రెండు రోజుల క్రితమే బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు సతీశ్ కౌశిక్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతిపై రోజు రోజుకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆయన మరణంపై సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త కౌశిక్‌ను హత్య చేశారని తాజాగా ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా మహిళ వ్యాఖ్యలతో ఈ కేసు మరిన్నీ మలుపులు తిరగనుంది. కాగా.. హోలీ వేడుకల్లో సతీష్ కౌశిక్ గుండెపోటుకు గురయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
నా భర్తే చంపేశారు: మహిళ
ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చింది ఆ మహిళ. అయితే ఆ మహిళ ఓ బిజినెస్ మ్యాన్ భార్య. తన భర్తకు సతీశ్ కౌశిక్ రూ.15 కోట్లు ఇచ్చారని ఫిర్యాదులో తెలిపింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకే ప్లాన్ చేసి చంపేశారంటూ మహిళ ఆరోపిస్తోంది. సతీష్ కౌశిక్‌ను చంపేందుకు తన భర్త కొన్ని ట్యాబ్లెట్స్ ఏర్పాటు చేశారని కూడా తెలిపింది. ఇప్పటికే సతీష్ కౌశిక్ మరణించిన ఫామ్ హౌజ్‌లో పోలీసులకు నిషేధ ఉత్ప్రేరక డ్రగ్స్ లభ్యమైన సంగతి తెలిసిందే. కాగా.. సతీష్ కౌశిక్ అదే వ్యాపారవేత్త ఫామ్‌హౌస్‌లో హోలీ పార్టీకి హాజరైన తర్వాతే మరణించాడు.
ఫామ్‌హౌస్‌లో హోలీ పార్టీకి వచ్చిన అతిథుల జాబితాను కూడా పోలీసులు సిద్ధం చేశారు. మొత్తం 10 నుంచి 12 మంది పార్టీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ సతీష్ కౌశిక్ స్నేహితుడు వికాస్ మాలూది కాగా.. అక్కడ లభ్యమైన ఔషధాలు ఎవరికోసం, ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా మహిళ ఫిర్యాదుతో సతీష్ కౌశిక్ మరణంపై అనుమానాలను మరింత పెరుగుతున్నాయి.
అలాంటిదేం లేదు: సతీశ్ కౌశిక్ భార్య
ఈ ఆరోపణలపై సతీష్ కౌశిక్ భార్య శశి కౌశిక్ స్పందించింది. తన భర్త హోలీ పార్టీకి హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చారని.. కానీ ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. వ్యాపారవేత్తను సమర్థిస్తూ సతీష్ కౌశిక్ మంచి స్నేహితులని అన్నారు. వ్యాపారవేత్త ధనవంతుడని..తన భర్త నుంచి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొంది. ఆయన శాంపిల్స్‌లో మందులు లేవని పోస్ట్‌మార్టం నివేదిక నిర్ధారించిందని శశి కౌశిక్ తెలిపారు.
మహిళను ఉద్దేశి శశి న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ తన భర్తను హత్య చేసినట్లు ఎందుకు చెబుతుందో నాకర్థం కావడం లేదని తెలిపింది.నా భర్త చనిపోయిన తర్వాత ఆమె పరువు తీయడానికి ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదు. ఆమెకు తన భర్త నుంచి డబ్బు రాబట్టడం కోసం సతీష్ కౌశిక్‌ను లాగుతోందని శశి ఆరోపిస్తున్నారు.
కాగా.. సతీష్ కౌశిక్ హరియాణాలోని మహేంద్రఘడ్‌లో 1956లో జన్మించారు. 1983లో వచ్చిన 'మాసూమ్'తో నటుడుగా కెరీర్ ప్రారంభించిన ఆయన అనుపమ్ ఖేర్‌తో కలిసి పలు సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా మారారు. సుమారు 15 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన తీసిన చివరి సినిమా 'కాగజ్'.
Comments
Please login to add a commentAdd a comment