ఎస్సీ వర్గీకరణ కోసం ధర్మ పోరాటం | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ కోసం ధర్మ పోరాటం

Published Fri, Jan 31 2025 12:56 AM | Last Updated on Fri, Jan 31 2025 12:56 AM

ఎస్సీ వర్గీకరణ కోసం ధర్మ పోరాటం

ఎస్సీ వర్గీకరణ కోసం ధర్మ పోరాటం

నాగర్‌కర్నూల్‌రూరల్‌: ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటం ధర్మబద్ధమైనదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘లక్ష డప్పులు – వేల గొంతుకలు’ కార్యక్రమ సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవాలని చూస్తున్న వారిని మనసులో పెట్టుకుంటామని.. వారికి రాజకీయ భవిష్యత్‌ లేకుండా చేస్తామని హెచ్చరించారు. షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ జరిగితే 59 కులాలు బాగుంటాయని అందరూ సానుకూలంగా మద్దతు ఇస్తుండగా.. మాలలు మాత్రమే అనుకూలంగా లేరన్నారు. 1998లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకూలంగా వ్యవహరించారని.. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో పెడితే ఎమ్మెల్యేలు అంగీకారం చెప్పారన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వాలు వేసిన మూడు కమిషన్లు కూడా అనుకూలంగా నివేదికలు ఇచ్చాయన్నారు. 1999లో రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా మద్దతు తెలిపిన అంశాన్ని గుర్తుచేశారు. సుప్రీం కోర్టులోనూ అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు. ఆ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేపడతామని మాట ఇచ్చి వెనక్కి తగ్గడమేమిటని ప్రశ్నించారు. ఆయన వెనక్కి తగ్గడంతోనే తాము మళ్లీ రోడ్డెక్కామన్నారు. ఇప్పటికై నా ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 7న నిర్వహించే ‘లక్ష డప్పులు – వేల గొంతుకలు’ కార్యక్రమానికి మాదిగలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు జెట్టి ధర్మరాజు, వంకేశ్వరం నిరంజన్‌, మంగి విజయ్‌, విజయ్‌, రవి, జంగయ్య, విజయ్‌, కోళ్ల శివ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు

మందకృష్ణ మాదిగ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement