
ఖండాంతరాలు దాటిన ‘కీర్తి’
ఫ ఫుడ్ ప్రాసెసింగ్‌లో రాణిస్తున్న తొండ గ్రామవాసి ఓడపల్లి కీర్తిప్రియ
ఫ విదేశాలకు కూరగాయల ఒరుగులు మార్కెటింగ్ చేస్తున్న యువతి
తిరుమలగిరి (తుంగతుర్తి): ఉన్నత చదువులు చదివిన ఆ యువతి పెద్ద కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిని కాదని సొంత ఊరిలోనే ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఏర్పాటు చేసింది. స్థానికంగా దొరికే కూరగాయలతో తయారు చేసిన (ఒరుగులు, పొడులు) ఉత్పత్తులను అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేస్తూ యువ పారిశ్రామికవేత్తగా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన ఓడపల్లి కీర్తిప్రియ. తొండ గ్రామానికి చెందిన ఓడపల్లి వెంకన్న, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుర్లు. వీరిలో రెండవ కూతురు కీర్తిప్రియ బిట్స్‌పిలానిలో బీఫార్మసి, ఐఏఎం కోల్‌కతా నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకుంది. పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది. సొంతూరుకు వచ్చినప్పుడు పంటలకు గిట్టుబాటు ధర రాక కొన్ని సమయాల్లో ఉత్పత్తులను వృథాగా పడేస్తూ నష్టపోతున్న రైతుల కష్టాలు ఆమెను కదిలించాయి. దీంతో కూరగాయలు పాడైపోకుండా వాటితో ఒరుగులు, పొడులు తయారీ చేసి విక్రయించే వ్యాపారానికి గ్రామం నుంచే శ్రీకారం చుట్టింది. రూ.3 కోట్లతో ఎకరం స్థలంలో గ్రామంలోనే నేచురల్ ఫీల్డ్స్ ఇండస్ట్రీస్ పేరుతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీలో సోలార్ డ్రయ్యర్‌ను ఏర్పాటు చేసి కొందరు మహిళలతో కూరగాయలను ముక్కలుగా కోయించి వాటిని ఎండబెట్టి పొడులుగా మార్చి ప్యాకింగ్ చేసి ఖో(కేఓహెచ్) పేరుతో మార్కెటింగ్ చేస్తోంది.
అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి..
రసాయనాల ప్రభావం లేకుండా సేంద్రియ విధానంతో స్థానిక రైతులతో కూరగాయలు, పండ్లను పండించి వాటిని ఇక్కడే ప్రాసెస్ చేసి వ్యాపారం చేస్తోంది. రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, క్యారట్, బీట్ రూట్, ఉల్లిగడ్డ, బెండకాయ, పచ్చి మిర్చి, టమాట, పాలకూర, గోంగూర, మునగ, అరటి పువ్వు, సపోట, మామిడి తదితర పండ్లను ఎండబెట్టి నాణ్యతలో రాజీపడకుండా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను తయారు చేయిస్తోంది. ఈ ఉత్పత్తుల్లో పోషకాలు పుష్కలంగా ఉండడంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆర్డర్లు పెరిగాయి. మనదేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు అమెరికా, యూరప్ దేశాలకు ఫుడ్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఏడాదికి రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు టర్నోవర్ సాధిస్తోంది.
మహిళలకు ఉపాధి..
సొంత గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో 20 మంది మహిళలకు రోజూ ఉపాధి కల్పిస్తోంది కీర్తిప్రియ. వీరు మూడు షిప్టుల్లో పనిచేస్తూ కూరగాయల పొడులు, ఒరుగులను ప్యాకింగ్ చేసి ఎగుమతికి సిద్ధం చేస్తుంటారు. ఏడాది పొడవునా స్థానికంగా ఉపాధి లభిస్తుండడంతో ఎంతో ఆనందంగా పని చేసుకుంటున్నామని మహిళలు అంటున్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే కంపెనీ ఏర్పాటు
ఉన్నత చదువులు చదివినప్పకీ ఎక్కడో ఉద్యోగం చేయకుండా మా సొంత గ్రామంలోనే ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఏర్పాటు చేసి కొందరి మహిళలకు ఉపాధి కల్పిస్తూ వ్యాపారరంగంలో రాణిస్తువడం చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ కంపెనీని నడిపిస్తున్నాను. – ఓడపల్లి కీర్తిప్రియ

ఖండాంతరాలు దాటిన ‘కీర్తి’
Comments
Please login to add a commentAdd a comment