
సీఎం సమావేశంలో కలెక్టర్ దివాకర
హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కలెక్టర్లతో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ములుగు కలెక్టర్ టీఎస్.దివాకర పాల్గొన్నారు. ఈ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అడవికి నిప్పు పెట్టొద్దు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: తునికాకు సేకరణకు కొమ్మకొట్టే సమయంలో అడవికి నిప్పు పెట్టొద్దని కాంట్రాక్టర్లు పలు గ్రామాల్లో సోమవారం కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని కాటాపూర్ ఏ యూనిట్ పరిధి తునికాకు కాంట్రాక్టర్ ఖలీద్ అహ్మద్ ఆధ్వర్యంలో నాంపెల్లి, నర్సింహులపేట, గంగారం ఎస్టీ కాలనీ, అన్నారం, నర్సాపూర్, భూపతిపూర్, కాటాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అడవికి నిప్పు పెడితే కలిగే నష్టాలను కూలీలకు వివరించారు. అలాగే లవ్వాల యూనిట్ పరిధిలోని లవ్వాల, జలగలంచ గ్రామాల్లో కాంట్రాక్టర్ అయేషా సుల్తాన్ అడవులకు నిప్పు పెట్టకూడదని ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో అవగాహన కోసం ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు.
మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు
వాజేడు/ఏటూరునాగారం: వాజేడు, ఏటూరునాగారం మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం పేరుతో సోమవారం వాల్‌పోస్టర్లు వెలిశాయి. ‘మమ్మల్ని బతక నివ్వండి, నిత్యం ఆదివాసీ ప్రజలపై ఆధారపడి బతికే మీరు అడవుల్లో విచ్చల విడిగా బాంబులు పెట్టడం సరికాదు.. ఆదివాసీలను చంపడం మీ సిద్ధాంతమా’ అంటూ ఆదివాసీ యువజన సంఘం పేరుతో పలు రకాల విమర్శలు, హెచ్చరికలతో వాల్‌పోస్టర్లలో రాసి ఉంది.
ప్రమాదకరంగా సూచిక బోర్డు
వాజేడు: జాతీయ రహదారిపై సూచిక బోర్డు ప్రమాదం పొంచి ఉంది. మండల పరిధిలోని బీరమయ్య గుట్టపైకి వెళ్లే దారిలోని మూడో మలుపు వద్ద కుడి చేతి వైపున ఉన్న సూచిక బోర్డు దారికి అడ్డంగా వంగి ఉంది. వాహన దారులు చూడకుండా వస్తే తాకేలా ఉంది.
రామప్పలో మెక్సికో దేశస్తుడు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మెక్సికోకు చెందిన ప్రొఫెసర్ డేనియల్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరుడిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్‌లు తాడబోయిన వెంకటేశ్, సాయినాథ్ వివరించగా రామప్ప టెంపుల్ బాగుందని కొనియాడారు.
గుడుంబా విక్రయిస్తే చర్యలు
ములుగు: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే గుడుంబా (నాటుసారా) తయారు చేసినా.. విక్రయించినా శాఖా పరమైన చర్యలు తప్పవని ఎస్పీ శబరీశ్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు నాటుసారా విక్రయించిన వారిపై 184 కేసులు నమోదు చేసి 3,023 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 216మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 62 కేసులు నమోదు చేసి 1,426 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 62 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా గ్రామాల్లో నాటుసారా తయారు చేసినా, విక్రయించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

సీఎం సమావేశంలో కలెక్టర్ దివాకర

సీఎం సమావేశంలో కలెక్టర్ దివాకర

సీఎం సమావేశంలో కలెక్టర్ దివాకర