మలి సంధ్యలో మనోవేదన! | - | Sakshi
Sakshi News home page

మలి సంధ్యలో మనోవేదన!

Published Fri, Mar 7 2025 9:32 AM | Last Updated on Fri, Mar 7 2025 9:28 AM

మలి స

మలి సంధ్యలో మనోవేదన!

కడుపున పుట్టిన వారి మనస్సు కఠినమైన వేళ..

ఆదరణకు నోచుకోక తల్లడిల్లుతున్న వృద్ధులు

జీవిత చరమాంకంలో దుర్భర జీవితం

ఆదుకోవాలంటూ అధికారులకు విన్నపాలు

అండగా నిలుస్తున్న అధికార యంత్రాంగం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఇలా అనేక మంది వృద్ధులు తమ జీవితమంతా పిల్లల కోసమే ధారబోశారు.. వారి కడుపు నింపేందుకు తమ కడుపు మాడ్చుకున్నారు. అన్నీ ఒడిదొడుకులు దాటుకొని జీవిత చరమాంకానికి చేరుకున్నారు. కళ్లల్లో పెట్టి చూసుకుంటారనుకున్న కుటుంబ సభ్యులు కాదుపొమ్మంటుండటంతో తల్లడిల్లిపోతున్నారు. పిల్లల ను ప్రయోజకులను చేయాలని రాత్రనక, పగలనక అహర్నిశలు కష్టపడి, పైసకు పది ముడులేసి పిల్లలను పెంచి పెద్ద చేస్తే, ఎదిగిన ఆ బిడ్డలు ఆస్తులను లాగేసుకొని రోడ్డున పడేస్తున్నారు. వారి సంరక్షణను పట్టించుకోవడం లేదు. దాంతో కొందరు రోడ్డుపై గుళ్లు, గోపురాల వద్ద బిక్షాటన చేస్తూ జీవిస్తుండగా కొందరు వృద్ధాశ్రమాల్లో చేరాల్సి వస్తోంది. మరికొందరైతే ఆస్తులు బలవంతంగా రాయించుకుని ఆ తరువాత ఇబ్బందులకు గురి చేస్తుండటంతో ఆ వృద్ధులు అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఆదుకోవాలంటూ ఆవేదన చెందుతున్నారు.

ఆదుకునేందుకు

నడుంబిగించిన యంత్రాంగం

అలాంటి తల్లిదండ్రులను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రులు, వయో వృద్దుల పోషణ, సంక్షేమ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌ అధికారి కార్యాలయంలో ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేశారు. వాటికి చైర్మన్లుగా ఆర్డీవోలు ఉండగా, జిల్లా స్థాయిలో చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌ వ్యవహరిస్తున్నారు. బాధితులైన అలాంటి తల్లిదండ్రులు,వృద్ధులకు దీని ద్వారా రక్షణ, మెయిన్‌టెయిన్స్‌ ఇప్పించే చర్యలు చేపడుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు. దీంతో వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మా భూమి

మాకు కావాలని ఫిర్యాదు

జిల్లాలో 189 మంది వృద్ధులు.. తమ భూమిని తమ పిల్లల పేరున పట్టా చేశామని, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. తమ భూమి తమకు ఇప్పించాలని కలెక్టర్‌కు విన్నవించుకుంటున్నారు. ఇలాంటి కేసులు గత ఏడాది 189 నమోదు కాగా, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆయా కేసులను పరిశీలించి 23 మంది వృద్ధులకు వయో వృద్ధుల రక్షణ చట్టం–2007 కింద తిరిగి వారి పేరున పట్టా చేయించడం జరిగింది.

తల్లిదండ్రులను సంపాదించే

వస్తువుగా చూస్తున్నారు

తల్లిదండ్రులను ప్రస్తుతం కొందరు పిల్లలు సంపాదించే వస్తువుగా చూస్తున్నారు. వారి ఆస్తులను తీసుకుంటున్నారు కానీ వారిని పట్టించుకోవడం లేదు. చివరి దశలో వారికి కన్నీరే మిగిల్చుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మొదట నుంచి సామాజిక బాధ్యత నేర్పించాలి. పెద్దల బాగో గులను పట్టించుకోవడం తెలియజేయాలి.

– కృష్ణవేణి, మహిళా సంక్షేమ శాఖ జిల్లా అధికారి

పెరుగుతున్న బాధితులు..

పిల్లలు ఆదుకోవడం లేదంటూ అధికారులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గత ఏడాది అలాంటి 487 కేసులు నమోదయ్యాయి. పిల్లలు ఆస్తులు తీసుకుని అన్నం పెట్టడం లేదని వారంతా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. వాటిలో 369 కేసులను అధికారులు పరిష్కరించారు. కొందరు తల్లిదండ్రులు కేసులు పెట్టేందుకు ఇష్టపడక వృద్దాశ్రమాల్లో ఉంటున్నారు. జిల్లాలో 12 వృద్దాశ్రమాలు ఉంటే అందులో మూడు మాత్రమే ఉచితంగా ఉన్నాయి. మిగిలినవాటిల్లో వారి స్థోమతను బట్టి డబ్బులు కట్టాల్సి వస్తోంది. వృద్ధుల కోసం అధికారులు రెస్క్యూ వాహనం ఏర్పాటు చేశారు. పిల్లల ఆదరణకు నోచుకోని వారు 14567 టోల్‌ప్రీ నెంబర్‌కు పోన్‌ చేస్తే ఆ తల్లిదండ్రులను తీసుకొచ్చి రక్షణ కల్పిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మలి సంధ్యలో మనోవేదన!1
1/1

మలి సంధ్యలో మనోవేదన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement