వైద్యానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత
కనగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం కనగల్ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి మీడియాతో మంత్రి మాట్లాడారు. కనగల్ పీహెచ్‌సీలో కంటి పరీక్షలు చేసే గ్లూకోమా సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన వారికి గడచిన 15 నెలల్లోనే రూ.1600 కోట్ల ఎల్‌ఓసీలను అందించామని, పేద ప్రజలు వైద్యం కోసం వస్తే 24 గంటలు ఎల్‌ఓసీలను అందజేస్తున్నామని అన్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రులకు ఎల్‌ఓసీ ఇచ్చే బదులుగా ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అన్నిరకాల సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. హైదరాబాదులో 4 టిమ్స్ హాస్పిటళ్లను ఆర్‌అండ్‌బీ ద్వారా నిర్మిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.2600 కోట్లతో హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, పాత భవనం అలాగే కొనసాగుతుందని తెలిపారు. వచ్చేవారం దేవరకొండ నియోజకవర్గంలో గ్లూకోమా కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. నల్లగొండ ఆస్పత్రిలో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను ఈ నెలాఖరుకు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇతర ప్రాంతాలలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న 59 మంది డాక్టర్లను వెనక్కి పిలిపిస్తున్నామన్నారు. పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారానే వైద్య సేవలు అందిస్తామన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. పైలెట్ పద్ధతిన కనగల్ పీహెచ్‌సీలో గ్లూకోమా సెంటర్‌ను ప్రారంభించామని తెలిపారు. కనగల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ గ్లూకోమా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక మోడల్ పీహెచ్‌సీని తీర్చిదిద్దుతామని తెలిపారు. తన ప్రసవం కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగిందని ఆమె పేర్కొన్నారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment