డిండి: సఖ్యతకు అడ్డొస్తున్నాడని భార్య ప్రియుడితో పాటు మరో వ్యక్తితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం దేవరకొండలోని సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ సురేష్ వెల్లడించారు. మండల పరిధిలోని దేవత్‌పల్లితండాకు చెందిన రమావత్ కుమార్(27)కు చందంపేట మండలంలోని పోల్యానాయక్‌తండాకు చెందిన లక్ష్మితో 10పంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
భార్యభర్తలు వ్యవసాయంతో పాటు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి కుమారుడు, కూతురు ఉన్నారు. కుమార్‌కు వ్యవసాయంలో కలిసి రాక పూటగడవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కుమార్ భార్య పిల్లలతో కలిసి రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి కూలీ చేసుకుంటున్నారు. కూలీ పని చేస్తున్న క్రమంలో లక్ష్మీకి మధు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. కాగా 5నెలల క్రితం కుమార్ హైదరాబాద్‌లో ఉండలేక భార్య పిల్లలతో కలిసి స్వగ్రామానికి తిరిగొచ్చి వ్యవసాయం చేస్తున్నాడు.
ప్రియుడిని విడిచి ఉండలేక..
స్వగ్రామానికి భర్తతో లక్ష్మి రావడంతో మధు ఇటీవల కొన్ని రోజులుగా లక్ష్మి భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి వెళ్తుడేవాడు. వారు ఎడబాటు తట్టుకోలేక వారు కుమార్‌ను అడ్డుతొలగించుకుంటే కలిసి జీవించొచ్చని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కుమార్‌ను హత్య చేసేందుకు భార్య ప్రియుడు మధుతో పాటు హైదరాబాద్‌లోని మెహిదీపట్నంకు చెందిన సాయికిరణ్‌ను ఈనెల 23న గ్రామానికి పిలిపించింది. రోజు మాదిరిగానే కుమార్ తన భార్యతో కలిసి ఈనెల 24న రాత్రి వేరుశెనగ చేనుకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. అర్థరాత్రి తర్వాత మంచంపై పడుకున్న కుమార్‌ను అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న మధు, సాయికిరణతో పాటు లక్ష్మి కర్రలతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేశారు.
అనంతరం అక్కడే ఉన్న వేపచెట్టుకు చీరతో ఉరి వేసుకున్నట్లు మృతదేహాన్ని వేలాడదీసి మధు, సాయికిరణ్ అక్కడి నుంచి పారిపోయారు. లక్ష్మి మాత్రం తెల్లవారుజాము వరకు పొలం వద్దే ఉండి ఉదయం తండాకు వచ్చి తాను నిద్రిస్తున్న సమయంలో తన భర్త కుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువుల వద్ద నమ్మబలికింది. వెంటనే మృతుడి తల్లి, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని కుమార్ మృతదేహాన్ని ఇంటికి తీసుకవచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుమార్ హత్య విషయం తెలుసుకున్న సీఐ సురేష్, ఎస్‌ఐ రాజు సిబ్బందితో గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు.
కుమార్ ఒంటిపై గాయాలు ఉండడంతో మృతుడి తల్లి సుకి కోడలు లక్ష్మిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో కుమార్ హత్యకు గురయ్యాడని కేసు నమోదు చేసుకొని పోలీసులు ఽఽవిచారణ చేపట్టారు. విచారణలో భాగంగా మృతుడి భార్య లక్ష్మి తనతో పాటు మధు, సాయికిరణ్‌లో కలిసి కుమార్‌ను హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ ఘటనలో నిందితులైన ముగ్గురిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సురేష్ తెలిపారు. హత్య కేసును రెండు రోజులో చేంధించిన డిండి రూరల్ సీఐ సురేష్, ఎస్‌ఐ రాజు, సిబ్బందిని ఎస్పీ శరత్‌చంద్ర పవార్, దేవరకొండ డీఎస్పీ గిరిబాబు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment