
ప్రతీ గురువారం ప్రత్యేక ప్రజావాణి
నల్లగొండ : వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను తెలపడానికి ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు నల్లగొండ కలెక్టరేట్‌లో ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు వారి సమస్యలను గురువారం నిర్వహించే ప్రజావాణిలో తమను కలిసి తెలియజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఫలితాలు విడుదల
నల్లగొండ : 2025 జనవరిలో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెమోలు www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసుకుని మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
331 మంది గైర్హాజరు
నల్లగొండ : ఇంటర్‌మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంగ్లిష్ పేపర్–2కు సంబంధించి మొత్తం 13,136 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 12,805 మంది హాజరయ్యారు. 331 మంది గైర్హాజరయ్యారు.
మూడు లిఫ్టులకు పరిపాలన ఆమోదం
నల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలో మూడు లిఫుల నిర్మాణానికి రూ.44 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోదం లభించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రాహుల్ బొజ్జా సోమవారం ఉత్వర్వులు జారీ చేశారు. నల్లగొండ నియోజకవర్గంలోని పొనుగోడు, బక్కతాయికుంట, నర్సింగ్‌బట్ల లిఫ్టుల నిర్మాణం చేపట్టనున్నారు.
వైద్య విద్యార్థులకు సామాజిక దృక్పథం
బీబీనగర్: వైద్య వృత్తి చాలా ప్రధానమైనదని, వైద్య విద్యార్థులు సామాజిక దృక్పథంతో ఉంటూ రోగల పట్ల ప్రేమను కలిగి ఉండాలని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్, పద్మభూషన్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిమ్స్‌లోని విద్యార్థులకు చాలా చక్కటి భవిష్యత్త్ ఉందన్నారు. వరల్డ్‌లోనే బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాల బెస్ట్‌గా నిలుస్తుందన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయన్నారు. ఐదేళ్లలోనే అబ్బురపరిచే విధంగా భవనాల నిర్మాణాలు జరగడం సంతోషదాయకమని అన్నారు. రోగులతో సాన్నిహిత్యం కలిగి ఉండాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ బాటియా మాట్లాడుతూ.. ఎయిమ్స్‌లోని ఔట్‌పేషెంట్ విభాగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11లక్షల మంది వైద్య సేవలు పొందారని, 34రకాల వైద్య విభాగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం ఎయిమ్స్ పురోగతిపై ముద్రించిన మ్యాగ్జిన్‌ను డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించడంతో పాటు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జలలీమ్, రాహుల్‌నారంగ్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ దరఖాస్తులను సమర్పించాలి
నల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో 2020–2021 నుంచి 2023–2024 విద్యా సంవత్సరం బీసీ, ఈబీసీ ఉపకార వేతనాలు, పీజు రీయింబర్‌మెంట్ మంజూరు కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నాజిమ్ అలీ అప్సర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్ దరఖాస్తులు అందజేయకపోతే.. ఉపకార వేతనాల మంజూరు విషయంలో సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇంకా దరఖాస్తు చేయని బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ నెల 31లోగా ఈపాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment