకుళం యాస కూడా నేర్చుకున్నారు. ‘తండేల్’ను డిసెంబరు 20న విడుదల చేయాలనుకుంటున్నారు.
దసరా కాంబో రిపీట్
‘దసరా’ వంటి రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు హీరో నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. హీరో నాని– దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో మళ్లీ ఓ సినిమా రానుంది. ఈ సినిమా కథాంశం కూడా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. అలాగే ‘బలగం’ దర్శకుడు వేణు ఎల్దండి గ్రామీణ నేపథ్యంలో నాని హీరోగా ఓ సినిమా చేయనున్నారట. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ్రపారంభం కానుందని సమాచారం.
మాస్ కుర్రాడు
సిల్వర్ స్క్రీన్‌పై విజయ్ దేవరకొండ ఎక్కువగా సిటీ అబ్బాయిలానే కనిపించారు. ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయిలో ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీలో హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నారు. ‘రాజావారు రాణిగారు’ వంటి పల్లె ప్రేమకథను తీసిన దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు ఈ నెల 9న... విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా వెల్లడి కానున్నాయి.
లంకల రత్న
విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. గోదావరి పరిసర ్రపాంతాల్లోని గ్రామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. చీకటి సామ్రాజ్యంలో లంకల రత్న అనే సాధారాణ వ్యక్తి అసాధారణ స్థాయికి ఎలా చేరుకుంటాడు? అన్నదే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కథ అని యూనిట్ పేర్కొంది. లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. అలాగే హీరోలు రక్షిత్ అట్లూరి ‘శశివదనే’, నార్నే నితిన్ ‘ఆయ్..’ సినిమాలు గోదావరి నేపథ్యంలో సాగే కథలే. ఇంకా గ్రామీణ నేపథ్యంలో పలు చిత్రాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment