మీకు వినాయకుడు అంటే ఇష్టమా.. ఐతే, ఈ సినిమాలు, సాంగ్స్‌ చూశారా? | Vinayaka Chavithi Best Movies And Songs | Sakshi
Sakshi News home page

మీకు వినాయకుడు అంటే ఇష్టమా.. ఐతే, ఈ సినిమాలు, సాంగ్స్‌ చూశారా?

Published Sat, Sep 7 2024 8:14 AM | Last Updated on Sat, Sep 7 2024 12:33 PM

Vinayaka Chavithi Best Movies And Songs

వినాయకుడు.. విఘ్నాధిపతి.. గణనాథుడు..  బొజ్జ గణపయ్య.. ఏకదంతుడు.. ఇలా ఏ పేరుతో స్వామిని కొలిచినా సకల విఘ్నాలు తొలగి జయం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి వినాయకుడికి తెలుగు సినిమాల్లోనూ ప్రత్యేక స్థానం ఉంది. విఘ్నేశ్వరుడి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చి, విజయాలు సాధించాయి. మరెన్నో చిత్రాల్లో స్వామిని కీర్తిస్తూ వచ్చిన సన్నివేశాలు, పాటలు కూడా ప్రేక్షకులను అలరించాయి. గణనాథుడి నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు, పాటలపై ఓ లుక్కేద్దాం..

వినాయక చవితి
వినాయక చవితి రోజున వినాయక వ్రత కథ చదువుకుని, పూజ చేసుకోవడం ఆనవాయితీ. ఈ కథ ఆధారంగా సముద్రాల రాఘవాచార్య దర్శకత్వం వహించిన చిత్రం ‘వినాయక చవితి’. ఎన్టీఆర్, జమున, కృష్ణకుమారి, గుమ్మడి, రాజనాల తదితరులు నటించారు. కె. గోపాలరావు నిర్మించిన ఈ సినిమా 1957 ఆగస్టు 22న విడుదలైంది. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే.. వినాయక చవితి నాడు శ్రీకృష్ణుడు పాలలో చంద్రుణ్ణి చూడటంవల్ల సత్రాజిత్తు సంపాదించిన శమంతకమణిని అపహరించాడన్న అపఖ్యాతి మూటగట్టుకుంటాడు. ఆ తర్వాత వినాయక వ్రతం ఆచరించి, నిర్దోషిగా తనను తాను నిరూపించుకుని బయటపడతాడు. అందరూ చవితి నాడు వినాయక వ్రతం ఆచరిస్తే, ఆ గజానుని ఆశీస్సులతో ఎలాంటి నీలాప నిందలపాలు కాకుండా ఉంటారనే కథతో ‘వినాయక చవితి’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం విడుదలై 65 ఏళ్లు అయింది.

భూ కైలాస్‌
పరమశివుని భక్తుడైన రావణాసురుడు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళ్తాడు. ఆత్మలింగం సాధించి, అమరత్వం పొందాలన్నది రావణాసురుడి కోరిక. ఆయన తపస్సును మెచ్చుకున్న శివుడు ఆత్మలింగం ఇస్తూ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని షరతు విధిస్తాడు. రావణాసురుడికి అమరత్వం వస్తే భూ మండలాన్ని సర్వనాశనం చేస్తాడని భావించిన నారదుడు ఆత్మలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని వినాయకుణ్ణి ప్రార్థిస్తాడు. రావణాసురుడు సంధ్యా వందనం చేసే సమయంలో శివుడి ఆత్మలింగం రావణుడి పాలు కాకుండా చేస్తాడు వినాయకుడు. చివరకు ఆత్మార్పణకు సిద్ధపడిన రావణాసురుణ్ణి కైలాసపతి కరుణించి, ఆ ప్రదేశం ‘భూకైలాసం’గా మారుతుందని చెప్పి అనుగ్రహించడంతో కథ ముగుస్తుంది. ఎన్టీఆర్‌ రావణునిగా, ఏఎన్నార్‌ నారదుడిగా నటించిన ‘భూ కైలాస్‌’ చిత్రకథ ఇది. కె. శంకర్‌ దర్శకత్వంలో ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ సినిమా 1958 మార్చి 20న రిలీజైంది.

శ్రీ వినాయక విజయం
వినాయకుడి జీవిత చరిత్రపై తెలుగులో పూర్తి స్థాయిలో వచ్చిన చిత్రం ‘శ్రీ వినాయక విజయం’. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణంరాజు, వాణిశ్రీ శివపార్వతులుగా నటించారు. శివదీక్షా వ్రతాన్ని ఆచరించడానికి పూనుకుని స్నానమాచరించబోతూ పిండితో ఒక బాలుని బొమ్మ తయారు చేసి, దానికి ప్రాణం పోసి, కాపలాగా ఉంచుతుంది పార్వతీదేవి. అప్పుడు వచ్చిన శివుణ్ణి లోనికి అనుమతించడు ఆ బాలుడు. ఆగ్రహించి బాలుని శిరస్సు ఖండిస్తాడు శివుడు. దీంతో పార్వతి తన బిడ్డను ఎలాగైనా బతికించమని శివుణ్ణి కోరుతుంది. ఆ బాలునికి ఏనుగు తలను అమర్చి ప్రాణం పోస్తాడు శివుడు. ఆ బాలుడు మూషికాసురున్ని సంహరించిన తీరు, మూషికాసురుని జన్మ వృత్తాంతం వంటి ఎన్నో  విషయాలను ఈ సినిమాలో చూపించారు. 1979 డిసెంబరు 22న ఈ చిత్రం విడుదలైంది.

జై జై గణేశా...
తెలుగు సినిమాల్లో గణనాథుణ్ణి కీర్తిస్తూ ఎన్నో పాటలు వచ్చాయి. ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగా తెరకెక్కిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ‘దేవుడు చేసిన మనుషుల్లారా..’ అనే పాట వినాయక నిమజ్జనం నేపథ్యంలో సాగుతుంది. వెంకటేష్‌ నటించిన ‘కూలీ నెంబర్‌ 1’ సినిమాలోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా..’ పాట ఇప్పటికీ ప్రతి వినాయక మండపంలో వినిపిస్తూ ఉంటుంది.

చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘జై చిరంజీవ’ సినిమాలో ‘జై జై గణేశా.. జై కొడత గణేశా..’ పాట సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ ‘డిక్టేటర్‌’ మూవీలోని ‘గం గం గణేశా..’ అనే పాట కూడా ఆకట్టుకుంది. ‘దేవుళ్లు’ సినిమాలోని ‘జయ జయ శుభకర వినాయక..’ పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడారు. మహేశ్‌బాబు ‘పోకిరి’ సినిమాలోని జగడమే పాటలో ‘గణపతి బప్పా మోరియా..’ అంటూ వచ్చే బిట్‌ సూపర్‌గా ఉంటుంది. రామ్‌ ‘గణేష్‌’ మూవీలో వినాయకుడిపై ఒక పాట ఉంది.  ‘దేవదాస్‌’ సినిమాలో నాగార్జున, నాని వినాయకుణ్ణి కీర్తిస్తూ పాడే పాట పాపులర్‌ అయింది. నాని ‘భలే భలే మగాడివోయ్‌’, రవితేజ ‘పవర్‌’ సినిమాల్లో వినాయక చవితి ప్రస్తావన ఉంది. ఇవే కాదు.. మరికొన్ని సినిమాల్లోనూ గణేశుణ్ణి కీర్తిస్తూ పాటలున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement