నిరుద్యోగ యువతే టార్గెట్..
సూర్యాపేట టౌన్ : నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేసిన నకిలీ డీఎస్పీని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ కేసు వివరాలను ఎస్పీ కె. నర్సింహ విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నకిలీ డీఎస్పీ అవతారమెత్తాడు. తాను డీఎస్పీ అని చెప్పుకుంటూ పలువురిని పరిచయం చేసుకొని అమాయకులైన నిరుద్యోగ యువతకు పోలీస్, సివిల్ సప్లయ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ బురిడీ కొట్టించాడు. కోదాడలో ఒక అమ్మాయికి ఎస్‌ఐ ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె వద్ద రూ.36లక్షలు వసూలు చేశాడు. అదేవిధంగా ఏపీలోని మార్టూర్‌కు చెందిన వ్యక్తికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని, గురజాలకు చెందిన మరో వ్యక్తికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని పరారీలో ఉన్నాడు. కోదాడకు చెందిన అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సూర్యాపేట పట్టణ పోలీసులు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీగ్రాండ్ హోటల్ వద్ద శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద రూ.18లక్షల నగదు, కారు, పోలీస్ యూనిఫాం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిపై గతలంలో పలు కేసులు ఉండగా.. 2022లో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చినట్లు ఎస్పీ చెప్పారు. ఈ కేసును ఛేదించిన సూర్యాపేట పట్టణ సీఐ పీవీ రాఘవులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్‌రావు, డీఎస్పీ రవి, పట్టణ సీఐ పీవీ రాఘవులు పాల్గొన్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టించిన నకిలీ డీఎస్పీ
నిందితుడిని అరెస్ట్ చేసి
రిమాండ్‌కు తరలించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment