ముంబై: నటి అమృతా రావు- ఆర్జే అన్‌మోల్ దంపతులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. తమ ఇంటికి బుజ్జి పాపాయిని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వీళ్లిద్దరికీ సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా తాము తల్లిదండ్రులం కాబోతున్న సంగతిని వీరు అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇటీవల చెకప్ నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ఈ జంట ఫొటోగ్రాఫర్ల కెమెరా కంటికి చిక్కింది. ఈ క్రమంలో బేబీ బంప్‌తో ఉన్న అమృత, భర్తతో కలిసి హాస్పిటల్ బయట నిల్చుని ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా వివాహ్, ఇష్క్‌విష్క్, మై హూనా వంటి బాలీవుడ్ సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అమృతా రావు, సూపర్ స్టార్ మహేష్‌బాబు అతిథి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి తెలిసిందే.(చదవండి: తల్లి కాబోతున్న నటి అనిత)
ఇక మరాఠా నాయకుడు బాల్ ఠాక్రే జీవితం ఆధారంగా గతేడాది తెరకెక్కిన ఠాక్రే సినిమాలో ఆమె చివరిసారిగా నటించారు. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య మీనా పాత్రలో జీవించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై ఓ ప్రముఖ ఛానెల్‌లో జమ్మీన్ అనే మ్యూజిక్ షోను హోస్ట్ చేస్తున్నారు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే, అమృతారావు, ఆర్జే అన్‌మోల్ ఏడేళ్ల పాటు ప్రేమించుకుని, 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. కాగా హంగూ, ఆర్భాటాలకు అమృత పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదని, అందుకే తన పెళ్లి గురించి గానీ, తల్లి కాబోతున్న విషయం గురించి గానీ సన్నిహితులకు తప్ప మరెవరికీ చెప్పలేదని ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు జాతీయ మీడియాతో చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment