
ఆరున్నరేళ్లకు.. అంతిమ తీర్పు
పకడ్బందీగా దర్యాప్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రణయ్ హత్య కేసును పోలీసు యంత్రాంగం పకడ్బందీగా దర్యాప్తు చేసింది. కేసు విచారణ, పక్కాగా సాక్ష్యాల సేకరణ, వాటి అథెంటికేషన్ విషయంలో అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు బృందాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాయి. తమిళనాడులో శంకరన్ హత్య కేసు తరహాలో ప్రణయ్ హత్య కేసు విచారణ జరిగింది. తమిళనాడులో కులాంతర వివాహం చేసుకున్న శంకరన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. అక్కడ ఆయన హత్యకు గురయ్యాడు. ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తమిళనాడు పోలీసులు నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కాగా విచారణ జరిపారు. అందుకే ప్రణయ్ హత్య తరువాత అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు అధికారుల బృందం అక్కడికి వెళ్లి ఆ కేసును కూడా పరిశీలించింది. ప్రణయ్ హత్య కేసులోనూ నిందితులు తప్పించుకోకుండా, సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా, సాంకేతిక పద్ధతుల్లో వాటిని భద్రపరిచారు. ముఖ్యంగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, బ్లడ్ శాంపిల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్ష చేయించారు. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రణయ్ హత్యకు ముందు నిందితులు ఏయే ప్రాంతాల్లో సంచరించారు.. ఎవరెవరు కలుసుకొని ప్లాన్ చేశారు.. అనే వివరాలు సేకరించి అన్ని ఆధారాలను కోర్టులో సమర్పించారు. ఈ కేసులో ఎలాంటి అవకతవకలకు, అనుమానాలకు తావులేకుండా నేరం రుజువయ్యేలా సేకరించిన అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. తద్వారానే సుభాష్ కుమార్ శర్మకు అప్పట్లో బెయిల్ రాలేదు. కేసు విచారణ తుది తీర్పులో సుభాష్ శర్మకు ఉరి శిక్ష, మిగిలిన వాళ్లకు జీవిత ఖైదు పడిందని, తద్వారా బాధితులకు సత్వర న్యాయం జరిగిందని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు.
ప్రణయ్ హత్య కేసులో 1600 పేజీల్లో చార్జిషీట్
ఫ కేసులో ప్రధాన పాత్రధారి అబ్దుల్‌బారి ఫ కరుడుగట్టిన నేరస్తుడు అజ్గర్ అలీ
ఫ ఏ2 సుభాష్‌కుమార్ శర్మకు ఉరి.. మిగతా ఆరుగురికి జీవిత ఖైదు
రామగిరి(నల్లగొండ) : మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ హత్య కేసులో ఆరున్నరేళ్లకు అంతిమ తీర్పు వచ్చింది. ఈ కేసులో మొత్తం 8 మందిని నిందితులుగా చేర్చుతూ పోలీసులు కోర్టులో చార్జిషీటు సమర్పించారు. ఈ కేసులో ఏ1 తిరునగరు మారుతిరావు, ఏ2 సుభాష్‌కుమార్‌శర్మ, ఏ3 మహ్మద్ అజ్గర్‌అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్‌బారి, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ.నిజాం నిందితులుగా ఉన్నారు. అందులో ఏ3 మహ్మద్ అజ్గర్‌అలీకి కరడుగట్టిన నేరచరిత్ర ఉంది. ఈ హత్యలో అజ్గర్‌అలీ, సుభాష్‌కుమార్ శర్మకు ఇద్దరికి పరిచయం ఉన్న వ్యక్తి అబ్దుల్‌బారీ. అబ్దుల్ బారీనే కరడుగట్టిన నేరస్తుడు అజ్గర్ అలీని రంగంలోకి దింపాడు. గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో అజ్గర్ అలీ నిందితుడు. వీరిలో ఏ1 మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా.. ఏ2 సుభాష్‌కుమార్ శర్మకు కోర్లు ఉరిశిక్ష.. మిగతా ఆరుగురు నిందితులకు జీవితఖైదు విధించింది.
102 మంది సాక్షుల విచారణ
ఈ కేసులో మొత్తం చార్జిషీట్‌ను 1600 పేజీల్లో రూపొందించి నల్లగొండ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో సమర్పించారు. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుల ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ఏ స్థాయిలో ఉంది.. ఎవరెవరు ఏ విధంగా సహకరించారనే అంశాలను 63 పేజీల్లో పొందుపర్చారు. బిహార్‌కు చెందిన కిల్లర్ సుభాష్‌కుమార్‌శర్మతో డీల్ కుదిర్చింది ఎవరు..? అతడిని మిర్యాలగూడకు రప్పించి వసతులు సమకూర్చింది ఎవరు..? సుపారీలో ఎవరి వాటా ఎంత..? అతనికి ఏ విధంగా సహకరించారు..? హత్య అనంతరం సుపారీ కిల్లర్ ఎలా పారిపోయాడు..? ఎవరు సహకరించారు..? అనే కోణంలో విచారణ సాగింది. ప్రణయ్ హత్యను ప్రత్యక్ష, పరోక్షంగా చూసిన 102మంది సాక్షులను పోలీసులు విచారించి వారి వాంగ్మూలాన్ని చార్జిషీట్‌లో రికార్డు చేశారు. దీంతో పాటు ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టుల ఆధారంగా సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను సమకూర్చారు.
ఇదీ దోషుల పాత్ర..
మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్, అమృతవర్షిణికి 2018 జనవరి30 న ప్రేమ వివాహం జరిగింది. ఈ వివాహాన్ని అమృతవర్షిణి తండ్రి ఏ1 మారుతీరావు జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా ప్రణయ్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ప్రణయ్‌ని చంపాలన్న విషయాన్ని తన మిత్రుడు, మిర్యాలగూడ మున్సిపల్ వార్డు కౌన్సిలర్, ఏ5 అయిన అబ్దుల్ కరీంకు చెప్పాడు. వారు ఇద్దరు చర్చించుకొని ఏ4 మహ్మద్ అబ్దుల్‌బారీని మారుతీరావుకు పరిచయం చేశాడు. ప్రణయ్‌ను హత్య చేసేందుకు మారుతీరావుకు మహ్మద్ అబ్దుల్‌బారి మధ్య రూ.కోటి సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్‌గా రూ.15 లక్షలు ఏ5 మహ్మద్ కరీం, మారుతీరావు కారు డ్రైవర్ ఏ7 సముద్రాల శివ ద్వారా అబ్దుల్ బారికి అప్పజెప్పాడు. డబ్బులు తీసుకున్న తర్వాత అబ్దుల్ బారి.. ప్రణయ్‌ను హత్య చేయాలని ఏ3 అజ్గర్‌అలీకి, అంతకు ముందు రాజమండ్రి జైల్‌లో పరిచయం ఉన్న ఏ2 శుభాష్‌కుమార్‌శర్మకు చెప్పాడు. వీరికి ఆటోడ్రైవర్ అయిన ఏ8 ఎంఏ.నిజాం సహకరించాడు. ముగ్గురూ కలిసి ప్రణయ్‌ను హత్య చేసేందుకు పలుమార్లు రెక్కీ నిర్వహించారు. 2018, సెప్టెంబర్ 14 న మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రిలో చెకప్ కోసం ప్రణయ్, అమృతవర్షిణి, ప్రణయ్ తల్లి ప్రేమలత వెళ్లారు. ఇంటి వద్ద నుంచే ప్రణయ్ ప్రయాణించే కారును వారు అనుసరించారు. వారికంటే ముందుగానే సుభాష్‌కుమార్‌శర్మ, అజ్గర్ అలీ టూ వీలర్‌పై, ఆటో డ్రైవర్ ఎంఏ.నిజాం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రిలో చూపించుకుని ప్రణయ్, అమృత, ప్రేమలత తిరిగి వస్తున్న క్రమంలో సుభాష్‌కుమార్‌శర్మ కత్తితో ప్రణయ్‌పై దాడి చేశాడు. హత్య చేసిన తర్వాత సుభాష్‌కుమార్‌శర్మ, అజ్గర్‌అలీ, ఏంఏ నిజాం పారిపోయారు. ఆ తర్వాత ఏ1 మారుతీరావు, ఏ6 తిరునగరు శ్రవణ్‌కుమార్‌కు.. ఏ7 సముద్రాల శివ సూర్యాపేటలోని బావ ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ఈ హత్యలో ఏ6 శ్రవణ్‌కుమార్ నగదు సమకూర్చాడు. ప్రత్యక్షంగా హత్యకు పాల్పడిన ఏ2 శుభాష్‌కుమార్‌శర్మకు మరణశిక్ష విధించగా, మిగిలిన ఆరుగురికి జీవితఖైదు పడింది.

ఆరున్నరేళ్లకు.. అంతిమ తీర్పు

ఆరున్నరేళ్లకు.. అంతిమ తీర్పు

ఆరున్నరేళ్లకు.. అంతిమ తీర్పు
Comments
Please login to add a commentAdd a comment