కరాటే రాజు, జుజి, విశ్వక్ సేన్
‘‘నటన, దర్శకత్వం నాకు రెండు కళ్లు. హీరోగా సక్సెస్ అయి, ఆ తర్వాత ఓ 30 ఏళ్లకు డైరెక్షన్ చేయాలనుకున్నాను. కానీ సరైన అవకాశాలు దొరక్క నా తొలి సినిమా ‘ఫలక్‌నుమా దాస్’కి నా బ్యానర్‌లో నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది. దర్శకుడిగా నాకు పూర్తి సంతృప్తి దక్కలేదు. ఎందుకంటే ఇది రీమేక్ చిత్రం. ప్రస్తుతం నేను చేస్తున్న దాస్‌కా ‘దమ్కీ’ చిత్రం నాలోని దర్శకత్వ ప్రతిభను చూపిస్తుందనే నమ్ముతున్నాను’’ అని విశ్వక్ సేన్ అన్నారు.
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దమ్కీ’. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్. వన్మయీ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. ఇంకా ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
శుక్రవారం జరిగిన ఈ సినిమా విలేకరుల సమావేశంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హోటల్‌లో వర్క్ చేసే కృష్ణదాస్ అనే పాత్రలో కనిపిస్తాను. యాక్షన్ కొత్తగా ఉంటుంది. బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్–జుజితో అద్భుతమైన క్లయిమాక్స్ సీన్స్‌ను ప్లాన్ చేశాం. ఈ కథలో కలర్స్ మారుతుంటాయి. ఆడియన్స్ నవ్వుతుంటారు.. అలాగే చెమటలు పడతాయి. కథలో అంత బలం ఉంది. అవుట్‌పుట్‌పై నమ్మకం ఉంది. అందుకే ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నాం. రిలీజ్ తర్వాత పాన్ ఇండియా సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నవరసాలు ఉంటాయి’’ అన్నారు కరాటే రాజు.
Comments
Please login to add a commentAdd a comment